Begin typing your search above and press return to search.

3000 ఏళ్ల క్రితమే అత్యాధునిక సాంకేతికత.. 'టెర్రకోట' పద్ధతితో ఇళ్లంతా ఏసీ..

ప్రస్తుత కాలంలో ఎండ వేడి నుంచి తట్టుకోవడానికి ఎయిర్ కండిషనర్లు తప్పనిసరి అని మనం భావిస్తున్నాం.

By:  Tupaki Political Desk   |   20 April 2026 5:00 PM IST
3000 ఏళ్ల క్రితమే అత్యాధునిక సాంకేతికత.. టెర్రకోట పద్ధతితో ఇళ్లంతా ఏసీ..
X

వేసవి వచ్చిందంటే చాలు ఏసీలు, కూలర్లకు పని చెప్పాల్సిందే.. అవి లేకపోతే క్షణం కూడా ఉండలేని పరిస్థితి. ఏసీ బిల్లులు చూసి బెంబేలెత్తిపోతున్న తరుణంలో, మన పూర్వీకులు 3,000 ఏళ్ల క్రితమే వాడిన ఈ 'టెర్రకోట' సాంకేతికత గురించి తెలుసుకోవడం ఒక గొప్ప ఉపశమనం. సింధు లోయ నాగరికత కాలం నాటి ఈ విజ్ఞానం నేటి ఆధునిక ఇంజినీరింగ్‌కు సవాల్ విసురుతోంది. ప్రకృతికి హాని చేయకుండా, పైసా ఖర్చు లేకుండా ఇంటిని చల్లబరిచే ఈ అద్భుత ప్రక్రియపై ఏంటి.. ఎంత ఖర్చవుతుందో తెలుసుకుందాం..

3000 ఏళ్ల నాటి భారతీయ ‘టెర్రకోట’ మ్యాజిక్..

ప్రస్తుత కాలంలో ఎండ వేడి నుంచి తట్టుకోవడానికి ఎయిర్ కండిషనర్లు తప్పనిసరి అని మనం భావిస్తున్నాం. కానీ, ఆధునిక యంత్రాలు ఏవీ లేని కాలంలోనే భారతీయులు తమ ఇళ్లను శీతలీకరించుకోవడానికి అత్యంత శాస్త్రీయమైన పద్ధతులను అనుసరించారు. అందులో ప్రధానమైనది 'టెర్రకోట' వాడకం. తాజాగా జరిగిన అధ్యయనాల ప్రకారం, ఈ పురాతన పద్ధతులను వాడడం ద్వారా ఇంట్లోని వేడిని సహజంగానే 50 శాతం వరకు తగ్గించవచ్చని తేలింది.

దీని వెనుక ఉన్న విజ్ఞానం

మట్టి కుండలో నీళ్లు ఎందుకు చల్లగా ఉంటాయి? అనే చిన్న ప్రశ్నలో ఈ పెద్ద టెక్నాలజీ దాగి ఉంది. టెర్రకోట లేదంటే కాల్చిన మట్టిలో వేల సంఖ్యలో సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. మన శరీరానికి చెమట పట్టినప్పుడు గాలి తగిలితే చల్లదనం ఎలా కలుగుతుందో, టెర్రకోట కూడా అలాగే పనిచేస్తుంది. రంధ్రాల ద్వారా బయటకు వచ్చే తేమ ఆవిరైనప్పుడు అది తన చుట్టూ ఉన్న వేడిని గ్రహించి, లోపల ఉన్న వాతావరణాన్ని చల్లబరుస్తుంది. ఈ ప్రక్రియ పూర్తిగా సహజసిద్ధంగా జరుగుతుంది కాబట్టి ఎటువంటి విద్యుత్ శక్తి అవసరం లేదు.

ఆధునిక నిర్మాణంలో ‘ఫిల్లర్ స్లాబ్’ విప్లవం..

పురాతన కాలంలో ఇళ్ల పైకప్పులపై మట్టి పెంకులు వేసేవారు. ఇప్పుడు అదే సూత్రాన్ని ఆధునిక కాంక్రీట్ ఇళ్లకు కూడా అన్వయిస్తున్నారు. దీనినే ‘ఫిల్లర్ స్లాబ్’ టెక్నిక్ అని పిలుస్తారు. స్లాబ్ వేసే సమయంలో స్టీల్ రాడ్ల మధ్య ఖాళీల్లో తలక్రిందులుగా ఉన్న టెర్రకోట కుండలను అమర్చుతారు. వాటిపై కాంక్రీట్ పోస్తారు. కుండల లోపల ఉండే గాలి ఒక ఇన్సులేటర్‌లా పనిచేస్తుంది. బయట నుంచి వచ్చే ఎండ వేడిని ఈ గాలి పొర అడ్డుకుంటుంది, ఫలితంగా పైకప్పు వేడెక్కదు. కాంక్రీట్ వాడకం తక్కువగా ఉండడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా, స్లాబ్ బరువు కూడా తగ్గుతుంది.

వేసవిలో చల్లదనం.. శీతాకాలంలో వెచ్చదనం!

టెర్రకోట వల్ల కలిగే మరో అద్భుత ప్రయోజనం కూడా ఉంది. ఇది కేవలం చల్లబరచడానికే కాదు, ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి ఉపయోగపడుతుంది. కుండల లోపల ఉండే గాలి పొరలు వేసవిలో బయటి వేడిని లోపలికి రాకుండా అడ్డుకుంటే, శీతాకాలంలో ఇంట్లోని వెచ్చదనం బయటకు పోకుండా కాపాడతాయి. అంటే, ఒకసారి ఇలాంటి ఇల్లు నిర్మించుకుంటే ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.

పర్యావరణ మిత్రుడు

టెర్రకోట అంటే ఇటాలియన్ భాషలో ‘కాల్చిన భూమి’. ఇది సహజ సిద్ధమైన మట్టితో తయారవుతుంది. కాబట్టి పూర్తిగా పర్యావరణ అనుకూలం. ప్లాస్టిక్ లేదా సింథటిక్ ఇన్సులేషన్ మెటీరియల్స్ లాగా ఇది విషవాయువులను విడుదల చేయదు. పైగా ఇల్లు కూల్చివేసినా ఈ మట్టి మళ్ళీ భూమిలో కలిసిపోతుంది.

ఈ రోజు మనం ఏసీల వల్ల గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తూ భూమిని వేడి చేస్తున్నాం. దీనికి పరిష్కారం 3000 ఏళ్ల క్రితమే మన భారతీయులు కనిపెట్టారు. పెద్ద పెద్ద విల్లాలు, ఆధునిక అపార్ట్‌మెంట్లలో కూడా ఇప్పుడు ఈ 'టెర్రకోట టైల్స్', 'ఫిల్లర్ స్లాబ్స్' వాడుతున్నారు. ఖర్చు తక్కువ, ఆరోగ్యం, పర్యావరణానికి మేలు చేసే ఈ పురాతన సాంకేతికతను మళ్ళీ మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.