Begin typing your search above and press return to search.

బీచ్‌ లో సీసా.. లోపల లేఖ.. తెరపైకి వందేళ్ల క్రితం విషయం!

జీవితంలో కొన్ని అభిప్రాయాలు, మరికొన్ని భావాలను వ్యక్తపరుచుకోవడం చాలా ముఖ్యం అని అంటారు. పైగా వాటిని పంచుకునే మనుషులు ఉండటం, దొరకడం కూడా ముఖ్యమని అంటారు.

By:  Raja Ch   |   30 Oct 2025 11:09 AM IST
బీచ్‌ లో సీసా.. లోపల లేఖ.. తెరపైకి వందేళ్ల క్రితం విషయం!
X

జీవితంలో కొన్ని అభిప్రాయాలు, మరికొన్ని భావాలను వ్యక్తపరుచుకోవడం చాలా ముఖ్యం అని అంటారు. పైగా వాటిని పంచుకునే మనుషులు ఉండటం, దొరకడం కూడా ముఖ్యమని అంటారు. ఈ క్రమంలో ప్రధానంగా ప్రేమికులు రాసుకున్న లేఖలు, యుద్ధంలో ఉన్న సైనికులు రాసిన లేఖలకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా 1916 నాటి లేఖ సముద్రం ఒడ్డున దొరికింది.

అవును... మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఇద్దరు సైనికులు తమ భావాలను వ్యక్తపరుస్తూ రాసిన లేఖను ఓ సీసాలో భద్రపరిచిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. ఆ సీసాలో భద్రపరిచిన లేఖ వందేళ్ల తర్వాత తాజాగా ఆస్ట్రేలియాలో వెలుగుచూసింది. ఎస్పరాన్స్‌ పట్టణ సమీపంలోని వార్టన్‌ బీచ్‌ లో కొన్ని రోజుల క్రితం బ్రౌన్‌ అనే మహిళ కుటుంబం చెత్తను తొలగిస్తుండగా, ఆ సీసా వారి కంట పడింది.

అందులో దొరికిన లేఖ ప్రకారం.. 1916 ఆగస్టు 15న మాల్కమ్‌ నెవిల్లె(27), విలియం హార్లీ(37) అనే ఇద్దరు సైనికులు ఫ్రాన్స్‌ లోని యుద్ధ క్షేత్రాలకు ఓడలో తరలి వెళ్తున్న సమయంలో తమ సందేశాన్ని సీసాలో దాచి సముద్రంలోకి విసిరేశారు. వారిరువురూ ఫ్రాన్స్ యుద్ధభూమికి ఉద్దేశించిన 48వ ఆస్ట్రేలియన్ పదాతిదళ బెటాలియన్ కోసం సబ్ ఫోర్స్ విభాగంలో భాగంగా ఉన్నారు!

వీరిలో నెవిల్లే.. లేఖను దక్షిణ ఆస్ట్రేలియాలోని విల్కావాట్‌ లో ఉన్న తన తల్లి రాబర్టినా నెవిల్లేకు రాశారు. ఈ చిన్న గ్రామం ఇప్పుడు దాదాపుగా నిర్జనమైపోయింది. ఆ బాటిల్‌ ను కనుగొన్న ఎవరైనా ఆ నోట్‌ ను ఆమెకు అందజేయాలని ఆయన కోరారు. మరోవైపు అప్పటికే తల్లి మరణించిన హార్లే.. ఈ లేఖను కనుగొన్న వ్యక్తి తన సందేశాన్ని జ్ఞాపకంగా ఉంచుకోవచ్చని రాశాడు.

ఎంతో ఆశాజనకమైన మాటలు సీసాలో బంధించబడిన తర్వాత ఇద్దరు సైనికుల జీవితాలు పూర్తిగా భిన్నమైన మలుపులు తిరిగాయి. ఇందులో భాగంగా... ఒక సంవత్సరం తర్వాత 1917లో వెస్ట్రన్ ఫ్రంట్‌ లో జరిగిన యుద్ధంలో మాల్కం నెవిల్లే మరణించగా.. మరోవైపు విలియం హార్లే మాత్రం రెండుసార్లు గాయపడి యుద్ధం నుండి బయటపడ్డాడు.. అనంతరం క్యాన్సర్ తో మృతి చెందారు.

ఇలా ఒక శతాబ్దానికి పైగా తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంపై హార్లే మనవరాలు ఆన్ టర్నర్ స్పందించారు. ఇందులో భాగంగా... ఇది నిజంగా ఒక అద్భుతంలా అనిపిస్తుందని.. తమ తాత సమాధి నుండి మా కోసం చేయి చాపినట్లు అనిపిస్తుందని అన్నారు.