Begin typing your search above and press return to search.

ఒక్క మహిళ పెట్టిన శాపం.. వందల ఏళ్లుగా దీపావళికి దూరంగా గ్రామం!

దేశమంతా దీపావళి వేడుకలు జరుపుకుంటే, హిమాచల్ ప్రదేశ్‌లోని సమ్మూ గ్రామం మాత్రం పండుగకు దూరంగా ఉంటుంది. వందల ఏళ్ల క్రితం భర్త మరణంతో ఆత్మాహుతి చేసుకున్న ఓ మహిళ గ్రామానికి శాపం పెట్టిందని స్థానికుల నమ్మకం. దీపావళి జరిపితే ప్రమాదాలు జరుగుతాయని భావిస్తూ టపాసులు కాల్చకుండా, ఆడంబరాలకు దూరంగా ఉంటారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   7 Nov 2026 8:14 AM IST
ఒక్క మహిళ పెట్టిన శాపం.. వందల ఏళ్లుగా దీపావళికి దూరంగా గ్రామం!
X

దీపావళి అంటే ప్రతి ఇంట్లో దీపాల వెలుగులు, టపాసుల శబ్దాలు, కొత్త బట్టలు, స్వీట్ల సందడి కనిపిస్తుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. కానీ భారతదేశంలో ఒక గ్రామం మాత్రం దీపావళి రోజున చీకట్లోనే ఉంటుంది. వందల ఏళ్లుగా అక్కడి ప్రజలు ఈ పండుగకు దూరంగా ఉంటున్నారు. దీని వెనుక ఒక పాత శాపం ఉందని గ్రామస్థులు నమ్ముతున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో సమ్మూ అనే గ్రామం ఉంది. జిల్లా కేంద్రానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. దేశమంతా దీపావళి వేడుకలు జరుపుకుంటున్నా, ఈ గ్రామంలో మాత్రం పండుగ సందడి కనిపించదు. కనీసం టపాసులు కాల్చడం, పెద్ద ఎత్తున వేడుకలు చేసుకోవడం కూడా ఇక్కడి ప్రజలు ఇష్టపడరు.

గ్రామస్థులు చెప్పే కథ ప్రకారం.. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఒక మహిళ తన భర్తతో కలిసి జీవించేది. ఆమె భర్త స్థానిక రాజు సైన్యంలో సైనికుడిగా పనిచేసేవాడు. ఒకసారి దీపావళి పండుగకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఆమె భర్త మరణించిన వార్త వచ్చింది. ఆయన మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు.

అప్పటికి ఆ మహిళ గర్భవతిగా ఉంది. భర్త మరణాన్ని తట్టుకోలేక తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చివరకు భర్త చితిపై తాను కూడా ఆత్మాహుతి చేసుకున్నట్లు గ్రామస్థులు చెబుతారు. అలా ప్రాణాలు విడిచే ముందు ఆమె ఒక శాపం పెట్టిందని వారి నమ్మకం. ఇకపై ఈ గ్రామంలో ఎవరూ దీపావళి పండుగ జరుపుకోలేరని శపించిందట.

ఆమె శాపం కారణంగానే గ్రామంలో దీపావళి జరుపుకుంటే ఎవరో ఒకరు చనిపోవడం లేదా ఏదైనా ప్రమాదం జరగడం జరుగుతుందని స్థానికులు నమ్ముతున్నారు. అందుకే ఈ రోజున ఎలాంటి హడావుడి చేయరు. కనీసం ఇంట్లో దీపాలు వెలిగించు కోవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. టపాసులు కాల్చడం, ఆడంబరంగా వేడుకలు చేసుకోవడం మాత్రం చేయరు.

ఈ ఆచారాన్ని మార్చడానికి గతంలో చాలాసార్లు ప్రయత్నాలు కూడా జరిగాయి. హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడేళ్ల క్రితం గ్రామస్థులంతా కలిసి పెద్ద యజ్ఞం కూడా చేశారు. అయినప్పటికీ తమ గ్రామంపై శాపం ప్రభావం ఉందని వారు ఇప్పటికీ నమ్ముతున్నారు.

కొంతమంది గ్రామస్థులు దీపావళి రోజున ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా ఇష్టపడరు. కాలం మారినా, తరాలు మారినా ఈ నమ్మకం మాత్రం మారలేదు. దీపావళి వెలుగులతో దేశమంతా మెరిసిపోతుంటే, సమ్మూ గ్రామం మాత్రం తన పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నిశ్శబ్దంగా ఉంటోంది.