Begin typing your search above and press return to search.

30 రోజుల జైలు బిల్లు....ఆయన మీద కోపంతో ?

30 రోజులలో జైలుట. ఇదే ఇపుడు దేశంలో హాట్ టాపిక్. జైలుకు వెళ్ళారా పదవి హుష్ కాకీ అయిపోతుంది. ఎన్నో మెట్లు ఎక్కి వచ్చిన సింహాసనం కాస్తా దెబ్బకు చేజారుతుంది.

By:  Satya P   |   22 Aug 2025 2:00 AM IST
30 రోజుల జైలు బిల్లు....ఆయన మీద కోపంతో ?
X

30 రోజులలో జైలుట. ఇదే ఇపుడు దేశంలో హాట్ టాపిక్. జైలుకు వెళ్ళారా పదవి హుష్ కాకీ అయిపోతుంది. ఎన్నో మెట్లు ఎక్కి వచ్చిన సింహాసనం కాస్తా దెబ్బకు చేజారుతుంది. దాంతో రాజకీయ జీవులలో ఆందోళన అయితే అధికంగా ఉంది. ఒక విధంగా ఈ బిల్లు అటు అధికార పక్షంలోనూ భారీ చర్చకు దారి తీస్తోంది. ఇదేమిటి ఈ బిల్లు అని అనుకుంటున్నారు. విపక్షం అయితే బీజేపీ మీద మండిపోతోంది. బుధవారం బిల్లుని లోక్ సభంలో కేంద్ర మంత్రి ప్రవేశపెట్టినప్పుడు విపక్ష సభ్యుల ఆగ్రహాలు ఏ విధంగా ఉన్నాయో అంతా చూశారు.

మూలాధారం ఆయనేనా :

ఈ బిల్లుని ప్రవేశపెడుతున్నపుడు ఎంతో కొంత వివాదం అవుతుందని బీజేపీ పెద్దలు తలచి ఉండొచ్చు కానీ మరీ రాద్ధాంతం జరుగుతుందని అసలు ఊహించకపోవచ్చు అంటున్నారు. కానీ జరిగిన తీరు వేరేగా ఉంది. అందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది. అయితే ఈ బిల్లు తాలూకా వేడి వాడి కొనసాగుతూనే ఉంది. ఇక ఈ బిల్లు మంచిదని కేంద్ర మంత్రి చెబుతూ ఒక ప్రెస్ మీట్ నే నిర్వహించారు. అందులో ఆయన చెప్పినది ఏంటంటే ఢిల్లీఇ సీఎం గా పాలించిన అరవింద్ కేజ్రీవాల్ వంటి వారి వల్లనే బిల్లు అన్నది. అయితే ఇది ఆయన పరోక్షంగానే ప్రస్తావించినా ఆయన గత ఏడాది వ్యవహరించిన తీరు వల్లనే ఈ బిల్లు పుట్టింది అన్నది అర్ధం చేసుకోవాల్సి ఉంది అంటున్నారు.

జైలు నుంచి పాలిస్తారా :

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆనాడు ఉన్న అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి ఆరు నెలల పాటు పాలించారు అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు ఆయన మీద లిక్కర్ స్కాం లో అన్ని ఆధారాలు చూసి కోర్టు ఆయనను జైలుకు పంపించింది. అయితే నైతికతను ఆయన పాటించలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. జైలుకు వెళ్ళినా రాజీనామా చేయకుండా అక్కడికే అధికారులను రప్పించుకుని మీటింగులు పెట్టారని అలా ఆయన జైలు నుంచి పాలించి రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేశారు అని దుయ్యబెట్టారు. ఇక తమిళనాడులో సెంథిల్ అనే ఒక డీఎంకే మంత్రి కూడా అరెస్టు అయి జైలుకి వెళ్ళినా తన పదవికి రాజీనామా చేయలేదని గుర్తు చేశారు కిషన్ రెడ్డి.

వారంతా రాజీనామా చేశారు :

ఇక తమ పార్టీకి చెందిన లాల్ కృష్ణ అద్వానీ మీద 1996లో హవాలా కేసు విషయంలో ఆరోపణలు వస్తే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తిరిగి కోర్టు పరంగా ఆయనకు ఊరట దక్కిన తరువాతనే 1998లో పోటీ చేసారని కిషన్ రెడ్డి చెబుతున్నారు. అంతే కాకుండా 2010 ప్రాంతంలో తమ నాయకుడు అమిత్ షా కూడా తన మీద ఆరోపణలు వస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి జైలుకు వెళ్ళారని అన్నారు. ఆ ఆరోపణలు వీగిపోయిన తరువాతన ఆయన పోటీ చేశారు అని గుర్తు చేశారు. ఇలా బీజేపీ వారు నైతికంగా తమను తాము నిరూపించుకున్నారని అంటున్నారు.

అంబేద్కర్ ఊహించలేదు కానీ :

రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఊహించలేదు కానీ లేకపోతే ఆనాడే ఇలాంటి చట్టం తీసుకుని వచ్చేవారు అని కిషన్ రెడ్డి అంటున్నారు. జైలు నుంచి పాలించడమేంటి అని ఆయన తప్పుపట్టారు. అప్పటికీ ఇప్పటికీ నేతలు నైతిక ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఈ తరహా బిల్లులు అవసరం పడుతున్నాయని చెప్పుకొచ్చి పూర్తిగా సమర్ధించుకున్నారు. ఇంకో వైపు చూస్తే ఈ బిల్లు పట్ల కాంగ్రెస్ కి ఎందుకు అక్కసు ఆగ్రహం అని కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.

వారు అసలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు అని నిలదీశారు. నిజానికి ఏ ఒక్క పార్టీ మీద కానీ వ్యక్తుల మీద కానీ దృష్టి పెట్టి ఈ బిల్లుని తీసుకుని రాలేదని ఆయన అన్నారు. ఇది కనుక చట్టం అయితే ఎవరు తప్పు చేస్తే వారికే శిక్ష పడుతుందని అన్నారు. ఆ శిక్ష కూడా కోర్టులు మాత్రమే నిర్ణయించగలవు అని ఆయన అంటున్నారు. అయితే కిషన్ రెడ్డి చెప్పింది బాగానే ఉంది కానీ వ్యవస్థలో లోపాలను ఆధారం చేసుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉంటాయనే కదా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి దీనికి మాత్రం కేంద్ర మంత్రి నుంచి సరైన జవాబు అయితే రావడం లేదని అంటున్నారు.