డిసెంబర్ 19న భూమికి ముప్పు.. నాసా హైఅలెర్ట్.. ఏం జరుగుతోంది?
నాసా శాస్త్రవేత్తల ప్రకారం.. ఇప్పటివరకు దీని కక్ష్య భూమిని నేరుగా ఢీకొట్టేలా లేదు అని స్పష్టమైంది. అయితే దీని కదలికలు ఊహించలేనివి కావడంతో కచ్చితమైన భరోసా ఇవ్వలేమని వారు చెబుతున్నారు.
By: A.N.Kumar | 27 Oct 2025 8:31 PM ISTమన సౌర వ్యవస్థ వైపు దూసుకొస్తున్న '3I/ATLAS' అనే అంతరిక్ష వస్తువుపై నాసా (NASA) సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు ఉత్కంఠతో ఉన్నారు. ఈ ఇంటర్‌స్టెల్లార్ (నక్షత్రాంతర) తోకచుక్క డిసెంబర్ 19, 2025న భూమికి అత్యంత దగ్గరగా రానుండటంతో దీనిపై హై-అలెర్ట్ ప్రకటించారు.
* '3I/ATLAS': ఒక ఇంటర్‌స్టెల్లార్ రహస్యం
జూలై 1న చిలీలో గల నాసా ATLAS టెలిస్కోప్ ద్వారా ఈ ఆబ్జెక్ట్‌ను తొలిసారిగా గుర్తించారు. ఇది సాధారణ తోకచుక్కల మాదిరిగా కాకుండా వింత లక్షణాలను ప్రదర్శిస్తోంది. అందుకే దీనిని చుట్టుముట్టిన చర్చలు, రహస్య వాదనలు ఊపందుకున్నాయి. ఈ తోకచుక్క నవంబర్ 29న సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లనుంది.
* గ్రహాంతర ప్రోబ్‌గా అనుమానం: ప్రొఫెసర్ అవీ లోబ్ సంచలన వ్యాఖ్యలు
హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ అవీ లోబ్ ఈ '3I/ATLAS'పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది సహజంగా ఏర్పడిన తోకచుక్క కాకపోవచ్చని, బదులుగా, ఇది గ్రహాంతరవాసులు పంపిన ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్ లేదా ప్రోబ్ అయి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిని నిరూపించడానికి లోబ్ 8 వింత లక్షణాలను పేర్కొన్నారు దీని కక్ష్య మార్స్, వీనస్, జూపిటర్‌ల కక్ష్యలతో దాదాపు ఖచ్చితంగా సరిపోతోంది. యాదృచ్ఛికంగా జరగడం అసాధ్యమని లోబ్ వాదన.
సూర్యుని వైపు ఇంధన విడుదల
సాధారణ తోకచుక్కలు సూర్యుడి వేడికి వ్యతిరేక దిశలో గ్యాస్ విడుదల చేస్తాయి, కానీ ఇది విరుద్ధ దిశలో స్పేస్ మెటీరియల్‌ను విడుదల చేస్తోంది, ఇది ఒక రకమైన 'ఇంజెక్ట్ చేయడం' లాగా కనిపిస్తోంది. దాదాపు 20 కిలోమీటర్ల వ్యాసార్థం.. 33 బిలియన్ టన్నుల బరువుతో ఇది అత్యంత భారీగా ఉంది. మార్స్, వీనస్, జూపిటర్‌లకు అతి దగ్గరగా, ఎవరో పర్ఫెక్ట్‌గా ట్యూన్ చేసినట్లు ప్రయాణిస్తోంది. దీని గ్యాస్ ట్రైల్స్‌లో సాధారణంగా ఉండాల్సిన దానికంటే నికెల్ మోతాదు ఎక్కువగా ఉండటం కొత్త ఆవిష్కరణ. ఇతర తోకచుక్కలతో పోలిస్తే ఇందులో కేవలం 4% మాత్రమే నీటి భాగం ఉంది, ఇది విపరీతంగా తక్కువ. ఇది అనూహ్యంగా కాంతిని రిఫ్లెక్ట్ చేస్తూ, అజ్ఞాత నిర్మాణం ఉన్నట్టుగా సూచిస్తోంది. 1977లో గుర్తించినట్లుగా, "Wow! Signal" తరహా రేడియో తరంగాలు దీని నుండి వెలువడుతున్నాయని లోబ్ పేర్కొన్నారు.
నాసా - ప్రపంచ సంస్థల అప్రమత్తత
ఈ వింత లక్షణాలు.. లోబ్ యొక్క సిద్ధాంతం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు అప్రమత్తమయ్యాయి. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA), చైనీస్ స్పేస్ ఏజెన్సీ అన్నీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ వార్నింగ్ నెట్‌వర్క్ (IAWN) దీనిపై స్పెషల్ స్టడీని ప్రారంభించింది. నవంబర్ 27 నుండి జనవరి 27 వరకు ప్రపంచవ్యాప్త ఖగోళ శాస్త్రవేత్తలు పాల్గొనే పరిశోధన జరగనుంది.
* భూమికి ముప్పు ఉందా?
నాసా శాస్త్రవేత్తల ప్రకారం.. ఇప్పటివరకు దీని కక్ష్య భూమిని నేరుగా ఢీకొట్టేలా లేదు అని స్పష్టమైంది. అయితే దీని కదలికలు ఊహించలేనివి కావడంతో కచ్చితమైన భరోసా ఇవ్వలేమని వారు చెబుతున్నారు. డిసెంబర్ 19న ఇది భూమికి సురక్షితమైన దూరంలోనే ఉంటుందని ఆశిస్తున్నారు.
* మార్స్ నుండి కీలక సమాచారం కోసం ప్రయత్నాలు
ప్రస్తుతం '3I/ATLAS' మార్స్ నుండి 29 మిలియన్ కిలోమీటర్ల పరిధిలోకి చేరుతోంది. మార్స్ చుట్టూ తిరుగుతున్న నాసా.. ESA ఆర్బిటర్ల ద్వారా దీని అసలు స్వరూపంపై కీలక డేటా లభించే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు దీని యొక్క 30 కిలోమీటర్ల పిక్సెల్ రిజల్యూషన్‌తో ఫొటో తీయాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ డేటా ద్వారా ఇది తోకచుక్కనా లేక గ్రహాంతర ప్రోబ్‌నా అనే ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం ఉంది.
డిసెంబర్ 19 తర్వాతే '3I/ATLAS' యొక్క నిజమైన గుర్తింపు.. ఉద్దేశ్యం ఏమిటనేది పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఒకవేళ ఇది నిజంగా గ్రహాంతర నౌక అయితే, ఇది మానవ చరిత్రలోనే అతి పెద్ద అంతరిక్ష ఆవిష్కరణగా నిలిచిపోవడం ఖాయం.
