Begin typing your search above and press return to search.

చావు ఎంత భయంకరంగా ఉంటుందో చూస్తారా? క్షణాల్లో ఊపిరి తీసేసిన పిడుగు.. షాకింగ్ వీడియో

పిడుగు నేరుగా 24 ఏళ్ల సోఫ్వాన్ అవాయే అనే యువ ఆటగాడిపై పడింది. నేల కొట్టిన చెట్టులా సోఫ్వాన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

By:  A.N.Kumar   |   6 Aug 2026 1:39 PM IST
చావు ఎంత భయంకరంగా ఉంటుందో చూస్తారా? క్షణాల్లో ఊపిరి తీసేసిన పిడుగు.. షాకింగ్ వీడియో
X

కళ్లముందే కలలు కనే వయసు... కాలికి బంతి దొరికితే గాల్లో తేలిపోయే ఉత్సాహం... కానీ అంతలోనే చావు రూపంలో ఒక పిడుగు వచ్చి పడితే? జీవితం ఎంత క్షణభంగురమో.. చావు ఎంత భయంకరంగా ఎదురవుతుందో ఊహించడానికే గుండె తలకిందులవుతుంది.

అది థాయ్‌లాండ్‌లోని నరాధివాట్ ప్రావిన్స్‌లో ఉన్న శాంటిప్‌హాప్ స్టేడియం. 'గోలోక్ ఎఫ్ఏ కప్-2026' సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. మైదానంలో ఆటగాళ్ల కేరింతలు, ప్రేక్షకుల ఈలలు, గెలుపు కోసం సాగుతున్న హోరాహోరీ పోరాటం... అంతా పండగ వాతావరణం. అప్పుడే వర్షం కూడా కాస్త తగ్గడంతో మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరిలోనూ హుషారు పెరిగింది. కానీ ఆ ఆనందం వెనుక ఎంతటి ఘోర కలికాలపు విషాదం దాగి ఉందో ఎవరూ ఊహించలేకపోయారు. ఆట ఎంతో వేగంగా సాగుతున్న ఆ క్షణంలో... ఆకాశం నుండి విరుచుకుపడిన ఒకే ఒక్క భయంకరమైన పిడుగు ఆ మైదానాన్ని శ్మశాన నిశ్శబ్దంగా మార్చేసింది!

పిడుగు నేరుగా 24 ఏళ్ల సోఫ్వాన్ అవాయే అనే యువ ఆటగాడిపై పడింది. నేల కొట్టిన చెట్టులా సోఫ్వాన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇటీవలే 'యాలా ఎఫ్‌సీ' క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఫుట్‌బాల్ ప్రపంచంలో తన ముద్ర వేయాలని నింగింత ఆశలతో అడుగులేస్తున్న ఆ పసి ప్రాణం... క్షణాల్లో అనంత వాయువుల్లో కలసిపోయింది. తోటి ఆటగాళ్లు, వైద్య బృందం ఎంతో ఆరాటంతో సీపీఆర్ చేస్తూ అతడిని బతికించుకోవాలని తపించారు. "కన్ను తెరవరా సోఫ్వాన్ " అంటూ వారు చేసిన ప్రయత్నాలు.. ఆ దేవుడి నిష్ఠుర నిర్ణయం ముందు ఓడిపోయాయి. వైద్యులు అతను ఇక లేడని చెప్పినప్పుడు ఆ ప్రదేశంలో చెలరేగిన రోదనలు వర్ణనాతీతం. ఈ ప్రమాదంలో మరొక 12 మంది ఆటగాళ్లు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిపాలు కాగా, వారిలో ఒక మలేషియా ఆటగాడు కూడా ఉన్నాడు.

పాఠం నేర్పిన విషాదం

ప్రకృతి ముందర మానవ ప్రమేయం ఎంత చిన్నదో ఈ సంఘటన మరొకసారి నిరూపించింది. వర్షం తగ్గినా ఆకాశంలో ముసురుకున్న ముప్పును గుర్తించకపోవడం.. వాతావరణ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవడం ఎలాంటి ప్రాణనష్టానికి దారితీస్తుందో ఈ ఘటన హెచ్చరిస్తోంది.

ఈ భయంకర దృశ్యాల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ తీవ్ర భయాందోళనకు.. తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. చావు ఎంత హఠాత్తుగా వచ్చి పడుతుందో.. మన కళ్లముందే ఉన్న జీవితం మరుక్షణంలో ఎలా మాయమైపోతుందో ఈ ఉదంతం కన్నీటి సాక్ష్యంగా మిగిలిపోయింది. సోఫ్వాన్ అవాయే ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ... క్రీడా లోకం కంటనీరు పెడుతోంది.