Begin typing your search above and press return to search.

90లలో వంద రూపాయలు...ఇపుడు విలువ ఎంతో తెలుసా ?

కాలం వేగంగా మారిపోతోంది. అభివృద్ధి మాటున ఏమి సాధించామన్నది పక్కన పెడితే గత కాలం మేలు వచ్చు కాలం కంటే అన్నది నిజం అని ఈ రోజుకీ అధిక శాతం నమ్ముతారు.

By:  Satya P   |   30 Aug 2026 2:00 PM IST
90లలో వంద రూపాయలు...ఇపుడు విలువ ఎంతో తెలుసా ?
X

కాలం వేగంగా మారిపోతోంది. అభివృద్ధి మాటున ఏమి సాధించామన్నది పక్కన పెడితే గత కాలం మేలు వచ్చు కాలం కంటే అన్నది నిజం అని ఈ రోజుకీ అధిక శాతం నమ్ముతారు. ఎంత డబ్బు ఇపుడు సంపాదించినా సుఖాలు అయితే లేవు, అలాగే అప్పట్లో ఉన్న పరిస్థితులు ఇపుడు అసలు కనిపించవని వేడి నిట్టూర్పులు విడుస్తూంటారు. అందుకే పాత రోజులనే ఎక్కువ మంది గుర్తు చేసుకుంటూంటారు. ఇక ఈ రోజున చూస్తే ధరలు నింగిని అంటాయి. లక్షల రూపాయలు నెలకు జీతంగా వస్తున్నా హాయిగా బతికేందుకు ఇబ్బంది అవుతోంది అంటే దానికి కారణం నానాటికీ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం అని చెబుతారు. ఆహార ద్రవ్యోల్బణం చూస్తే వేరే లెక్కగా ఉంది. దాంతో ఏమి కొనేందుకు లేదు తినేందుకు లేదు అన్న మాట ఎవర్ గ్రీన్ అవుతోంది.

సరిగ్గా మూడున్నర దశాబ్దాలు :

ఇప్పటికి మూడున్నర దశాబ్దాల క్రితం అంటే 1990 నాటికి వెళ్తే వంద రూపాయలు ఉంటే చాలు ఒక కుటుంబం ఎంత హాయిగా బతికేదో అంటూ పాత రోజులను గుర్తుకు తెస్తూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. అప్పుడున్న ధరలను ఇప్పటి ధరలతో పోల్చుకుంటే ఎంత బాగుందో కదా అనిపిస్తోంది. ఒక్కసారి 1990లో ధరల జాబితా చూస్తే ఎవరికైనా ఆనాటి జీవితం భూతల స్వర్గం అనే మాట తప్పకుండా వస్తుంది. 1990లో కిలో బియ్యం 3.20 గా ఉంది. కిలో గోధుమపిండి 2.40, ఒక లీటర్ పాలు 6 రూపాయలు, ఒక డజన్ గుడ్లు 4 రూపాయలు. బస్సు టికెట్ 1.50, గ్యాస్ సిలిండర్ 35 రూపాయలు, పెట్రోల్ లీటర్ 7.50 రూపాయలు, స్కూల్ ఫీజు నెలకు 25 నుంచి 40 రూపాయలు మాత్రమే.

ఇవి కూడా కారు చౌకగానే :

అంతే కాదు కిలో చక్కెర 4.80 రూపాయలు, కిలో పప్పు 10 రూపాయలు, బ్రెడ్ ఒక ప్యాకెట్ 3.50 రూపాయలు. సిగరెట్ ఒక ప్యాకెట్ 6 రూపాయలు, వంట నూనె నెలకు సరిపడా 75 రూపాయల నుంచి 100 రూపాయలు. కాలేజీ ఫీజు 60 నుండి 150 మధ్యలోనే ఉన్నాయి. ఇక రైలులో ప్రయాణించాలంటే సామాన్యుల టికెట్ 5 నుంచి 12 రూపాయల మధ్య ఉండేది. బజాజ్ చేతక్ బండి ఆ రోజులల్లో 16 వేల రూపాయలు ఉంటే సినిమా టికెట్ ధర 8 నుంచి 12 రూపాయలుగా ఉంది. ఒక లక్ష రూపాయలు చేతిలో ఉంటే చాలు అందమైన సొంత ఇల్లు అన్ని రకాలైన వసతులతో నిర్మించుకునేవారు. ఇక బ్లాక్ అండ్ వైట్ టీవీ 850 నుంచి 1200 రూపాయలుగా ధర ఉంది.

ఇప్పటి రేట్లతో పోలిస్తే :

నిజానికి కాలం అనే ప్రవాహంలో మూడున్నర దశాబ్దాలు అంటే చాలా చిన్నదే. అయితే మానవ జీవితంలో ఎక్కువగానే చూడాలి. ఇవన్నీ పక్కన పెడితే ఆనాటి ధరలను చూసిన వారు ఈ నాటికీ ఆ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. అనూహ్యంగా ధరలు పెరిగిపోవడం ఆ రోజులలో లేదని కూడా అంటారు. ఆనాడు వంద రూపాయల విలువ ఈనాటి రేట్లతో పోలిస్తే అక్షరాలా మూడు వేల రూపాయల నుంచి మూడు వేల అయిదు వందల రూపాయలుగా చేస్తుందని అంటున్నారు. దీనిని బట్టి ఎన్ని రెట్లుగా ధరలు పెరిగాయి, ఆర్థిక ఆహార ద్రవ్యోల్బణం సామాన్యుడు మధ్య తరగతి జీవితాలను ఎంతగా చిదిమివేసింది అన్నది కూడా అర్ధం అవుతుంది. అందుకే అప్పటి జీవితం సరళంగా సులువుగా సాగిపోయింది అని చెబుతారు.

చీమ కుట్టినట్లుగా కూడా లేదని :

ధరలను నియంత్రించలేని వ్యవస్థలో ఈ రోజు అంతా ఉన్నారు. ధరలు పెరగడం అన్నది పాలకులకు చీమ కుట్టినట్లుగా కూడా లేదని విమర్శలు ఉన్నాయి. పైగా ఒకపుడు అది అతి పెద్ద సమస్య. ఎంతలా అంటే ప్రభుత్వాలనే కూల్చేసేవిగా ఉండేది. ఒక్క ఉల్లిపాయ ఘాటు 90 దశకం చివర్లో ఏకంగా ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించింది. ఇపుడు మాత్రం అది రాజకీయ అజెండాలో లేకుండా పార్టీలు జాగ్రత్త పడ్డారా లేక సగటు జనాలలో పోరాడే శక్తి నశించిందా అన్నది పెద్ద ప్రశ్న. ఏదైనా ఎక్కువ కాలం కాదు కానీ 90 దశకం రోజులు కూడా గోల్డెన్ డేస్ అనుకుంటున్నారు అంటే ఇదేనా అభివృద్ధి అని అంతా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.