ఒక్క నెలలో పది వేల పెళ్ళిళ్ళు...బ్యాండ్ బాజానే !
ఒక్క నెల ముప్పయి రోజులలో ఏకంగా పది వేల పెళ్ళిళ్ళు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోనే అత్యధికంగా వివాహాలు జరగబోతున్నాయి. అంటే సగటునన్ రోజుకు 330 దాకా పెళ్ళిళ్లు జరుగుతాయి అన్న మాట.
By: Satya P | 13 Aug 2026 4:00 AM ISTఒక్క నెల ముప్పయి రోజులలో ఏకంగా పది వేల పెళ్ళిళ్ళు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోనే అత్యధికంగా వివాహాలు జరగబోతున్నాయి. అంటే సగటునన్ రోజుకు 330 దాకా పెళ్ళిళ్లు జరుగుతాయి అన్న మాట. మరి ఇంత పెద్ద ఎత్తున పెళ్ళిళ్ళు ఎందుకు ఇపుడే జరుగుతున్నాయి అంటే సరైన ముహూర్తాలు ఉండడమే అని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొన్ని, అలాగే మార్చి, ఏప్రిల్, మేలలో కొన్ని ముహూర్తాలు ఉన్నాయి. ఆ తరువాత జేష్టంలో పెద్దగా లేవు, అందులో అధిక జ్యేష్టంతో రెండు తెలుగు మాసాలు వెళ్ళాయి. ఇక ఆషాడం శూన్యమాసం, దాంతో గత మూడు నెలలుగా మంచి ముహూర్తాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇపుడు బ్రహ్మాండమైన మాసంగా శ్రావణం వచ్చింది. సాధారణంగా శ్రావణం అంటేనే శుభాలకు పెట్టింది పేరు అని అంటారు. ఈసారి చాలా మంచి ముహూర్తాలను ఈ మాసం మోసుకొచ్చింది. దాంతో పెద్ద ఎత్తున బ్యాండ్ బాజాలు మోగనున్నాయని అంటున్నారు.
ఇవన్నీ మంచి రోజులే :
ఈసారి శ్రావణమాసం ఆగస్టు 13తో మొదలు కాబోతోంది. సెప్టెంబర్ 11 దాకా కొనసాగనుంది. ఇక ఈ నెలలో వరసబెట్టి 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30, సెప్టెంబర్ లో 3, 4, 5, 8, 10, 11 దాకా మంచి ముహూర్తాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ సీజన్ లో పెళ్ళిళ్ళు మాత్రమే కాకుండా, గృహ ప్రవేశాలు వివాహ నిశ్చితార్ధాలు కూడా బాగానే జరుగుతాయి. అంతే కాదు ఎటువంటి శుభ కార్యక్రమాలు తలపెట్టినా శ్రావణ మాసం కలసి వస్తుందని పండితులు చెబుతున్నారు. దాంతో శ్రావణ మాసంలో మంచి బిజినెస్ కూడా సాగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మార్కెట్ సందడే మరి :
ఇక శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున నోములు, పూజలు, అలాగే వివాహాలు వంటి శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. దీనివల్ల మార్కెట్ సందడి గా ఉంటుంది. పూలు, పండ్లు, గాజులు, పూజా సామగ్రి వ్యాపారాలు చాలా బాగా సాగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే పూల వ్యాపారం ప్రత్యేకంగా తీసుకుంటే బంతి, చామంతి, తంగేడు పువ్వులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇక అమ్మవారికి అలంకరించే గాజులు, ముత్తయిదువులకు ఇచ్చే గాజులకు గిరాకీ ఉంటుంది. దాంతో పచ్చని గాజులు, మంగళప్రదమైన వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. పూజా సామగ్రి విషయంగా తీసుకుంటే పసుపు, కుంకుమ, అగరబత్తీలు, దీపారాధన వస్తువుల వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. దాంతో వ్యాపారానికి పెద్ద ఊపిరిగా ఈ మాసాన్ని చెప్పుకోవాలి.
వివాహాలతో డిమాండ్ :
అలాగే వివాహాలతో పెళ్ళిళ్ల సంబంధిత మార్కెట్ కూడా కళకళలాడుతుంది. ఈ దేశంలో వివాహ వ్యవస్థకు ఎంతో విలువ గౌరవం ఉన్నాయి. దాంతో ప్రతీ సారీ పెళ్ళిళ్ళ పెళ్లిళ్ల సీజన్ లో సంబంధిత మార్కెట్ కి డిమాండ్ ఉండడమే కాకుండా అది అంతకంతకు భారీగా పెరిగింది. దేశంలో వెడ్డింగ్ ఇండస్ట్రీ విలువ సుమారు 130 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఆ రంగం నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ దేశంలో ఆహారం తర్వాత దేశంలో అత్యధికంగా ఖర్చు చేస్తున్న రెండో అతిపెద్ద రంగంగా వివాహ రంగం నిలిచింది అని చెబుతున్నారు. ఇక మ్యాట్రిమొనీ వెబ్‌సైట్ల ద్వారా యువత నేరుగా తమకు నచ్చిన సంబంధాలను ఎంచుకుంటున్నారు. అలా వ్యాపారం మొదలవుతోంది. అక్కడ నుంచి పెళ్ళిళ్ళు జరిగే దాకా అంటే వివాహ వేడుకల కోసం సగటున ఒక్కో కుటుంబం లక్షల్లో వెచ్చిస్తోంది. సీజనల్ వ్యాపారంగా చూసే మంచి ముహూర్తాల కాలంలో ఈ మార్కెట్ మరింత కళకళలాడుతోంది. పురోహితుల నుంచి బ్యాండ్ మేళం నుంచి కేటరింగ్ వారి నుంచి అన్ని వైపులా మార్కెట్ అదిరిపోయే రేంజిలో ఈసారి కూడా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం అవుతోంది.
