ప్రపంచదేశాలన్నీ ఏకమయ్యాయి.. ఇక చైనా ఏం పీకలేదు
చైనా ఆ దక్షిణ సముద్రాన్ని అంతలా ప్రేమించడానికి కారణం కేవలం దేశభక్తి మాత్రమే కాదు.. అక్కడ ఉన్న అసలు మ్యాటర్ వేరే ఉంది.
By: A.N.Kumar | 13 July 2026 5:00 PM ISTదక్షిణ చైనా సముద్రం మొత్తం నాదే.. అక్కడ అలలు కూడా నా పర్మిషన్ తోనే ఎగరాలి అంటూ చైనా కొన్నేళ్లుగా చేస్తున్న "చారిత్రక" కామెడీకి అంతర్జాతీయ సమాజం గట్టిగానే బ్రేకులు వేసింది. "భూమ్మీద ఏ ముక్క కనిపించినా నాదే" అనే చైనా ఆశలపై.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 దేశాలు కలిసి చల్లటి నీళ్లు చల్లాయి.
2016లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (పీసీఏ) ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తూ.. "కాస్త ఆ చట్టాలు కూడా గౌరవించు నాయనా" అంటూ ఈ 14 దేశాల కూటమి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేసింది. దాంతో ఎప్పటిలాగే బీజింగ్ పెద్దలకు కోపం నషాళానికి అంటింది.
ఏంటి ఆ 14 దేశాల లొల్లి?
అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫిలిప్పీన్స్ లాంటి 14 దేశాలు కలిసి ఒక గ్రూప్ ఫొటో దిగినంత పని చేస్తూ చైనాకు క్లారిటీ ఇచ్చాయి. ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందం ప్రకారం చైనా సముద్రంలో వేస్తున్న రూట్ మ్యాప్‌లకు ఎలాంటి లీగల్ వాలిడిటీ లేదని తేల్చేశారు. దీనికి తోడు 27 దేశాల యూరోపియన్ యూనియన్ కూడా వెనక నుంచి సపోర్ట్ ఇస్తూ చైనాకు చుక్కలు చూపించింది.
జపాన్‌పై చైనా అలిగింది
ఈ ప్రకటనలో జపాన్ కాస్త ఎక్కువ యాక్టివ్‌గా కనిపించేసరికి చైనాకు అస్సలు నచ్చలేదు. వెంటనే బీజింగ్‌లో ఉన్న జపాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌ను పిలిపించి.. "అసలు మీకేం సంబంధం? మా సముద్రం, మా ఇష్టం.. మీ పని మీరు చూసుకోండి" అంటూ క్లాస్ పీకే ప్రయత్నం చేసింది. అంతేకాదు తమ "న్యాయమైన" వాదనను ప్రపంచానికి వివరించడానికి సోషల్ మీడియాలో ఒక సెంటిమెంట్ వీడియో కూడా వదిలింది. కానీ చూసేవాళ్లే నవ్వుకుంటున్నారు!
ఇంతకీ ఆ దక్షిణ చైనా సముద్రంలో ఏముంది?
చైనా ఆ దక్షిణ సముద్రాన్ని అంతలా ప్రేమించడానికి కారణం కేవలం దేశభక్తి మాత్రమే కాదు.. అక్కడ ఉన్న అసలు మ్యాటర్ వేరే ఉంది. ప్రపంచ వాణిజ్యానికి ఇది మెయిన్ రోడ్డు లాంటిది. ఏటా లక్షల కోట్ల డాలర్ల సరుకులు దీని గుండానే వెళ్లాలి. దాదాపు 17.7 బిలియన్ టన్నుల చమురు, గ్యాస్ నిల్వలు అక్కడ దాగున్నాయి. అందుకే చైనా అక్కడ ఆర్టిఫిషియల్ దీవులు కట్టేసి సైనిక స్థావరాలు పెట్టేసి "ఇది నా సొంత ఇల్లు" అని బోర్డు తగిలించేస్తోంది.
యుద్ధం వస్తుందా?
ఒకపక్క చైనా షిప్పులు.. మరోపక్క అమెరికా అండ్ కో స్వేచ్ఛా నౌకాయాన కార్యకలాపాల పేరుతో తిరుగుతుండటంతో ఆ ఏరియా ఎప్పుడు పేలుతుందో తెలియని బాంబులా మారింది. చైనా గనుక తన మొండితనాన్ని మార్చుకోకపోతే ఈ చిన్న సముద్రపు గొడవ కాస్తా పెద్ద ఇంటర్నేషనల్ ఫైటింగ్‌కు దారితీసేలా ఉంది.
ఏదేమైనా "ప్రపంచం మొత్తం నాదే" అనుకునే డ్రాగన్‌కు.. "అంతా నీదే అంటే కుదరదు బాస్" అని 14 దేశాలు గట్టిగానే బుద్ధి చెప్పాయి. మరి చైనా రూట్ మార్చుకుంటుందా.. లేక ఎప్పటిలాగే "నేనింతే" అంటుందా అనేది చూడాలి.
