Begin typing your search above and press return to search.

12 ఏళ్ల సేవ.. చివరికి లాగిన్ ఎర్రర్‌తో ఉద్యోగం ఊడింది.. కార్పొరేట్ ఉద్యోగి కన్నీటి గాథ!

ఈ సంఘటన ప్రతి కార్పొరేట్ ఉద్యోగి గుండెనూ పిండేస్తోంది. సంస్థ విజయం కోసం మన నిద్రను, ఆరోగ్యాన్ని, కడకు మన కుటుంబ సంతోషాలను బలి ఇస్తున్నాం.

By:  A.N.Kumar   |   15 Sept 2026 6:54 PM IST
12 ఏళ్ల సేవ.. చివరికి లాగిన్ ఎర్రర్‌తో ఉద్యోగం ఊడింది.. కార్పొరేట్ ఉద్యోగి కన్నీటి గాథ!
X

కంటికి రెప్పలా కాపాడుకున్న ఉద్యోగం.. పండుగలూ పబ్బాలూ మరచిపోయి ధారపోసిన సమయం.. చివరికి ఆసుపత్రి బెడ్‌పై భార్య కొట్టుమిట్టాడుతున్నా పక్కనే ఉండి ఓదార్చలేని ఆవేదన.. ఇవన్నీ ఒక వైపు అయితే వీటన్నింటికీ ప్రతిఫలంగా లభించింది మాత్రం అమానుషమైన ఒక నిశ్శబ్దం.. 12 ఏళ్ల పాటు ఒకే సంస్థను తన సొంత ఇల్లులా భావించి.. రాత్రింబవళ్లు చెమటోడ్చిన ఒక ఉద్యోగికి కార్పొరేట్ ప్రపంచం ఇచ్చిన విడ్కోలు కానుక ఏంటో తెలుసా? ఒక్క లాగిన్ ఎర్రర్..

అవును.. లాగిన్ కాలేకపోవడంతోనే తను రోడ్డున పడ్డాననే పచ్చి నిజం ఆ ఉద్యోగికి అర్థమైంది. హోలీ రంగులు, దీపావళి వెలుగులు, రాఖీ బంధాలు.. వీటన్నింటికీ దూరంగా ఉంటూ సిస్టమ్ స్క్రీన్ ముందే తన జీవితాన్ని గడిపేశాడు. చివరికి తన ఆరోగ్యం క్షీణించిపోతున్నా పట్టించుకోలేదు. సంస్థ ప్రయోజనాలే తన ఊపిరిగా బతికాడు. కానీ ఒక ఉదయం ఎప్పటిలాగే పనిలోకి దిగుదామని సిస్టమ్ ఆన్ చేస్తే "యాక్సెస్ డినైడ్" అని పడింది. 12 ఏళ్ల సుదీర్ఘ బంధానికి త్యాగాలకు కంపెనీ చెప్పిన ముగింపు ఇదే. ముందస్తు సమాచారం లేదు.. కనీస మానవత్వంతో కూడిన పిలుపు లేదు.

ఈ సంఘటన ప్రతి కార్పొరేట్ ఉద్యోగి గుండెనూ పిండేస్తోంది. సంస్థ విజయం కోసం మన నిద్రను, ఆరోగ్యాన్ని, కడకు మన కుటుంబ సంతోషాలను బలి ఇస్తున్నాం. కానీ రేపు కంపెనీకి అవసరం తీరిపోయాక లేదా పరిస్థితులు మారాక.. మనం వారికి కేవలం ఒక 'ఎంప్లాయ్ ఐడీ' మాత్రమే తప్ప మరొకటి కాదనే చేదు నిజాన్ని ఈ ఉదంతం కళ్లకు కడుతోంది. ఉద్యోగంలో నిబద్ధత ఉండాలి.. కానీ అది మన జీవితాన్నే మింగేసేంత కాకూడదు. కంపెనీకి మీరు ఒక రీప్లేస్ చేయగల ఉద్యోగి మాత్రమే కావచ్చు, కానీ మీ కుటుంబానికి మాత్రం మీరే సర్వస్వం.

గుర్తుంచుకోండి... మీ ఆరోగ్యం క్షీణిస్తే ఏ కంపెనీ వచ్చి తిరిగోవ్వదు. మీరు వదిలేసిన కుటుంబ సమయం మళ్లీ తిరిగి రాదు. కెరీర్ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే.. అదే పూర్తి జీవితం కాదు. ఈ వైరల్ కథనం మనందరికీ ఇస్తున్న హెచ్చరిక ఒకటే.. కార్పొరేట్ ఉద్యోగం కోసం మీ జీవితాన్ని, కంటిపాపలాంటి కుటుంబాన్ని త్యాగం చేయకండి. ఎందుకంటే మీరు ఇచ్చే అంకితభావానికి అదే స్థాయిలో సంస్థ నుండి భరోసా లభిస్తుందనుకోవడం అమాయకత్వమే అవుతుంది..