విషం ఇచ్చి చంపేయండి.. మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ రోడ్లు,భవనాల శాఖా మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
By: A.N.Kumar | 10 Jan 2026 5:12 PM ISTతెలంగాణ రోడ్లు,భవనాల శాఖా మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. కోపం ఉంటే విషం ఇచ్చి చంపేయండంటూ భావోగ్వేద వ్యాఖ్యలు చేశారు. మహిళా ఐఎఎస్ లపై అసత్య ప్రచారం మానుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోపణల వెనుక నిజాలను తేల్చాలని డీజీపీని కోరినట్టు తెలిపారు. శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
వ్యూస్ కోసం వ్యక్తిత్వ హననం
కొన్ని మీడియా సంస్థలు వ్యూస్ కోసం, రేటింగ్ కోసం ఇష్టానుసారం వార్తలు రాస్తున్నట్టు కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఐఏఎస్ అధికారులపైన అసత్య ప్రచారం చేయోద్దంటూ కోరారు. తన మీద కోపం తగ్గకపోతే విషం ఇచ్చి చంపండంటూ వ్యాఖ్యానించారు. మహిళా ఐఏఎస్ అధికారులకు కుటుంబాలు ఉంటాయని, వారి గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేయకూడదని సూచించారు. ఐఏఎస్ లను మంత్రులు బదిలీ చేయరని, సీఎం బదిలీ చేస్తారని గుర్తు చేశారు. నల్గొండ మంత్రికి, మహిళా ఐఏఎస్ మధ్య సంబంధం అంటూ కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న ప్రచారన్ని కోమటిరెడ్డి ఖండించారు. ఐఏఎస్ లు చాలా కష్టపడి ఆ స్థాయికి వచ్చి ఉంటారని, అలాంటి వారిపై తప్పుడు ప్రచారం సరికాదని సూచించారు. సీఎంపైనా ఇలాంటి ప్రచారం చేశారని, ఆ ప్రచారం వెనుక ఎవరున్నారో తేల్చేందుకు డీజీపీని విచారణకు కోరామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సినీ ఇండస్ట్రీ గురించి పట్టించుకోవట్లేదు
సినిమా ఇండస్ట్రీ గురించి హాట్ కామెంట్స్ చేశారు మంత్రి.. సినీ ఇండస్ట్రీ గురించి తాను పట్టించుకోవడం మానేశానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.. ‘పుష్ప-2 సినిమా తర్వాత బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచాలని నా దగ్గరకు రావొద్దని అప్పుడే చెప్పానన్నారు.. గతంలో రిలీజైన, ఇప్పుడు రిలీజ్ కాబోయే సినిమాల ఫైల్స్ కూడా నా దగ్గరకు రాలేదు. అప్లికేషన్ కూడా పెట్టొద్దని చెప్పడంతో నన్ను ఎవరూ కలవట్లేదు’ అని కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
అప్పుడే సగం చనిపోయా
తన కొడుకు చనిపోయినప్పుడే సగం చనిపోయానని కోమటిరెడ్డి అన్నారు. ఆ తర్వాత సేవాకార్యక్రమాలు చేస్తూ .. రాజకీయాల కంటే ప్రజాసేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాని కోమటిరెడ్డి తెలిపారు. మహిళా ఐఏఎస్ ల ఆత్మగౌరవం దెబ్బతీయొద్దని కోరారు. సినిమా ఇండస్ట్రీ గురించి కూడా తాను పట్టించుకోవడం లేదని, బెన్ఫిట్షోల కోసం, టికెట్ రేట్ల పెంపుకోసం తనవద్దకు రావొద్దని సూచించానని, ఇప్పుడు సినిమా వారు తన వద్దకు రావడంలేదని అన్నారు. తప్పు చేసిన వారిని దేవుడు శిక్షిస్తాడని, రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చు కానీ వ్యక్తిగత పరువుకు భంగం కలిగించే ప్రచారం చేయకూడదన్నారు. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుందని, ఆధారం లేని వార్తలు ప్రచారం చేసి వారి కుటుంబాలను బజారుకీడ్చొద్దని కోరారు. దీనంతటిపై విచారణ జరపాలని ముఖ్యమంత్రిని కోరుతానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
