Begin typing your search above and press return to search.

జీవితం ధారపోసే ఉద్యోగులకు ఐటీ కంపెనీలు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా?

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఒరాకిల్ తన సంస్థలోని కీలక విభాగాలకు చెందిన లీడర్లకు 'వాలంటరీ సెవరెన్స్ ప్యాకేజీ'ని ఆఫర్ చేస్తోందట.

By:  A.N.Kumar   |   6 Oct 2026 4:25 PM IST
జీవితం ధారపోసే ఉద్యోగులకు ఐటీ కంపెనీలు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా?
X

ఏళ్ల తరబడి కష్టపడి.. రాత్రింబవళ్లు శ్రమించి సంస్థ ఎదుగుదలకు చెమటోడ్చిన ఉద్యోగులకు ఐటీ కంపెనీలు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? నిన్నటికి నిన్న లేఆఫ్‌ల పేరుతో వేలాది మందిని రోడ్డున పడేసిన వార్తలు మరువకముందే ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఒరాకిల్ నుంచి వచ్చిన కొత్త వార్త ఉద్యోగుల గుండెల్లో గుబులు రేపుతోంది. సాధారణంగా ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాల్లో 'వాలంటరీ రిటైర్మెంట్' (వీఆర్ఎస్) గురించి విన్నాం.. కానీ ఐటీ రంగంలోకి కొత్తగా వచ్చి పడ్డ ఈ 'వాలంటరీ ఎగ్జిట్' ఏంటి? అని టెక్కీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఒరాకిల్ తన సంస్థలోని కీలక విభాగాలకు చెందిన లీడర్లకు 'వాలంటరీ సెవరెన్స్ ప్యాకేజీ'ని ఆఫర్ చేస్తోందట. "కంపెనీని వదిలి స్వచ్ఛందంగా వెళ్ళిపోతే ఆరు వారాల జీతంతో పాటు.. మీరు పనిచేసిన ప్రతి ఏడాదికి ఒక వారం అదనపు జీతం ఇస్తాం" అంటూ గులాబీ కార్డులను ఆఫర్ల రూపంలో ముస్తాబు చేసి చేతిలో పెడుతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. బయటపడటానికి ఇది ప్యాకేజీలా కనిపిస్తున్నా లోపల మాత్రం "మీంతట మీరు వెళ్లకపోతే మేమే పంపించేస్తాం" అనే పరోక్ష హెచ్చరిక దాగి ఉందనేది ఉద్యోగుల ఆవేదన.

ఇప్పటికే ఒరాకిల్‌లో వేలాది మంది ఉద్యోగులు పింక్ స్లిప్పులు అందుకున్నారు. సుమారు 30,000 మందికి పైగా ఉద్యోగాలపై ఈ కోతల ప్రభావం పడిందని అంచనా. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సెంటర్ల వైపు రేసు గుర్రంలా పరిగెడుతున్న కంపెనీలు.. ఈ క్రమంలో ఏళ్ల తరబడి సేవ చేసిన మనుషులను, వారి అనుభవాన్ని పక్కన పెట్టేస్తున్నాయి. ఏఐ వస్తోంది.. ఆటోమేషన్ పెరుగుతోంది అనే ఒకే ఒక్క కారణంతో నిన్నటివరకు ప్రాజెక్టులను భుజాన మోసిన నిపుణులను నేడు ‘అదనపు భారంగా’ చూడటం ఎంతో కలచివేస్తోంది.

హోమ్ లోన్లు, పిల్లల చదువులు, కుటుంబ బాధ్యతలతో రోజూ ఆఫీస్ మెట్లు ఎక్కే సగటు ఐటీ ఉద్యోగికి ఈ వార్తలు నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నాయి. డిసెంబర్‌లో మరో రౌండ్ లేఆఫ్స్ ఉండవచ్చనే ఊహాగానాలు వారిని మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఒరాకిల్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ ఈ వార్తలు సృష్టిస్తున్న మానసిక ఒత్తిడి మాత్రం నిజం. లాభాల బాటలో పరుగెత్తే కార్పొరేట్ దిగ్గజాలు.. ఉద్యోగుల భవిష్యత్తును.. వారి కుటుంబాల ఆశలను ఇలా వాలంటరీ ఎగ్జిట్‌ల పేరుతో బలిపీఠం ఎక్కిస్తుండటం టెక్ ప్రపంచంలో తీవ్ర వేదనను నింపుతోంది.