పోతూ పోతూ ఘాతుకం.... క్రూరమైన నరమేధం !
భారతదేశం బ్రిటిష్ వారి ఏలుబడిలోకి వెళ్ళినపుడు అఖండంగా ఉండేది. కానీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు మాత్రం రెండు ముక్కలు అయింది.
By: Satya P | 15 Aug 2026 7:51 AM ISTభారతదేశం బ్రిటిష్ వారి ఏలుబడిలోకి వెళ్ళినపుడు అఖండంగా ఉండేది. కానీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు మాత్రం రెండు ముక్కలు అయింది. అది కూడా మత ప్రాతిపదికన అయింది. పాకిస్తాన్ ఇండియా నుంచి వేరు పడింది. దానికి బ్రిటిష్ పాలకులు ఆమోదముద్ర వేశారు. తప్పని పరిస్థితుల్లో భారత నేతలు కూడా అంగీకరించారు. అయితే దేశ విభజన తర్వాత పరిస్థితులు మాత్రం దారుణంగా కర్కశంగా కిరాతకంగా సాగి ఈ రోజుకీ పెను విషాదంగానే చరిత్ర పుటలలో నిలిచాయి.
అన్నెం పున్నెం ఎరగని వారు :
దేశ విభజన జరుగుతుందని తెలియదు వారికి. అంత వరకూ అంతా అన్న దమ్ములుగా ఒకే చోట ఉండేవారు. రాత్రికి రాత్రి దేశం రెండు అయింది. దాంతో తాము వేరే దేశంలోకి వెళ్ళిపోయామన్నది వారికి ఆ చీకట్లోనే తెలిసింది. అది కూడా ముష్కర మూకల అకృత్యాలతోనే తెలిసింది. దేశ విభజనను ముష్కరులు తమకు అనుకూలంగా వినియోగించుకున్నారు అంతవరకూ అన్నదమ్ములుగా ఉన్న వారే తమ పక్క వారిని సాటి వారిని బలి కొన్నారు. హత్యలు చేసి వారి ఆస్తులు లాక్కున్నారు. యువతుల మీద అత్యాచారాలు చేశారు. లక్షలాది మంది ఈ మారణ హోమంలో మరణించారు. ఎన్నో లక్షల మంది రాత్రికి రాత్రి నిరాశ్రయులు అయ్యారు. ఇదంతా సరిగ్గా దేశ విభజన ఘట్టాన్ని ముగించని నిర్వాకం వల్ల ప్రాప్తించింది అని అంటారు.
తప్పుల తడకగా దేశ విభజన :
ఇదిలా ఉంటే 1947 ఆగస్టు 14న దేశ విభజన జరిగింది. ఈ పనికి పూనుకున్నది ఒక బ్రిటిష్ అధికారి, మ్యాప్ తన ముందేసుకుని ఢిల్లీలో చేసిన ఈ విభజన నర మేధానికి దారి తీసింది. తప్పుల తడకగా దేశ విభజన జరిగిపోయింది. భారత దేశ విభజన కేవలం భూభాగానికి సంబంధించిన రేఖల గీత మాత్రమే కాదు అది తొందరపాటు నిర్ణయాలు తప్పుడు అంచనాలు బ్రిటిష్ వారి విభజించి పాలించు విధానం వల్ల జరిగిన ఒక మహా విషాదంగా పేర్కొంటారు. ఈ విధంగా అపభ్రంశంగా జరిగిన ఈ విభజన ప్రక్రియలో జరిగిన తీవ్రమైన లోపాలు లక్షలాది మంది ప్రాణాలను, జీవితాలను బలిగొన్నాయి.కేవలం కొన్ని వారాలలో ఈ విభజన చేసి పారేశారు. ఈ సమయంలో స్థానిక పరిస్థితులు సరిగ్గా అంచనా వేయకుండా సరిహద్దు రేఖలను గీశారు. ఎన్నో ఉద్రిక్తతలు భావోద్వేగాలతో కూడుకున్న ఈ విభజన విషయంలో బ్రిటిష్ పాలకులు ఎలాంటి ముందస్తు సన్నాహాలు చేపట్టకపోవడంతో బలవంతుడు బలహీనుడు మీద తిరగబడ్డాడు. దాంతో అమాయకులు ఆహుతి అయిపోయారు.
సరిహద్దులు ఎవరికీ తెలియక :
అంతే కాదు రెండు దేశాల మధ్య ఎక్కడ ఏ విధంగా సరిహద్దులు ఎక్కడ ఉంటాయో తెలియక కోట్లాది మంది ప్రజలు అభద్రతా భావంతో అటూ ఇటూ ప్రయాణించాల్సి వచ్చింది. భారీ హింస ఆ సమయంలో ఒక్క సారిగా చోటు చేసుకుంది. ఫలితంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక కాశ్మీర్ వంటి ప్రాదేశిక వివాదాలు సైతం అదే సమయంలో తలెత్తాయి. రెండు దేశాల మధ్య శాశ్వత వైషమ్యాలకు ఆగస్టు 14 నుంచే పునాది రాయి పడింది. ఆ విధమైన దుష్పరిణామాలు చోటు చేసుకోవడంతో కుటుంబాలు సమస్తం చెల్లాచెదురయ్యాయి. అప్పటికి వందల వేల సంవత్సరాల నుంచి డి ఉన్న సామాజిక ఐక్యత ఒక్కసారిగా దెబ్బతిన్నది. ఈ రోజుకు 80 ఏళ్ళ స్వాతంత్ర్యం పూర్తి అయినా ఇప్పటికీ రెండు దేశాలు దీని తాలూకు గాయాలను సమస్యలను ఎదుర్కొంటున్నాయంటే తప్పుడుగా జరిగిన దేశ విభజన అని చెప్పక తప్పదు.
చరిత్రకు ఎక్కని ఘాతుకాలు :
ఆనాడు జరిగిన మారణ హోమంలో చరిత్రకు ఎక్కని ఘాతుకాలు ఎన్నో ఉన్నాయని అంటారు. దేశంలోని పశ్చిమ ప్రాంతంలోని షేఖ్‌పురాలో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే మహిళలు అపహరణకు గురి కావడం చోటు చేసుకుంది. ముజఫరాబాద్ ఘటనలో వెయ్యి మందికి పైగా హిందూ, సిక్కు పురుషులు సామూహిక హత్యకు గురికావడం అతి పెద్ద విషాదం. అదే విధంగా థోహా ఖల్సా ఆత్మత్యాగాలు గురించి చూస్తే తమ మాన, ప్రాణాలను కాపాడుకునేందుకు దాదాపు 90 మంది మహిళలు బావిలోకి దూకి ఆత్మార్పణ చేసుకోవడం అన్నది కూడా చరిత్ర మరవదు అని చెప్పాలి. 1947లో జరిగిన దేశ విభజన విషాద గాథ మానవ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నరమేధానికి దారి తీసింది.
కోట్ల మంది నిరాశ్రయులుగా :
దేశ సరిహద్దుల విషయంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల సుమారు 1.5 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భయానక వైనం నేటికీ ప్రజల గుండెల్లో చెరగని గాయంగా నిలిచింది. సుమారు 2 లక్షల నుండి 20 లక్షల మంది మరణించారు. దాదాపు 1.4 నుండి 1.5 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సరిహద్దులు దాటాల్సి వచ్చింది. రైళ్లలో కాలిబాటన సాగిన ప్రయాణాలు అప్పట్లో అయితే శ్మశానాలను తలపించాయి. సామాజిక హింసకు కల్లోలాలకు గ్రామాలు ధ్వంసమయ్యాయి. మహిళలపై అఘాయిత్యాలు దారుణాలు లెక్కకు మిక్కిలిగా జరిగాయి. కుటుంబాలు విడిపోయాయి. ఆస్తులు కాలి బూడిదయ్యాయి.
ఏ మాత్రం బాధ్యత లేకుండా :
బ్రిటిష్ పాలకులు పోతూ పోతూ దేశాన్ని అడ్డగోలుగా విభజించి చేసిన ఘాతుకంగా దీనిని చూస్తారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా భారత దేశం హద్దులు మానవ బంధాల పట్ల గౌరవం లేకుండా చాలా తేలికగా తీసుకుని చేసిన ఈ విభజన రెండు వైపుల నుంచి మంటలను రగిల్చింది. నిజానికి ఒక దేశ విభజన అంటే అది ప్రాంతాల మధ్య విభజన కాదు, అంతకు మించి బంధాల మధ్య విభజన. ఎన్నో లక్షల కుటుంబాల జీవిత సమస్య. వీటిని ఎవరూ గుర్తించలేకపోయారు. ప్రపంచ చరిత్రలో చూసినా ఇలాంటి విభజన అయితే ఉండదని అంటారు. ఇంత పెద్ద మారణ హోమం కూడా ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు. అలా బ్రిటిష్ వారి రగిలించిన రావణ కాష్టానికి ఈ రోజుకీ బలి అవుతోంది భారత్ అని చెప్పాల్సి ఉంది.
