లేఆఫ్స్ కలకలం.. ఒరాకిల్‌లో ఉద్యోగుల గుండెకోత.. "ఈరోజే మీ చివరి పని రోజు" అంటూ వైరలవుతున్న ఈమెయిల్
రాత్రికి రాత్రే జీవితాలు మారిపోవడం అంటే ఇదేనేమో.. ఐటీ ఉద్యోగం సాధించి.. ఎన్నో ఆశలతో ఒరాకిల్ వంటి ప్రతిష్టాత్మక బహుళజాతి సంస్థలో అడుగుపెట్టిన వేలాది మంది ఉద్యోగుల కలలు ఒక్కసారిగా కల్లలయ్యాయి.
By: A.N.Kumar | 15 Sept 2026 4:06 PM ISTరాత్రికి రాత్రే జీవితాలు మారిపోవడం అంటే ఇదేనేమో.. ఐటీ ఉద్యోగం సాధించి.. ఎన్నో ఆశలతో ఒరాకిల్ వంటి ప్రతిష్టాత్మక బహుళజాతి సంస్థలో అడుగుపెట్టిన వేలాది మంది ఉద్యోగుల కలలు ఒక్కసారిగా కల్లలయ్యాయి. ఇటీవల టెక్ రంగాన్ని కుదేల్ చేస్తున్న లేఆఫ్స్ పరంపరలో ఇప్పుడు ఒరాకిల్ ఉద్యోగులు బలికావలసి వస్తోంది. సంస్థ నుంచి వచ్చిన ఒక్క ఇమెయిల్ వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేసింది.
గుండె పగిలే నిజం.. ఆ ఒక్క మెయిల్‌తో జీవితం తలకిందులు
సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తున్న ఒరాకిల్ ఫేర్‌వెల్ ఈమెయిల్.. ఉద్యోగుల మనస్సులను తీవ్రంగా గాయపరుస్తోంది. ఆ మెయిల్‌లో ఉన్న “ఈరోజే మీ చివరి పని రోజు” అనే కొన్ని పదాలు.. ఎంతోమంది కుటుంబాల కొండంత ఆశలపై నీళ్లు చల్లాయి. సంస్థ అనుసరిస్తున్న నూతన వ్యాపార విధానాలు, విస్తృత స్థాయి పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా మీ పాత్రను తొలగిస్తున్నామంటూ కంపెనీ పంపిన ఆ సందేశం చదివిన ప్రతి ఒక్కరి కళ్లు చెమరుస్తున్నాయి. ఇన్నాళ్లూ రాత్రింబవళ్లు కంపెనీ పురోగతి కోసం శ్రమించిన ఉద్యోగులకు.. కనీసం కోలుకునే సమయం కూడా ఇవ్వకుండా ఒక్క రోజులోనే వీడ్కోలు పలకడం ఐటీ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.
క్షణాల్లో ఊడిపోయిన యాక్సెస్.. కఠిన నిబంధనలు
ఈ లేఆఫ్ మెయిల్‌లో మరో కఠోరమైన నిజం ఉద్యోగులను మానసికంగా కోలుకోలేని దెబ్బతీసింది. ఇన్నాళ్లూ తమ సొంత ఇంటిలా భావించిన సిస్టమ్స్, ఈమెయిల్, క్లౌడ్ ఫైల్స్, వాయిస్‌మెయిల్‌లకు సంబంధించిన యాక్సెస్‌ను తక్షణమే నిలిపివేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. మెయిల్ చదివిన కొన్ని క్షణాల్లోనే సిస్టమ్‌లు లాగ్ ఆఫ్ అయిపోవడం, సహచర ఉద్యోగులకు కనీసం మనస్ఫూర్తిగా వీడ్కోలు చెప్పుకునే అవకాశం కూడా లేకపోవడం అత్యంత బాధాకరం. పైగా కంపెనీ డేటాను లేదా రహస్య సమాచారాన్ని వ్యక్తిగత మెయిల్స్‌కు పంపుకోకూడదంటూ జారీ చేసిన హెచ్చరికలు వారిని మరింత కుంగదీస్తున్నాయి.
అంధకారంలో భవిష్యత్తు.. ఎంతమందిపై ఈ ప్రభావం?
సివిల్ సర్వీసెస్ స్థాయిలో కష్టపడి ఐటీలోకి వచ్చిన యువత, ఇళ్ల రుణాలు, పిల్లల చదువులు, ఇతర కుటుంబ బాధ్యతలతో సతమతమవుతున్న ఈ సమయంలో ఈ తొలగింపులు పెద్ద పిడుగుపాటులా మారాయి. కంపెనీ అందించే సెవెరెన్స్ ప్యాకేజీ తాత్కాలికంగా కొంత ఊరటనిచ్చినా.. మున్ముందు రోజుల్లో ఉద్యోగం దొరుకుతుందా లేదా అన్న భయం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది.
ఈ విడతలో దాదాపు డబుల్ డిజిట్ శాతంలో ఉద్యోగులను తొలగించవచ్చనే అంచనాలు టెక్ రంగాన్ని మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ టెక్నాలజీ వైపు కంపెనీలు అడుగులు వేస్తూ వ్యయ నియంత్రణ పేరుతో నిబద్ధతతో పనిచేసిన మానవ వనరులను ఇలా అర్ధాంతరంగా రోడ్డుపై పడేయడం ఐటీ సంస్కృతిలోని దారుణమైన కోణాన్ని ఆవిష్కరిస్తోంది. ఒరాకిల్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎంతమంది జీవితాలు చీకట్లోకి నెట్టబడ్డాయో తెలియని పరిస్థితి నెలకొంది.
