రూ.3,000 కోట్ల ‘పాకిస్తాన్ డ్రగ్స్ దందా’.. అరేబియా సముద్రంలో భారత దళాల వీరోచిత ఆపరేషన్
తమ పాకిస్తాన్ బోట్ల ద్వారా కాకుండా ఇరాన్ బోటును అద్దెకు తీసుకొని అందులో 3వేల కోట్ల డ్రగ్స్ తో ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి దొంగచాటుగా మన లక్ష్య ద్వీప్ వరకూ వచ్చేశారు.
By: A.N.Kumar | 30 Sept 2026 1:41 PM ISTఅసలే కరుడుగట్టిన ఉగ్రవాద పాకిస్తానీలు.. భారత్ ఎప్పుడు ఎలా దెబ్బకొట్టాలని చూస్తారు. ఇది వరకూ సముద్ర మార్గంలో వచ్చిన ముంబై మహానగరంలో సృష్టించిన పాక్ ఉగ్రవాద మూకల ఆగడాలకు దేశం శోకసంద్రమైంది. పాకిస్తాన్ నుంచి సముద్ర మార్గంలో ఇప్పటికీ పాకిస్తానీ కుట్రలు, కుతంత్రాలు సాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు పాకీలు రూటు మార్చారు. తమ పాకిస్తాన్ బోట్ల ద్వారా కాకుండా ఇరాన్ బోటును అద్దెకు తీసుకొని అందులో 3వేల కోట్ల డ్రగ్స్ తో ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి దొంగచాటుగా మన లక్ష్య ద్వీప్ వరకూ వచ్చేశారు. కానీ మన కోస్ట్ గార్డ్ , గుజరాత్ ఏటీసీ పోలీసులు పకడ్బందీగా క్యాచ్ చేయడంతో ఓ భారీ డ్రగ్స్ దందా బయటపడింది.
భారతమాత భద్రతకు ఏమాత్రం ముప్పు వాటిల్లినా.. శత్రువుల కుట్రలను తిప్పికొట్టడంలో మన భద్రతా దళాలు ఎల్లప్పుడూ అగ్రభాగాన నిలుస్తాయి. తాజాగా అరేబియా సముద్ర గర్భంలో భారత తీర ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) సంయుక్తంగా చేపట్టిన ఒక సాహసోపేతమైన ఆపరేషన్.. దేశ సరిహద్దులు ఎంత భద్రంగా ఉన్నాయో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
సముద్ర మార్గం గుండా భారతదేశంలోకి మాదకద్రవ్యాలను నింపి యువత భవిష్యత్తును నాశనం చేయాలనే దుర్మార్గపు ఆలోచనకు మన జవాన్లు కోలుకోలేని దెబ్బ కొట్టారు. అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.3,000 కోట్లకు పైగా విలువైన 526 కిలోల అత్యంత ప్రమాదకరమైన హెరాయిన్, మెథాంఫెటమైన్‌లను పట్టుకుని పాకిస్తానీ స్మగ్లర్ల నెట్‌వర్క్‌ను తుత్తునియలు చేశారు.
అర్ధరాత్రి వేట.. ఉత్కంఠభరిత ఆపరేషన్
సెప్టెంబర్ 25వ తేదీన లక్షద్వీప్ సమీపంలో అరేబియా సముద్రపు అలలపై అనుమానాస్పదంగా కదులుతున్న ఒక ఇరాన్ బోటును భారత కోస్ట్ గార్డ్ రాడార్లు పసిగట్టాయి. అనుమానం వచ్చిన నిఘా వర్గాలు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ పడవను వెంబడించడం ప్రారంభించాయి. ఆకాశంలో నిఘా విమానాలు.. నీటిపై అత్యంత వేగవంతమైన కోస్ట్ గార్డ్ నౌకలు ఆ బోటును చుట్టుముట్టాయి.
అధికారులను చూసి పారిపోయేందుకు యత్నించిన స్మగ్లర్లను మన వీర జవాన్లు ప్రాణాలకు తెగించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పడవను అంగుళం అంగుళం తనిఖీ చేయగా లభ్యమైన డ్రగ్స్ రాశిని చూసి అధికారులు సైతం విస్తుపోయారు.
ఇరాన్ బోటు.. పాకిస్తాన్ సిబ్బంది.. బయటపడ్డ పక్కా ప్లాన్
ఈ ఆపరేషన్‌లో అత్యంత సంచలనాత్మక విషయం ఏమిటంటే.. స్వాధీనం చేసుకున్న ఆ పడవ ఇరాన్ దేశానికి చెందినది కాగా.. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు సిబ్బంది పాకిస్తాన్‌కు చెందిన నిందితులుగా తేలింది. భారతదేశంలోకి అక్రమంగా విషపూరిత డ్రగ్స్‌ను చొరబెట్టి ఇక్కడి శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేసేందుకు సరిహద్దు అవతలి నుంచి సాగుతున్న కుట్రకు ఇది సజీవ సాక్ష్యంగా నిలిచింది.
దేశ రక్షణలో మరో చారిత్రాత్మక విజయం
అహోరాత్రులు అరేబియా సముద్రంలో కంటికి రెప్పలా కాపలా కాస్తూ దేశ సరిహద్దులను రక్షిస్తున్న మన భద్రతా దళాల అప్రమత్తత, వ్యూహాత్మక చతురతను ఈ విజయం ప్రతిబింబిస్తుంది. ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉన్నామని మన జవాన్లు మరోసారి రుజువు చేశారు.
ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న ఐదుగురు పాకిస్తానీ స్మగ్లర్లను తీవ్రంగా విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి బయలుదేరాయి? భారతదేశంలో ఎవరికి అందజేయాల్సి ఉంది? ఈ అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనే కోణంలో దర్యాప్తు వేగవంతమైంది. మన భద్రతా దళాల ఈ వీరోచిత పోరాటం భారతీయులందరిలోనూ గర్వాన్ని, ధైర్యాన్ని నింపుతోంది.
