2010 టు 2026... ఈ సెల్ ఫోన్ల ఆర్డర్.. జీవిత కాలం లేటు
ఇప్పుడంతా ఆన్ లైన్ యుగం.. ఏఐ కాలం.. ఏ వస్తువు కావాలన్నా గంటల్లో లేదా రోజు వ్యవధిలో డెలివరీ అవుతాయి.
By: Tupaki Political Desk | 12 Jan 2026 9:04 AM ISTఇప్పుడంతా ఆన్ లైన్ యుగం.. ఏఐ కాలం.. ఏ వస్తువు కావాలన్నా గంటల్లో లేదా రోజు వ్యవధిలో డెలివరీ అవుతాయి. కొన్ని వస్తువుల డెలివరీ అయితే మనం ఎంపిక చేసుకుని, ఆర్డర్ పెట్టుకున్నంత సమయం కూడా పట్టదు..! అయితే, ఈ స్టోరీలో చెప్పుకోబోయే ఆర్డర్ మాత్రం దానిని ఆర్డర్ చేసిన వ్యక్తికి చేరేందుకు 16 ఏళ్లు పట్టింది. అంటే, స్మార్ట్ ఫోన్ తొలిరోజుల్లో ఆర్డర్.. సూపర్ ఫాస్ట్ రోజుల్లో డెలివరీ అన్నమాట. కాగా, దీనికి కారణం ఒక దేశ అంతర్యుద్ధం అంటే నమ్మాలి. ఇదంతా ఆఫ్రికా దేశం లిబియాలో జరిగింది. ఈ దేశాన్ని కల్నల్ గడాఫీ పాలించేవారు. ఆయనపై తిరుగుబాటును ప్రోత్సహించిన అమెరికా... పదవి నుంచి దిగిపోయేలా చేసింది. 2011లో గడాఫీ పారిపోతుండగా తిరుగుబాటుదారులు కాల్చిచంపారు. దీంతో లిబియాకు 42 ఏళ్ల గడాఫీ పాలన నుంచి విముక్తి లభించింది.
అటు అంతర్యుద్ధంలో..
లిబియా 2011 వరకు గడాఫీ పాలనలో ఉంది. దాదాపు అదే సమయంలో అంటే 2010లో ఓ దుకాణదారులు నోకియా ఫోన్లకు ఆర్డర్ పెట్టాడు. అప్పట్లో ఈ కంపెనీ ఫోన్లదే రాజ్యం. పైగా స్మార్ట్ ఫోన్లు ఇంకా బాల్యదశలోనే ఉన్నాయి. దీంతో నోకియా వంటి స్టాండర్డ్ ఫోన్లకు బాగా డిమాండ్ ఉండేది. ఓ షోరూం ఓనర్ బిజినెస్ ఆర్డర్ లో భాగంగా భారీగా ఆర్డర్ పెట్టాడు. కానీ, ఇవి 2026లో డెలివరీ అయ్యాయి.
ఇన్నేళ్లు ఎటుపోయాయో..??
16 ఏళ్ల తర్వాత డెలివరీ కావడమే విచిత్రం. మరి ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నాయి? దీనికి సమాధానం గోదాంలోనే మగ్గాయి. లిబియాలో 2010 నాటికే గడాఫీపై అమెరికా ప్రోద్బలంతో తిరుగుబాటు తీవ్రంగా సాగుతోంది. ఎలాగైనా ఆయనను గద్దె దింపాలని అగ్రరాజ్యం కుట్రలు చేస్తోంది. దీంతో అంతర్యుద్ధం జరిగేలా ప్రోత్సహించింది. ఈ ప్రభావం లిబియా ఆర్థిక వ్యవస్థపై పడింది. అయితే, గడాఫీ శకం ముగిసినా.. లిబియా అనాథలా మారింది. అంతర్యుద్ధం ముగిసినా.. ఆ దేశం ఇంకా తీవ్రమైన సంక్షోభంలో ఉంది. వాస్తవానికి గడాఫీది సంక్షేమ పాలన. విద్య, వైద్యం మొత్తం ఉచితంగా అందించిన రికార్డు. కానీ, అమెరికాకు ఆయన మింగుడుపడలేదు. దీంతోనే కక్ష కట్టి పదవి నుంచి దించేసింది.
