ముప్పయి రోజులకే జైలు బిల్లు....ఎందుకింత చర్చ...రచ్చ ?
ఇక భారత రాజకీయ వ్యవస్థలో నేరాలు చేసే వారు కానీ లేక నేరాలు ఉన్న వారు కానీ ప్రవేశిస్తున్నారు అన్నది చాలా కాలంగా ఉన్న విషయం.
By: Satya P | 22 Aug 2025 10:00 PM ISTకేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక కీలకమైన రాజ్యాంగ సవరణ చేయడానికి పూనుకుంటోంది. ఏకంగా 130 వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలో ఒక విప్లవాత్మకమైన సంస్కరణలను తీసుకుని రావాలని భావిస్తున్నట్లుగా బీజేపీ నేతలు చెబుతున్నారు. రాజకీయాల్లో నేరస్తులను తగ్గించడం వీలైతే అరికట్టడం అన్న ఆలోచనతోనే ఈ బిల్లుని తెచ్చామని అంటున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఒక రోజు తేడాతో ముగుస్తాయనగా ముందు రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లుని తీసుకుని వచ్చి లోక్ సభ ముందు ఉంచారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ బిల్లు మీద చర్చతో పాటు రాజకీయ రచ్చ కూడా సాగుతోంది. అసలు ఈ బిల్లు సంగతి ఏమిటి, ఇది చట్టం అయితే ఏ విధంగా అమలు చేస్తారు దీని అనుకూలతలు ప్రతికూలతలు ఏమిటి అన్నది చూస్తే కనుక చాలానే ఉంది.
ఆటోమేటిక్ గా పోస్ట్ ఊస్ట్ :
ఈ బిల్లులో అతి ముఖ్యమైన అంశం ఏమిటి ముప్పై రోజులు వరసగా జైలులో ఉంటే ఆటోమేటిక్ గా ఆ పదవి పోతుంది. ఏదైనా తీవ్రమైన కేసులలో చిక్కుకుని జైలు పాలు అయి బెయిల్ రాకపోతే మాత్రం ఇక పదవి ఊడినట్లే అన్నదే ఈ బిల్లు చెప్పే సారాంశం. ఇది బాగానే ఉంది కదా ఎందుకు అభ్యంతరం అన్న ప్రశ్నలు ఎవరికి అయినా రావచ్చు. అంతే కాదు బెయిల్ కూడా దక్కని నేరాలు చేసి ఉన్న వారికి జైలు తప్ప పదవి ఎందుకు అని నైతికత గురించి ఆలోచించేవారు అనవచ్చు. కానీ బిల్లు ఉద్దేశ్యం పక్కన పెడితే ఆచరణలోనే ఇబ్బందులు వస్తాయని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.
రాజకీయ ప్రతీకారానికి అలా :
ఎవరైనా సరే రాజకీయ ప్రత్యర్ధి ఉంటే వారి మీద ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ చట్టాన్ని అధికారంలో ఉన్న వారు సులువుగా వాడవచ్చు అన్నది విపక్షాల సందేహాలు, భయాలు కూడా. కేంద్రం వద్ద సీబీఐ ఈడీ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. వాటిని విపక్షాలు అధికారంలో ఉన్న చోట ప్రయోగించి వారిని జైలుకు పంపించి 30 రోజుల పాటు బెయిల్ రాకుండా అడ్డుకుంటే ఆటోమేటిక్ గా వారు మాజీలు అవుతారు. అలా తమకు గిట్టని వారి నుంచి అధికారాన్ని తీసుకోవడానికి కేంద్రంలో ఎవరు ఉన్నా వారికి వీలు చిక్కుతుంది అన్నది విపక్షలు అంటున్న మాట. వ్యక్తం చేస్తున్న అనుమానంగా ఉంది. ఈ బిల్లు ద్వారా నైతిక ప్రమాణాలు పాదుకొంటాయని బీజేపీ పెద్దలు అంటూంటే ఇది ప్రత్యర్ధులను వేటాడే ఆయుధంగా మారుతుందని వారు అంటున్నారు.
దేశంలో పెరిగిన రాజకీయ నేరాలు :
ఇక భారత రాజకీయ వ్యవస్థలో నేరాలు చేసే వారు కానీ లేక నేరాలు ఉన్న వారు కానీ ప్రవేశిస్తున్నారు అన్నది చాలా కాలంగా ఉన్న విషయం. ఏడీఆర్ రిపోర్టు ప్రకారం చూస్తే దాదాపుగా 45 శాతం దేశంలోని అన్ని రాష్ట్రాలలోని ఎమ్మెల్యేల మీద నేరపరమైన కేసులు ఉన్నాయని అంటున్నారు. 29 శాతం మీద మర్డర్ రేప్, కరప్షన్ ఆరోపణలు ఉన్న వారు ఉన్నారని అంటున్నారు. ఇవి అయిదేళ్ళకు పైబడిన శిక్షలు వేసేందుకు ఆస్కారం కలిగిన తీవ్రమైన కేసులుగా చెబుతారు. ఇక ఇందులోనే మనీ లాండరింగ్ కేసులు కూడా ఉన్నాయని అంటున్నారు. అలాగే 46 శాతం ఎంపీల మీద కూడా కేసులు ఉన్నాయని అంటున్నారు.
సహజ న్యాయానికి విరుద్ధం :
ఇక భారతీయ న్యాయ శాస్త్రం చెప్పేది ఏమిటి అంటే ఒక వ్యక్తి నేరం రుజువు అయ్యేంతవరకూ ఆయన నిర్దోషిగా ఉంటారు. అయితే ఈ బిల్లు కనుక అమలులోకి వస్తే మాత్రం నిందితుడిగా ఉండగానే 30 రోజుల వ్యవధిలోనే తన పదవిని కోల్పోతారు. అలా ఆయన నేరస్తుడిగా మిగిలిపోతారు అని అంటున్నారు. ఇక్కడ న్యాయ స్థానం వేసే శిక్ష కంటే కూడా చట్టం వేసే శిక్ష ముందు అమలు అవుతుంది. అలా న్యాయ వ్వవస్థ అధికారంలోకి కార్యనిర్వాహణ వ్యవస్థ చొరబడుతుందని ఇది ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు.
బెయిల్ రాకుండా చేసి మరీ :
అరెస్టు అయిన వారికి బెయిల్ ఇవ్వడం అన్నది చాలా సాధారణం అని న్యాయ వ్యవస్థ చెబుతోంది. అయితే సాక్షులను భయపెడతారనో లేక పారిపోతారనో లేక సాక్షాలను తారుమారు చేస్తారో అన్న అనుమానాలు ఉంటే మాత్రం బెయిల్ ఇవ్వరు. ఇపుడు ఇక్కడే అసలైన విషయం ఉందని నిపుణులు అంటున్నారు. అధికారంలో ఉన్న వారు ఒత్తిడితో ఈ మూడు కారణాలు చూపించి ముప్పయి రోజులలోగా బెయిల్ రాకుండా చేస్తే మాత్రం కచ్చితంగా పదవి పోతుంది కదా అని అంటున్నారు. న్యాయ వ్యవస్థకు కార్యనిర్వాహణ వ్యవస్థకు ఉన్న అధికారాల విభజనకు కూడా ఇది ఇబ్బంది పెట్టేదిగా ఉందని అంటున్నారు.
జేపీసీ నివేదిక అపుడే :
వచ్చే పార్లమెంట్ సమావేశాలలోగా జేపీసీ తన నివేదికను పార్లమెంట్ కి సమర్పిస్తుంది అని అంటున్నారు. లోక్ సభ రాజ్యసభ నుంచి 31 మంది ఎంపీలను జేపీసీలో చేర్చి వారి అభిప్రాయాన్ని తెలియచేస్తూ సిఫార్సులు చేస్తూ ఒక నివేదిక ఇస్తుంది. పాత కేసులకు ఈ బిల్లు వర్తించదు. ఈ బిల్లు చట్టంగా అమలు అయిన తరువాతనే అపుడే యాక్షన్ ఉంటుంది అని చెబుతున్నారు. బిల్లు వచ్చాక కేసులు పడి 30 రోజులు జైలులో ఉంటే మాత్రం వారికి పదవులు పోతాయని అంటున్నాఉర్.
రాజకీయ నేరగాళ్ళను వదిలించాల్సిందే :
అయితే కేంద్రం తీసుకుని రాబోతున్న ఈ బిల్లు విషయంలో దేశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ బిల్లు చట్టం అయితే పదునుగా ఉంటుంది. అదే సమయంలో దీనిని అమలు చేసేవారు ఆలోచనలు కూడా ఎలా ఉంటాయన్న సందేహాలు ఉన్నాయి. రాజకీయ కక్షలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పారదర్శకంగా ఉపయోగిస్తే మాత్రం రాజకీయ నేరస్తులకు ఇది కత్తిలాంటి ఆయుధమే అని అంటున్నారు. చూడాలి మరి ఈ బిల్లు మీద మరింత విస్తృత స్థాయిలో చర్చలు జరగాల్సిన అవసరం ఉంది.
