మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?
ఒకప్పుడు పరిశ్రమలు స్థాపించాలన్నా, ఉత్పత్తి సామర్థ్యం పెంచాలన్నా ప్రభుత్వ అనుమతుల కోసం నెలలు, ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చేది. 1951లో ప్రారంభమైన లైసెన్స్ రాజ్ విధానంలో అనేక ఆంక్షలు, అవినీతి ఆరోపణలు పరిశ్రమల వృద్ధికి అడ్డంకిగా మారాయి. 1991లో పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో ఈ విధానానికి తెరపడింది. తాజాగా మోదీ ప్రస్తావనతో ఈ అంశం మళ్లీ చర్చలోకి వచ్చింది.
By: A.N.Kumar | 20 Nov 2026 2:30 AM ISTఒకప్పుడు దేశంలో కొత్త ఫ్యాక్టరీ పెట్టాలన్నా.. పాతదానిలో గూడు కట్టుకున్న ఉత్పత్తి సామర్థ్యాన్ని కొంచెం పెంచాలన్నా పారిశ్రామికవేత్తల కంటే ఫైళ్లే ఎక్కువ ప్రయాణాలు చేసేవి.. డజన్ల శాఖల చుట్టూ ప్రదక్షిణలు.. సార్.. ఫైలు ఎక్కడ దాకా వచ్చింది? అనే అజరామర ప్రశ్నలు.. టేబుల్ నుంచి టేబుల్‌కు కదలడానికి సంవత్సరాలు తీసుకునే కాగితపు పులుల రాజ్యం.. అదేనండి మన ఘనత వహించిన లైసెన్స్ రాజ్ వ్యవస్థ మన అధికార ప్రభుత్వ వ్యవస్థలో పాతుకుపోయి పరిశ్రమల స్థాపనకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఇప్పుడీ పాత జ్ఞాపకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెరపైకి తేవడంతో నిబంధనల చట్రంలో చిక్కుకున్న ఆ నాటి అనుమతుల పద్మవ్యూహం కథ మరోసారి చర్చనీయాంశమైంది.
భారత ఆర్థిక చరిత్రలో లైసెన్స్ రాజ్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. అది నిబంధనల చట్రంలో చిక్కుకున్న వ్యాపార వ్యవస్థకు ఒక ప్రతీక. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఈ పదాన్ని ప్రస్తావించడంతో ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ఎదుర్కొన్న అనుమతుల కష్టాలు.. అధికార యంత్రాంగం చుట్టూ చేసిన ప్రదక్షిణల కథ మరోసారి చర్చకు వచ్చింది.
1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడం.. విదేశీ కంపెనీలపై ఆధారపడకుండా ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా అప్పటి ప్రభుత్వం అడుగులు వేసింది. ఇందులో భాగంగా 1951లో ఇండస్ట్రీస్ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం దేశంలో ఏదైనా కొత్త పరిశ్రమ పెట్టాలన్నా.. ఉన్న పరిశ్రమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలన్నా.. కనీసం తయారు చేసే వస్తువుల డిజైన్‌లో మార్పులు చేయాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అయింది.
ఈ విధానం క్రమంగా ఎంత సంక్లిష్టంగా మారిందంటే వ్యాపారవేత్తలు కొత్త ఆవిష్కరణలు.. మార్కెటింగ్‌పై దృష్టి పెట్టడం కంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడానికే తమ విలువైన సమయాన్ని కేటాయించాల్సి వచ్చేది. ఎంత ఉత్పత్తి చేయాలి? పరిశ్రమ ఎక్కడ పెట్టాలి? ఏ వస్తువులు తయారు చేయాలి? అనే ప్రతి చిన్న విషయాన్ని ప్రభుత్వమే నిర్ణయించేది. ఒక పరిశ్రమకు అనుమతి రావాలంటే డజన్ల కొద్దీ శాఖల క్లియరెన్స్ కావాల్సి వచ్చేది. ఫైళ్లు ఒక టేబుల్ నుంచి మరో టేబుల్‌కు కదలాలంటే నెలలు.. ఒక్కోసారి ఏళ్లు పట్టేది. ఈ వ్యవస్థ మధ్యవర్తుల ప్రమేయానికి.. అవినీతికి, లంచగొండితనానికి ఆస్కారం కల్పించింది.
కొత్త సంస్థలు మార్కెట్లోకి రావడానికి ఈ నిబంధనలు పెద్ద అడ్డంకిగా మారాయి. దీనివల్ల మార్కెట్లో పోటీ వాతావరణం దెబ్బతిందని.. కేవలం అప్పటికే లైసెన్సులు పొందిన కొన్ని పెద్ద సంస్థల ఆధిపత్యమే కొనసాగిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటారు. కొత్త సాంకేతికత అందుబాటులోకి రాకపోవడం.. ఉత్పత్తి సామర్థ్యం పెరగకపోవడంతో వినియోగదారులకు కూడా నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలో దొరకని పరిస్థితి ఉండేది.
1991లో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు.. ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దాదాపు అన్ని రంగాల్లో లైసెన్సింగ్ నిబంధనలను రద్దు చేసి ప్రైవేటు, విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. అక్కడితో నియంత్రణల పాలన ముగిసి స్వేచ్ఛా మార్కెట్ దిశగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రయాణం మొదలైంది.
ప్రస్తుత ప్రభుత్వ విధానాలు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ప్రస్తావించే క్రమంలో ప్రధాని మోదీ ఈ లైసెన్స్ రాజ్ ఉదాహరణను తెరపైకి తెచ్చారు. గతంలో లాగా నిబంధనల పేరుతో పరిశ్రమలను ఇబ్బంది పెట్టకూడదని.. అనుమతుల ప్రక్రియను సరళతరం చేయడం ద్వారానే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందనే కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
అనుమతుల కోసం ఎదురుచూసే దశ నుంచి ప్రపంచ స్థాయిలో పోటీపడే స్థాయికి భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఎదిగిందో చెప్పడానికి ఈ ‘లైసెన్స్ రాజ్’ అధ్యాయం ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
