Begin typing your search above and press return to search.

109 ఏళ్ల నాటి అప్పు.. బ్రిటన్ ప్రభుత్వం నుంచి రూ. 10 కోట్లు క్లెయిమ్ చేస్తున్న భారతీయ కుటుంబం

1917లో బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన ఒక అపూర్వమైన ఆర్థిక లావాదేవీ సుమారు 109 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెలుగులోకి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

By:  A.N.Kumar   |   13 Aug 2026 6:00 PM IST
109 ఏళ్ల నాటి అప్పు.. బ్రిటన్ ప్రభుత్వం నుంచి రూ. 10 కోట్లు క్లెయిమ్ చేస్తున్న భారతీయ కుటుంబం
X

1917లో బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన ఒక అపూర్వమైన ఆర్థిక లావాదేవీ సుమారు 109 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెలుగులోకి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొదటి ప్రపంచ యుద్ధం తీవ్రంగా జరుగుతున్న ఆ క్లిష్ట సమయంలో అప్పటి భోపాల్ సంస్థానానికి చెందిన ప్రముఖ ధనవంతుడు, వ్యాపారి అయిన సేథ్ జుమ్మా లాల్ రుథియా బ్రిటిష్ ప్రభుత్వానికి రూ. 35,000 అప్పుగా ఇచ్చారు. అప్పట్లో ఇది చాలా భారీ మొత్తం. 1917 జూన్ 4న జరిగిన ఈ లావాదేవీకి సంబంధించి నాటి బ్రిటిష్ పొలిటికల్ ఏజెంట్ డబ్ల్యూ ఎస్ డేవిస్ అధికారికంగా సంతకం చేసిన అసలు బాండ్ పత్రాలు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. జుమ్మా లాల్ రుథియా 1937లో కన్నుమూశారు, ఆ తర్వాత 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. అయితే నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ రుణాన్ని తిరిగి చెల్లించినట్లు ఎటువంటి రికార్డులు లేదా ఆధారాలు కుటుంబ సభ్యులకు లభించలేదు.

ఈ చారిత్రక అంశం ఇటీవల మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌కు చెందిన జుమ్మా లాల్ రుథియా మనవడు 63 ఏళ్ల వివేక్ రుథియా ద్వారా పునరావృతమైంది. తమ పూర్వీకుల నాటి పాత పత్రాలను పరిశీలిస్తున్న సమయంలో ఈ రుణ బాండ్ బయటపడటంతో ఆయన తక్షణమే బ్రిటన్ ప్రభుత్వాన్ని సంప్రదించారు. తమ పూర్వీకుడు అందించిన సాయానికి తగినట్లుగా అప్పటి ఒప్పంద నిబంధనల ప్రకారం అసలు మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని కోరారు. ఆశ్చర్యకరంగా ఈ విజ్ఞప్తిపై లండన్‌లోని బ్రిటన్ ప్రభుత్వ రుణాలు మరియు ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే 'యూకే డెబిట్ మేనేజ్ మెంట్ ఆఫీస్ ' స్పందించింది. ఆ బాండ్ యొక్క ఒరిజినల్ పత్రాలు, ఇతర చట్టపరమైన ఆధారాల కాపీలను సమర్పించాలని రుథియా కుటుంబ న్యాయవాదిని కోరడం ద్వారా ఈ అంశం అధికారిక మలుపు తిరిగింది.

1917 నాటి రూ. 35,000 విలువ నేటి కాలానికి పోల్చి చూస్తే ఊహకందని స్థాయికి చేరుకుంటుంది. గత శతాబ్ద కాలంలో పెరిగిన ద్రవ్యోల్బణం, చక్రవడ్డీ, బంగారం నాటి, నేటి ధరల వ్యత్యాసాలను గణనలోకి తీసుకుంటే ఈ రుణం యొక్క ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 10 కోట్లకు పైగా ఉంటుందని ఆర్థిక నిపుణులు, కుటుంబ సభ్యులు అంచనా వేస్తున్నారు. అయితే బ్రిటన్ అధికారులు ఈ మొత్తాన్ని నేరుగా చెల్లిస్తారా లేదా అనేది ఆ బాండ్‌లోని అసలు షరతులు, మెచ్యూరిటీ కాలపరిమితి, లండన్‌లోని నాటి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తేలనుంది. వందల ఏళ్ల నాటి బాండ్ ఆధారంగా ఒక భారతీయ కుటుంబం లండన్ ప్రభుత్వంపై ఇంత పెద్ద మొత్తంలో క్లెయిమ్ చేయడం ప్రపంచవ్యాప్తంగా విశేషంగా మారింది.