Begin typing your search above and press return to search.

పెళ్ళిళ్ళోయ్ పెళ్ళిళ్ళు...సందళ్ళే సందళ్ళు

ముహూర్తం ముంచుకొస్తోంది. శుభ ఘడియలు వచ్చేశాయి. వివాహాలకు ఆహ్వానాలు అందిస్తున్నాయి.

By:  Satya P   |   16 Feb 2026 11:00 AM IST
పెళ్ళిళ్ళోయ్ పెళ్ళిళ్ళు...సందళ్ళే సందళ్ళు
X

ముహూర్తం ముంచుకొస్తోంది. శుభ ఘడియలు వచ్చేశాయి. వివాహాలకు ఆహ్వానాలు అందిస్తున్నాయి. ఒంటరి జీవితానికి శుభం కార్డు ఇస్తూ జంటలుగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టే వారందరికీ పంచాంగం శుభవార్తను చెబుతోంది. మూఢాలతో మూడు నెలలు గడిపిన వారికి ఇపుడు ఉందిలే మంచి కాలం అంటోంది. పచ్చని పందిళ్ళు, చక్కని సందళ్ళు మేళ తాళాలు, ఆ మీదట తలంబ్రాలు పెళ్ళి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు కౌంట్ డౌన్ మొదలైంది.

మొదటి రోజు నుంచే :

మాఘమాసం ముగిసిన వెంటనే శుక్రమూఢం కూడా పరిసమాప్తం అవుతోంది. ఈ నెల 17 అమావాస్యతో శుక్ర మూఢమి ఘడియలు సమాప్తం అవుతున్నాయి. ఫాల్గుణ మాసం 18వ తేదీ నుంచి ఆరంభం అవుతోంది. ఆ వెంటనే అంటే ఫాల్గుణ శుద్ధ విధియ నాడు 19వ తేదీ నుంచి పెళ్ళి ముహూర్తాలు వరుసగా ఉన్నాయని పండితులు పంచాంగకర్తలు స్పష్టంగా చెబుతున్నారు. అలా మొదలవుతున్న ఈ శుభ దినాల జోరు ఈ ఏడాది మొత్తంలో చాలా కాలమే సాగుతోంది అని వివరిస్తున్నారు.

తేదీల వారీగా చూస్తే :

ఇదిలా ఉంటే తేదీలా వారీగా శుభ దినాలు ఈ ఏడాది చూసుకుంత ఫిబ్రవరి నెలలో 19, 20, 21, 24, 25, 26లలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. మార్చి నెలలో చూస్తే 1, 3,4, 7, 8, 9, 11, 12 తేదీలలో మంచి రోజులు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో 15, 20, 21, 25, 26, 27, 28, 29 తేదీలలో వివాహాలకు అనుకూలంగా ఉన్నాయి. మే నెలలో 1, 3, 5, 6, 7, 8, 13, 14 తేదీలు, జూన్ లో 21, 22, 23, 24, 25, 26, 27, 29 తేదీలలో ముహూర్తాలు ఉన్నాయి. జూలై నెలలో 1, 6, 7, 11 ఉన్నాయి. నవంబర్ లో 21, 24, 25, 26 ఉంటే డిసెంబర్ లో 2, 3, 4, 5, 6, 11, 12 తేదీలలో పెళ్ళిళ్ళకు ముహూర్తాలు ఉన్నాయి.

కచ్చితంగా 53 రోజులే :

ఇక 2026 సంవత్సరంలో 365 రోజులు ఉంటే అందులో శుభ ముహూర్తాలకు 53 రోజులు మాత్రమే ఉండడం గమనార్హం. ఎక్కువగా వివాహాలు జరిగే మాఘ మాసం అంతా శుక్ర మూఢంతో సరిపోయింది. అంతే కాదు ఈ ఏడాది శ్రావణ మాసం కూడా మంచి ముహూర్తాలు లేకపోవడం వల్ల పూర్తిగా పక్కకు పోయింది. అలాగే అశ్వీయుజ మాసంలోనూ శుభ ముహూర్తాలు లేవు. కార్తీక మాసంలో కేవలం నాలుగే ముహూర్తాలు ఉంటే మార్గశిర మాసంలోనూ ఏడు ముహూర్తాలే ఉన్నాయి. దాంతో వివాహాలు చేసుకునే వారికి ఈ 53 రోజులు అత్యంత కీలకమైనవి అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో పురోహితుల నుంచి బ్యాండ్ మేళం నుంచి చూస్తే అన్నీ ఈసారి డిమాండ్ గానే ఉండవచ్చు. తక్కువ రోజులలో ముహూర్తాలు ఉండడంతో పెళ్ళిళ్ళను చేసే వారు అంతా ఫుల్ బిజీ అవుతారు. అయినా సరే మూడు ముళ్ళూ ఏడు అడుగుల వివాహ బంధానికి శుభ ముహూర్తం అసలైన ఆశీర్వాదం కాబట్టి అంతా తొందర పడాల్సిందే మరి.