అన్నా డీఎంకే ఎమ్మెల్యేల మీద వేటు ?
తమిళనాడులో విజయ్ ప్రభుత్వం మంచి మెజారిటీతో బల నిరూపణ చేసుకుంది. అయితే అనేక రాజకీయ చిత్రాలు కూడా ఇక్కడే చోటు చేసుకున్నాయి.
By: Satya P | 13 May 2026 8:00 PM ISTతమిళనాడులో విజయ్ ప్రభుత్వం మంచి మెజారిటీతో బల నిరూపణ చేసుకుంది. అయితే అనేక రాజకీయ చిత్రాలు కూడా ఇక్కడే చోటు చేసుకున్నాయి. అన్నా డీఎంకేకి చెందిన ఎమ్మెల్యేలు చీలిపోయి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అయితే ఇక్కడే వీరి చర్య మీద సర్వత్రా చర్చ సాగుతోంది. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి ఓటు వేయడం అన్నది చూస్తే కనుక ఫిరాయింపు చట్టం ప్రకారం చెల్లదు. అనర్హత వేటు పడుతుంది. మరి విజయ్ ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసం అన్నా డీఎంకే కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసినట్లుగా తెలుస్తోంది. మరి వీరి మీద అన్నా డీఎంకే అధినేత పళనిస్వామి స్పీకర్ కి ఫిర్యాదు చేస్తారా ఆ మీదట స్పీకర్ ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అన్నదే బిగ్ డిస్కషన్ గా ఉంది.
ప్రభుత్వానికి ఓటు ఇలా :
తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ నాయకత్వంలో ఏర్పాటు అయిన కొత్త ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది ఓటు చేశారు ఇక వ్యతిరేకంగా 22 మంది ఓటు వేయడం జరిగింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డీఎంకే వాకౌట్ చేసింది. ఇక కీలక ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకేలో చీలిక సంభవించింది. టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని అధినేత హోదాలో పళనిస్వామి ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి విజయ్ ప్రభుత్వానికి 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఓటు వేయడం జరిగింది. దాంతో ఇపుడు వారి ఎమ్మెల్యే సభ్యత్వం ఏమి అవుతుంది అన్న చర్చకు తెర లేస్తోంది.
ఓటింగ్ దూరంగా ఉండాలని :
తమిళనాడు అసెంబ్లీలో మూడవ అతిపెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకేకు 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించారు. అయితే ఆ పార్టీలో సీనియర్ నేతలు అంతా కలిసి వేరు కుంపటి పెట్టారు. అలా చీలిక తెచ్చి విజయ్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇది అన్నా డీఎంకేలో ఎవరూ కూడా ఊహించని పరిణామం గా మారింది. ఈ రకమైన సీనియర్ నేతల తిరుగుబాటుతో మాజీ సీఎం అన్నా డీఎంకే అధినేత పళనిస్వామికి రాజకీయంగా గట్టి దెబ్బ తగిలింది అని అంటున్నారు
మూడవ వంతు గా ఉంటేనే :
ఫిరాయింపుల చట్టం మేరకు చూస్తే మొత్తం ఎమ్మెల్యేలలో మూడింట రెండు వంతుల మంది వేరు పడినపుడు అది చెల్లుతుంది. లేకపోతే ఒక ఎమ్మెల్యే గీత దాటినా లేక ఎక్కువ మంది పార్టీ లైన్ తప్పినా కూడా అనర్హత వేటు పడుతుంది. మరి అన్నా డీఎంకేకు ఉన్న 47 మంది ఎమ్మెల్యేలలో మూడింట రెండు వంతులు అంటే 31 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. అపుడే స్పీకర్ వారిని అసలైన అన్నా డీఎంకేగా గుర్తిస్తారు. వారికి చట్టబద్ధత ఉంటుంది. వారి సభ్యత్వం నిలబడుతుంది. కానీ 25 మంది మాత్రమే పార్టీ లైన్ దాటారు. కాబట్టి వీరి మీద అనర్హత వేటు కత్తి వేలాడుతుందా అన్న చర్చ సాగుతోంది.
విప్ జారీ చేయాల్సిందే :
అయితే వీరికి పార్టీ తరఫున విప్ జారీ చేశారా లేదా అన్నది చూడాల్సి ఉంది. దాని కంటే ముందు చీలిక వర్గాన్ని ప్రత్యేకంగా స్పీకర్ గుర్తించి మాట్లాడించారు. అంటే స్పీకర్ వారికి అధికార ముద్ర వేశారా అన్నది కూడా మరో పాయింట్. అదే కనుక జరిగితే ఈ ఎమ్మెల్యేల విషయంలో అన్నా డీఎంకే అధినాయకత్వం న్యాయస్థానాల ద్వారానే పోరాడాల్సి ఉంటుంది. ఎక్కడ పోరాడినా చివరికి స్పీకర్ విచక్షణాధికారం మీదనే ఆధారపడి నిర్ణయం ఉంటుంది. మొత్తం మీద చూస్తే కొత్త ప్రభుత్వంగా తమిళనాడులో కొత్త రాజకీయంగా వచ్చిన టీవీకే ప్రభుత్వం కూడా రొటీన్ గానే ఎమ్మెల్యేల ఆకర్ష్ కి దిగుతోందా అన్న చర్చ అయితే సాగుతోంది. తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని నిండు సభలో మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి చేసిన ఆరోపణలు ఈ సందర్భంగా గమనార్హం.
