32 ఏళ్లకే ₹1 కోటి జీతం సాధించిన ఇంజినీర్ కథ
గొప్ప విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఐఐటీ వంటి టాప్ ఇన్‌స్టిట్యూషన్ నుంచే గ్రాడ్యుయేట్ కావాల్సిన అవసరం లేదు.
By: A.N.Kumar | 5 Aug 2025 5:00 AM ISTగొప్ప విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఐఐటీ వంటి టాప్ ఇన్‌స్టిట్యూషన్ నుంచే గ్రాడ్యుయేట్ కావాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని నిజం చేసి చూపించాడు ఒక సాధారణ ఇంజినీర్. ఏ ఐఐటీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, అతడు కేవలం 32 ఏళ్ల వయసులోనే కోటి రూపాయల వార్షిక జీతాన్ని అందుకున్నాడు. అతని అద్భుతమైన ప్రయాణం ఇప్పుడు ఎంతోమంది యువతకు ప్రేరణగా నిలుస్తోంది. అతని కథను Redditలో పంచుకున్నప్పుడు అది వేలాదిమందిని ఆశ్చర్యపరిచింది.
-₹4.4 లక్షల జీతంతో మొదలైన ప్రయాణం
అతని విజయ ప్రయాణం 2015లో బెంగళూరులో ఒక క్యాంపస్ ప్లేస్‌మెంట్‌తో ప్రారంభమైంది. మొదటి ఉద్యోగంలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా చేరినప్పుడు అతని ఫిక్స్‌డ్ జీతం ₹4.4 లక్షలు. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అతనికి ఈ జీతం పెద్ద విజయంగా అనిపించింది. ఆ సమయంలో ఐదుగురు స్నేహితులతో కలిసి ఒక రెండు బెడ్‌రూమ్ గదిలో ఉంటూ జాగ్రత్తగా డబ్బులు ఆదా చేసుకునేవాడు. 2016 నాటికి అతని జీతం ₹5.8 లక్షలకు పెరిగింది.
-ఐఐఎం అడ్మిషన్: కెరీర్‌లో కీలక మలుపు
2017లో అతని జీవితంలో ఒక కీలక మలుపు వచ్చింది. అతడు ప్రఖ్యాత ఐఐఎం (IIM)లో అడ్మిషన్ పొందాడు. ఇది అతని కెరీర్‌కు కొత్త దిశానిర్దేశం చేసింది. ఐఐఎం చదువు పూర్తి చేశాక 2019లో ఒక ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్‌తో ఒక ప్రోగ్రామ్ మేనేజర్‌గా ₹17 లక్షల జీతంతో ఉద్యోగం వచ్చింది. మొదట్లో విదేశీ ఉద్యోగం రద్దయినా, నిరాశ చెందకుండా ముందుకు సాగాడు. 2020లో అతని జీతం ₹18.5 లక్షలకు పెరిగింది. కానీ, తన కెరీర్‌లో ఇంకా ఏదో సాధించాలనే తపన అతడిని ముందుకు నడిపింది.
-కొత్త అవకాశాల కోసం ఉద్యోగం వదిలి..
2021లో తన ఉద్యోగాన్ని వదిలి, ఒక ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలో ₹22 లక్షల జీతంతో చేరాడు. ఇందులో ₹7 లక్షలు స్టాక్ ఆప్షన్స్ రూపంలో ఉండేవి. 2022లో చిన్న ప్రమోషన్‌తో అతని జీతం ₹24 లక్షలకు చేరింది. అయితే ఈ సంపాదనతో కూడా అతడు పూర్తి సంతృప్తి చెందలేదు. 2023లో అతను రిమోట్ వర్క్ దిశగా అడుగులు వేసి ఒక SaaS కంపెనీలో ₹31 లక్షల ఫిక్స్‌డ్ పే, ₹12 లక్షల జాయినింగ్ బోనస్‌తో ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగ టైటిల్ పెద్దగా లేకపోయినా, పెరిగిన ఆదాయం, అలాగే పనిలో ఉన్న స్వేచ్ఛ అతడిని ఆకట్టుకున్నాయి. 2024లో జీతం ₹41 లక్షలు, 2025 ప్రారంభంలో ₹47 లక్షలు అయ్యింది. అయినా కూడా తన కెరీర్‌లో ఇంకేదో సాధించాలనే కోరిక అతడిలో బలంగా ఉండేది.
-వేట అతడి కెరీర్‌ను మలిచిన మలుపు
2025 మధ్యలో అతడు ఒక ప్రిన్సిపల్ ప్రోగ్రామ్ మేనేజర్ రోల్‌ను స్వీకరించాడు. ఈ పొజిషన్ నేరుగా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌కి రిపోర్ట్ చేసే స్థాయిలో ఉంటుంది. ఈ ఉద్యోగంతో అతని జీతం ఏకంగా ₹1.03 కోట్లు : ఫిక్స్‌డ్ ₹70 లక్షలు, వేరియబుల్ ₹8 లక్షలు, ESOPలు ₹25 లక్షలు. ఇంతకుముందు పనిచేసిన కంపెనీ ₹65 లక్షల కౌంటర్ ఆఫర్ ఇచ్చినా, భవిష్యత్తులో మరింత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అతడు ఆ ఆఫర్‌ను తిరస్కరించి ఈ కొత్త అవకాశాన్ని స్వీకరించాడు.
-వయసు కాదు, ధైర్యం, కృషి ముఖ్యం
ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే... అద్భుతాలు సాధించడానికి టాప్ ఇన్‌స్టిట్యూషన్ల నుంచే చదవాల్సిన అవసరం లేదు. సరైన నిర్ణయాలు, సరైన టైమింగ్, అలాగే ధైర్యంతో కూడిన ప్రయత్నం ఉంటే సాధారణ నేపథ్యం నుంచి వచ్చినవారు కూడా కోట్ల రూపాయల జీతాన్ని అందుకోవచ్చు. ఈ ఇంజినీర్ ఇప్పటికీ 2015లో కొన్న పాత బైక్‌నే వాడుతూ, చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ కథ మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది - మీ కలలను నిజం చేసుకోవడానికి అత్యున్నత డిగ్రీలు కాదు, మీ కృషి, వివేకం, మరియు పట్టుదల మాత్రమే ముఖ్యం.
