ఏపీలో పెద్ద స్కెచ్ వేసిన మావోయిస్టులు.. అందుకే విజయవాడలో మకాం?
ముఖ్యంగా రాష్ట్రరాజధాని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మావోయిస్టులు మకాం వేయడం సంచలనంగా మారింది.
By: Tupaki Political Desk | 19 Nov 2025 4:00 PM ISTఏపీలో ఒక్కసారిగా మావోయిస్టుల అలజడి భయాందోళనలకు గురిచేస్తోంది. కొన్నేళ్లుగా జాడలేని మావోయిస్టులు భారీ సంఖ్యలో రాష్ట్రానికి రావడం, ప్రధాన నగరాల్లో తలదాచుకోవడంతోపాటు వారి వెంట భారీ ఆయుధ సామగ్రిని గుర్తించడంతో అంతా ఉలికిపాటుకు లోనయ్యారు. ప్రధానంగా అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటరు జరిగిన గంటల వ్యవధిలోనే విజయవాడ, ఏలూరు, కాకినాడ, అమలాపురంలో తలదాచుకున్న 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక్క విజయవాడ నగరంలోనే 30 మంది పట్టుబడటం చూస్తే.. వారు ఏదో భారీ ప్లాన్ తోనే ఇక్కడికి వచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ముఖ్యంగా రాష్ట్రరాజధాని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మావోయిస్టులు మకాం వేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం అధికారికంగా అమరావతి రాజధానిగా ఉన్నప్పటికీ విజయవాడ కేంద్రంగానే మొత్తం రాజకీయం నడుస్తోంది. ఈ నగరంలోనే వీవీఐపీ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతోపాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా మొత్తం రాజకీయ, అధికార యంత్రాంగం అంతా విజయవాడ మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు విజయవాడలో మాటు వేయడంపై అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
దండకారణ్యంలో పూర్తిగా దెబ్బతిన్న మావోయిస్టులు రాష్ట్రంలో ఏదైనా దాడి చేసి తమ ఉనికిని చాటుకోవాలనే ఆలోచనతోనే రాష్ట్ర రాజధాని పక్కనే ఉన్న విజయవాడను ఎంచుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా వీవీఐపీ మూమెంట్ ఎక్కువగా ఉన్న విజయవాడలో మావోయిస్టు అగ్రనేతలు దేవ్ జీ, హిడ్మా అనుచరులు ఉండటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టులు పట్టుబడిన న్యూ ఆటోనగర్ పక్కనే ఉన్న పోరంకిలో ఓ కన్వెన్షన్ హాలులో జరిగే కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ వస్తుంటారు. ఈ కారణంగానే మావోయిస్టులు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
కాగా, పది రోజుల క్రితం కూలీల ముసుగులో వచ్చిన మావోయిస్టులు న్యూఆటోనగర్ లో ఒక భవనంలోని మూడో అంతస్తును అద్దెకు తీసుకున్నారు. పూర్తిగా కమర్షియల్ కాంప్లెక్స్ అయిన ఆ భవనంలో మావోయిస్టులు అద్దెకు తీసుకున్న ప్లాట్ చుట్టూ షెట్టర్లు మాత్రమే ఉన్నాయి. అలాంటి చోట పది రోజులుగా మాటు వేసిన మావోయిస్టులకు ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం, రాత్రి భోజనాలను ఒక కారులో తెచ్చి ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. పది రోజుల క్రితం భవనంలోకి వెళ్లిన 30 మంది మావోయిస్టులు ఒక్కరు కూడా ఎప్పుడూ బయటకు రాలేదని అంటున్నారు.
కానీ, వారికి రోజూ ఆహారం ఇస్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు కారు డ్రైవరును ప్రశ్నించారని సమాచారం. కూలి పనులకు వచ్చారని, తమ కంపెనీ ప్రారంభానికి సమయం ఉన్నందున వారికి రోజూ భోజనాలు తెచ్చి ఇస్తున్నట్లు ఆ కారు డ్రైవర్ చెప్పాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. న్యూ ఆటోనగర్ ప్రాంతంలో ఇలా కూలి పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి జనాలు రావడం సహజమే కనుక స్థానికులు వారిని కూలీలుగానే భావించారు. అయితే పోలీసులు అరెస్టు చేసిన తర్వాత న్యూ ఆటోనగర్ ప్రాంత వాసులు ఉలిక్కి పడ్డారు. ఇక వారికి మూడు పూటల ఆహారం సరఫరా చేసింది ఎవరు అన్నది తేలాల్సివుంది. విజయవాడకు చెందిన ఓ మహిళ మావోయిస్టు సానుభూతిపరురాలుగా ఉన్నారని, ఆమె మావోయిస్టులకు ఆహార ఏర్పాట్లు చేసిందని అంటున్నారు. ఆ మహిళ పేరు తెలుసుకోవాలని నగర వాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
