న్యూ ఇయర్ వేళ చాలామంది ద్రాక్ష ఎందుకు కొన్నారో తెలుసా..!
అవును... భారతీయుల్లోనూ న్యూ ఇయర్ సందర్భంగా ద్రాక్షా పండ్లను తినే సంప్రదాయం వచ్చిందని తెలుస్తోంది.
By: Raja Ch | 1 Jan 2026 9:33 AM ISTప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరగ్గా, మరికొన్ని చోట్ల జరుగుతుండగా.. భారత్ లో ఇప్పటికే ఓ దశ ముగిసిన పరిస్థితి. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... న్యూ ఇయర్ వేళ చాలా భారతీయ కుటుంబాలు ద్రాక్షా పండ్లను ఎక్కువగా కొన్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో 12 ద్రాక్ష పండ్లను తినడం అనే సంప్రదాయాన్ని చాలా మంది భారతీయులూ అనుసరిస్తుండటం ఆసక్తిగా మారింది.
అవును... భారతీయుల్లోనూ న్యూ ఇయర్ సందర్భంగా ద్రాక్షా పండ్లను తినే సంప్రదాయం వచ్చిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... కమర్షియల్ ప్లాట్ ఫామ్ జెప్టో.. ద్రాక్ష ఆర్డర్ లలో పదునైన పెరుగుదలను చూసింది. ఈ సంవత్సరం డిసెంబర్ 30 తర్వాత ద్రాక్షకు 3 రెట్లు డిమాండ్ కనిపించిందని జెప్టో ప్రతినిధి చెప్పగా.. 'ఈరోజు ఇన్ స్టామార్ట్ ద్రాక్ష కోసం 235కే శోధనలను చూసింది.. శోధనలు ఉదయం 5 గంటల నుండే ప్రారంభమయ్యాయి'.. అని ఇన్ స్టామార్ట్ సీఈఓ అమితేష్ తెలిపారు.
అసలేమిటీ ఆచారం..?:
స్పానిష్ సంప్రదాయంలో అర్ధరాత్రి ముందు చివరి 60 సెకన్లలో 12 ద్రాక్షలను తినడం జరుగుతుంది.. ఇందులో ఒక్కో ద్రాక్ష రాబోయే సంవత్సరంలో ఒక నెలను సూచిస్తుంది. గత నూతన సంవత్సర పండుగ సందర్భంగా భారత్ లోనూ ఈ ఆచారం విస్తృత దృష్టిని ఆకర్షించగా.. 2026 నూతన సంవత్సరం సందర్భంగానూ ఆ ఆసక్తి మరింత మందిలో నెలకొందని తెలుస్తోంది.
వాస్తవానికి ఈ ఆచారం 1880ల చివరి నాటిది కాగా.. ఇది మాడ్రిడ్ బూర్జువా వర్గాలలో ఉద్భవించిందని నమ్ముతారు! వారు నూతన సంవత్సర పండుగ సందర్భంగా షాంపైన్ తాగడం, ద్రాక్ష తినడం అనే ఫ్రెంచ్ సంప్రదాయం నుండి ప్రేరణ పొందారు. 1900ల ప్రారంభంలో అలికాంటేలోని ద్రాక్ష రైతులు సమృద్ధిగా పంటను చూసినప్పుడు ఇది విస్తృత ప్రజాదరణ పొందిందని చెబుతున్నారు. పంట మిగులును నిర్వహించడానికి.. ఈ ఆచారాన్ని ఒక పండుగ ఆచారంగా ప్రచారం చేశారని అంటారు.
ఈ క్రమంలో 12 ద్రాక్షలు రాబోయే సంవత్సరం కోసం కలలు, కోరికలను సాకారం చేసుకోవడానికి సహాయపడుతుందని ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు. ప్రతి ద్రాక్ష ఒక నెలను సూచిస్తుంది. ఈ ఆచారంలో అర్ధరాత్రి ముందు చివరి నిమిషంలో 12 ద్రాక్ష పండ్లను తినడం జరుగుతుంది. ఈ క్రమంలో... ఈ ఆచారం భారత్ లోనూ విస్తరించిందని తాజా ఘణాంకాలు చెబుతున్నాయి!!
