రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన Influish కంపెనీ ‘ప్రొఫెషనల్ డూమ్‌స్క్రోలర్’ పేరుతో వింత ఉద్యోగాన్ని ప్రకటించింది. ఈ ఉద్యోగంలో రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ వైరల్ వీడియోలు, ట్రెండ్స్‌ను గుర్తించి కంపెనీకి తెలియజేయాలి. నవంబర్ 4న ప్రకటించిన ఈ ఉద్యోగానికి సంబంధించిన వీడియోకు 3.4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 11 వేల మందికి పైగా అప్లికేషన్ లింక్ కోసం అభ్యర్థించడంతో ఈ ఉద్యోగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By: Priya Chowdhary Nuthalapti | 6 Nov 2026 7:20 AM ISTసాధారణంగా రోజంతా ఫోన్ చూస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో సమయం గడిపేవారిని .. చాలామంది పనిచేయకుండా ఎందుకు ఇలా ఉన్నావు అని తిడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు అదే అలవాటుతో డబ్బులు సంపాదించే అవకాశం వస్తే ఎలా ఉంటుంది. మీరు విన్నది నిజమే.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన ఓ కంపెనీ ఇలాంటి వింత ఉద్యోగాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఉదయ్‌పూర్‌కు చెందిన ఇన్‌ఫ్లూయిష్ (Influish) అనే కంపెనీ ప్రొఫెషనల్ డూమ్‌స్క్రోలర్ కోసం ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగంలో భాగంగా రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడాలి. సోషల్ మీడియాలో ఏ వీడియోలు వైరల్ అవుతున్నాయి.. ఏ ట్రెండ్స్ ఎక్కువగా నడుస్తున్నాయి..అనే విషయాలను గుర్తించి కంపెనీకి తెలియజేయాలి.
ఈ ఉద్యోగానికి సంబంధించిన వీడియోను కంపెనీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువగా ఉపయోగించే వారికి ఇది మంచి అవకాశమని ప్రకటించింది. రీల్స్ చూస్తూ సమయం గడిపే అలవాటును ఉద్యోగంగా మార్చుకోవచ్చని తెలిపింది.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం కూడా చాలా సులభం. ఆసక్తి ఉన్నవారు కంపెనీ షేర్ చేసిన వీడియో కింద 'Hi' అని కామెంట్ చేయాలి. ఉదయ్‌పూర్‌లో నివసించే వారికి అప్లికేషన్ లింక్‌ను డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపిస్తామని కంపెనీ వెల్లడించింది.
నవంబర్ 4న ఈ వీడియోను పోస్ట్ చేయగా, ఇప్పటికే 3.4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా 11 వేల మందికి పైగా అప్లికేషన్ ఫారమ్ కోసం అభ్యర్థించినట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఈ ఉద్యోగం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
ఈ ప్రకటనపై నెటిజన్లు కూడా సరదాగా స్పందిస్తున్నారు. కొందరు ఇది తమకు సరైన ఉద్యోగమని కామెంట్లు చేస్తుండగా, మరికొందరు ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నామని అంటున్నారు.
అయితే ఈ ఉద్యోగంలో కేవలం రీల్స్ చూస్తూ సమయం గడపడం మాత్రమే సరిపోదు. వైరల్ అవుతున్న వీడియోలను గుర్తించడం, కొత్త ట్రెండ్స్‌ను గమనించడం, వాటి గురించి కంపెనీకి వివరించడం కూడా ముఖ్యమైన బాధ్యతలు.
సాధారణంగా ఐదు నిమిషాలు రీల్స్ చూడాలని ఫోన్ తీసుకుని గంటల తరబడి గడిపేవారికి ఈ ఉద్యోగం కలలా అనిపించవచ్చు. అయితే సోషల్ మీడియా ట్రెండ్స్‌పై మంచి అవగాహన ఉండటం ఈ ఉద్యోగానికి అవసరం. మొత్తం పైన ఫోన్ ఎక్కువగా చూస్తున్నారని ఇంట్లో తిట్లు తినేవారికి ఇప్పుడు ఈ ఉద్యోగ ప్రకటన ఒక కొత్త ఆశను కలిగిస్తోంది. రోజంతా రీల్స్ చూస్తూ జీతం సంపాదించే అవకాశం నిజంగానే ఆసక్తికరంగా మారింది.
