Begin typing your search above and press return to search.

జీతం రెండు లక్షలు...అయినా సొంతింటి కల తీరడం లేదు !

నెలకు జీతం రెండు లక్షలు. అంటే ఏడాదికి 24 లక్షల రూపాయలు. ఒక విధంగా చెప్పాలంటే ఉన్నత వర్గానికి చెందిన వారి కింద లెక్క. కోటీశ్వరులుగా చెప్పుకోవచ్చు.

By:  Satya P   |   30 Jun 2026 9:25 AM IST
జీతం రెండు లక్షలు...అయినా సొంతింటి కల తీరడం లేదు !
X

నెలకు జీతం రెండు లక్షలు. అంటే ఏడాదికి 24 లక్షల రూపాయలు. ఒక విధంగా చెప్పాలంటే ఉన్నత వర్గానికి చెందిన వారి కింద లెక్క. కోటీశ్వరులుగా చెప్పుకోవచ్చు. లక్షలతో లక్ష్మీదేవి పుత్రులుగానూ వెలుగొందుతున్నారు అని సమాజం సైతం భావించవచ్చు. అయితే నిజంగా ఈ రెండు లక్షల రూపాయలతో అద్భుతం జీవితం గడుపుతున్నారా, ఆర్ధికంగా స్థితిమంతులుగా ఉన్నట్లేనా అంటే జవాబు మాత్రం చేదుగా వస్తోంది. రెండు లక్షలు ఇంతకీ ఎక్కడ ఏ మహా నగరంలో అన్న ప్రశ్న వెంటనే వెస్తే జవాబు కూడా ఈజీగా అర్ధం అవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో పనిచేసే వారికి నెలకు రెండు లక్షల ఆదాయం వచ్చినా అది పెద్దగా కనిపించదనే అంటున్నారు.

సంపాదన అంకెల్లోనే :

అంకెలు చూస్తే ఘనం, ఆచరణలో మాత్రం సామాన్యం అన్నట్లుగానే దేశ రాజధానిలో లక్షలలో సంపాదించే వారి జీవితం ఉందని అంటున్నారు. నెలకు రెండు లక్షల జీతం వస్తున్నా కూడా సొంత ఇల్లు కొనుక్కోలేకపోతున్నామని ఢిల్లీ ఉద్యోగి ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఒకటి చూస్తే అక్కడ రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి కూడా అర్ధం అవుతోంది అని అంటున్నారు. 2 బీహెచ్ కే ధర ఏకంగా రెండు కోట్లకు పలుకుతోంది. 2 బీహెచ్ కే అంటే రెండు బెడ్ రూంస్ ఒక హాల్ ఒక కిచెన్ అన్న మాట. మరి ఇది ఒక సగటు జీవి కోరిక. కానీ ఢిల్లీలో రియల్ ఎస్టేట్ రేట్లు చూస్తే సగటు జీవికి చుక్కలు చూపిస్తున్నాయని అంటున్నారు.

మెట్రో నగరాలు అంతేనా :

ఇటీవల ఒక నివేదిక దీని మీదనే రిలీజ్ అయింది. సొంత ఇంటి కోసం మెట్రో నగరాల వాసులు లాటరీ కొట్టాల్సిందే అన్నదే దాని సారాంశం. లక్షలలో ఆదాయం ఉన్నా మధ్య తరగతి కిందనే మెగా సిటీస్ లో పరిస్థితి ఉంటుంది.ఎందుకంటే ఖరీదైన జీవితం అక్కడ ఉంటుంది. దానితో పాటు సొంత ఇంటి కలలు నెరవేర్చుకోవాలీ అంటే కూడా చుక్కలు చూస్తూ దిక్కులు చూస్తూ గడపాల్సిందే అని అంటున్నారు. దేశవ్యాప్తంగా జీతగాళ్ల పరిస్థితి ఇలాగే ఉంది అని అంటున్నారు. ఒక చిన్న 2 బీహెచ్ కే ఇంటికి కూడా నోచుకోలేకపోతున్నామని లక్షల జీతగాళ్లే కుమిలిపోయే పరిస్థితి ఉంది. కనీసంగా ఇంటి ధరలు రెండు కోట్ల నుంచి రెండున్నర కోట్ల దాకా ఉంది అని మెట్రో సిటీస్ లోని సేఫెస్ట్ జోన్ లోని రియల్ ఎస్టేట్ సమాచారం తెలియచేస్తోంది. ఢిల్లీ మాత్రమే కాదు దేశంలోని మెట్రో సిటీస్ లో ఎక్కడైనా జీతగాళ్ళు ఇల్లు కొనే పరిస్థితి ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది.

జీవితమంతా ఈఎంఐలకే :

మరో వైపు చూస్తే ఏకంగా నెలకు నాలుగైదు లక్షలు కూడా సంపాదించినా జీవిత కాలం అంతా ఈఎంఐలకు కేటాయించాల్సి వస్తోంది అని మెట్రో సిటీస్ లో వేతన జీవులు అంటున్న నేపథ్యం ఉంది. రెండున్నర కోట్లు పెట్టి ఇల్లు కొన్నా దానికి రెన్నోవేషన్, రిజిస్ట్రేషన్ వంటివి అన్నీ కలిపి మెల్లగా మూడు కోట్లకు ఎగబాకుతోంది. ఇపుడు నాలుగైదు లక్షల జీతం వచ్చినా ఈఎంఐలకు మూడవ వంతు కేటాయించి సుదీర్ఘ కాలం చెల్లించాల్సి వస్తోంది అని కూడా మరి కొందరు మెట్రో వేతన జీవులు అంటున్నారు. దీంతో టైర్ టూ టైర్ త్రీ సిటీల మీదనే సొంతింటి కోసం ఆధారపడాల్సి ఉంటుంది అని అంటున్నారు. అంతే కాదు ఫ్లాట్స్ తీసుకోవడం అన్న ఆలోచలకు చెక్ పెట్టి ప్లాట్ తీసుకుంటే ఫ్యూచర్ లో అది ఆస్తిగా మారి భారీ లాభాలు తెస్తుందని అంటున్నారు. ఇక మహా నగరాలలోని వారు అయితే లక్షల సంపాదన ఉన్నా అద్దె ఇంట్లో ఉంటేనే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు.