టీసీఎస్ లో మరో లొల్లి? రతన్ టాటా తర్వాత అంతా మారిపోయాదా?
దేశంలో ఎన్ని బ్రాండ్లు ఉన్నప్పటికి ‘టాటా’ అనే రెండు అక్షరాలకు ఉన్న ఇమేజ్.. ఆ గ్రూపు సంస్థలపై ఉండే నమ్మకం..విశ్వాసం అంతా ఇంతా కాదు.
By: Garuda Media | 16 Sept 2025 9:21 AM ISTదేశంలో ఎన్ని బ్రాండ్లు ఉన్నప్పటికి ‘టాటా’ అనే రెండు అక్షరాలకు ఉన్న ఇమేజ్.. ఆ గ్రూపు సంస్థలపై ఉండే నమ్మకం..విశ్వాసం అంతా ఇంతా కాదు. దశాబ్దాల తరబడి నమ్మకానికి నిలువెత్తు రూపంగా నిలిచే ఈ గ్రూపు సంస్థలపై కొత్త సందేహాలు వ్యక్తమయ్యే పరిణామాలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. రతన్ టాటా జీవించినంత కాలం టాటా గ్రూపునకు సంబంధించి ఎప్పుడూ ఎలాంటి వివాదం తెర మీదకు వచ్చింది లేదు. అందుకు భిన్నంగా ఇటీవల టాటా గ్రూపునకు చెందిన టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) చుట్టూ రోజుకో వివాదం తెర మీదకు వస్తోంది.
భారీగా లేఆఫ్ ల ప్రకటనతో పాటు.. సంస్థలో పని చేసే ఉద్యోగుల చేత బలవంతంగా రాజీనామాలు.. ఉద్యోగ విరమణలు చేయిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా మరో జూనియర్ ఐటీ ఉద్యోగిని బలవంతంగా జాబ్ నుంచి తీసే అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి కారణం సదరు ఉద్యోగి పక్కా ఆధారాలతో చర్చకు తెర తీశారు. ప్రొఫెషనల్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రెడిట్ లో షేర్ చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పోస్టుపై 3 వేలకు పైగా సానుుకూల స్పందనలు.. వందలాది కామెంట్లు రావటం గమనార్హం.
పోస్టు పెట్టిన ఉద్యోగి తనను తాను టీసీఎస్ లో జూనియర్ టెకీగా పరిచయం చేసుకున్నాడు. ఇదే తన మొదటి ఉద్యోగంగా పేర్కొన్న అతను.. ‘జీతం తక్కువే అయినా.. వర్కు కల్చర్.. ఉద్యోగ భద్రత అంశాల్నిప్రామాణికంగా చేసుకొని టీసీఎస్ లో వచ్చిన ఆఫర్ ను అంగీకరించి జాబ్ లో చేరా. మూడు రోజుల క్రితం హెచ్ వారు మీటింగ్ హాల్ కు పిలిచి.. అక్కడ నన్ను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. అందుకు నేను నో చెప్పా. అలా చేస్తే టర్మినేట్ చేసి వ్యతిరేక రివ్యూలు ఇస్తానని బెదిరించారు. అయినా సరే రాజీనామా చేయను. మీకు నచ్చింది చేసుకోండని చెప్పా. ఏ ఉద్యోగ భద్రతకోసం కంపెనీలో చేరానో.. ఇప్పుడు అదే సమస్యగా మారింది’’ అని పేర్కొన్నారు.
ఈ జూనియర్ ఉద్యోగి పెట్టిన పోస్టుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. బలవంతంగా ఉద్యోగాల నుంచి తీసేస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై టీసీఎస్ స్పందించటం లేదు. ఈ పోస్టు పెట్టిన ఐటీ ఉద్యోగి మరో కీలక వ్యాఖ్య చేశారు. రతన్ టాటా తర్వాత.. కంపెనీ గందరగోళానికి గురైందని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే.. టాటా గ్రూపునకు దశాబ్దాల తరబడి ఏదైతే ఇమేజ్ ఉందో..దానికి తూట్లు పడేలా పరిణామాలు చోటు చేసుకోవటంపై టాప్ ఆర్డర్ ఒక్కసారి అలెర్టు అవ్వాల్సిన అవసరం ఉంది.
