Begin typing your search above and press return to search.

2025 ఐటీ రౌండప్ : 1.22 లక్షల మంది ఐటీ ఉద్యోగుల తొలగింపు

కల చెదురుతోంది. లక్షల జీతాల లగ్జరీల లైఫ్ కు తెరపడుతున్నాయి. 20 ఏళ్లు పనిచేసిన వారిని కూడా దయా దాక్షిణ్యాలకు తొలగిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.

By:  A.N.Kumar   |   30 Dec 2025 10:00 AM IST
2025 ఐటీ రౌండప్ : 1.22 లక్షల మంది ఐటీ ఉద్యోగుల తొలగింపు
X

కల చెదురుతోంది. లక్షల జీతాల లగ్జరీల లైఫ్ కు తెరపడుతున్నాయి. 20 ఏళ్లు పనిచేసిన వారిని కూడా దయా దాక్షిణ్యాలకు తొలగిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. సాఫ్ట్ వేర్ అంటే ఇప్పుడు ఒక ఉపద్రవంలా మారింది. గ్యారెంటీ లేని జీవితంగా తయారైంది. ఏఐ, ఆటోమేషన్ రాకతో సాఫ్ట్ వేర్ నిపుణుల బతుకులు ఆగమవుతున్నాయి. ఈ పరిణామం ఐటీరంగంలో లేఆఫ్స్ కు దారితీసి లక్షల మంది ఐటీ నిపుణులను రోడ్డునపడేలా చేస్తున్నాయి.

సాఫ్ట్ వేర్ రంగం అంటేనే ఒకప్పుడు ఉద్యోగ భద్రతకు, భారీ జీతాలకు కేరాఫ్ అడ్రస్.. కానీ 2025 సంవత్సరం ఐటీ ఉద్యోగులకు ఒక పీడకలలా మారింది. ఏడాది ముగిసే సమయానికి ఐటీ రంగంలో ఉద్యోగాల కోత ఊహించని స్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు మొదలు కొని స్టార్టప్ ల వరకూ ‘పింక్ స్లిప్పుల’ పరంపర కొనసాగిస్తున్నాయి.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

టెక్ లేఆఫ్స్ ను ట్రాక్ చేసే ‘లేఆఫ్స్.ఎఫ్ వైఐ’ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకూ సుమారు 257 ఐటీ కంపెనీలు తమ సిబ్బందిని తగ్గించుకున్నాయి. దీనివల్ల దాదాపు 1,22,000 మందికి పైగా ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ ఆర్థిక అనిశ్చితి 2025లో పరాకాష్టకు చేరుకోవడం గమనార్హం.

దిగ్గజ సంస్థల్లోనూ అదే పరిస్థితి

ఈ ఉద్వాసనల వేటు కేవలం చిన్న కంపెనీలకే పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్ లో తిరుగులేని శక్తులుగా ఉన్న సంస్థలు కూడా ఖర్చుల తగ్గింపు పేరుతో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. టీసీఎస్ భారతీయ ఐటీ దిగ్గజం కూడా పునర్వ్యస్థీకరణలో భాగంగా మార్పులు చేపట్టింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ , ఈ కామర్స్ రంగాల్లో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థలు కూడా వేలసంఖ్యలో ఉద్యోగ కోతలను ప్రకటించాయి.

ఉద్యోగాల కోతకు ప్రధాన కారణాలు..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్ రాకతో గతంలో మనుషులు చేసే అనేక రోటీన్ పనులను ఇప్పుడు సాఫ్ట్ వేర్ ప్రొగ్రామ్లే చేస్తున్నాయి. దీంతో మానవ వనరుల అవసరం తగ్గుతోంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతున్నాయి. లాభదాయకతను పెంచుకోవడానికి కంపెనీలు తమ నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఉద్యోగులకు తక్షణ కర్తవ్యం?

ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే సంప్రదాయ నైపుణ్యాలు మాత్రమే సరిపోవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి విభాగాల్లో పట్టు సాధించాలి. డిజిటల్ భద్రతకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలో కొత్త అవకాశాలను వెతుక్కోవాలి. టెక్నాలజీ ప్రతీరోజూ మారుతోంది. కాబట్టి నిరంతరం నేర్చుకునే తత్వం ఉన్న వారికే భవిష్యత్తులో ఉద్యోగ భద్రత ఉంటుంది.

2025 ఐటీ రంగానికి ఒక గడ్డు కాలం అయినప్పటికీ.. ఇది ఒక పరివర్తన దశగా భావించవచ్చు. పాత నైపుణ్యాల స్థానంలో కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. ఈ మార్పును అందిపుచ్చుకున్న వారు మాత్రమే రేపటి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలరు.