బిగ్ బ్యాడ్ న్యూస్... 16,000 ఉద్యోగులను తొలగించనున్న దిగ్గజ సంస్థ!
అవును... ఇటీవల కాలంలో పలు ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు వేస్తున్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 17 Oct 2025 11:58 AM ISTఇటీవల కాలంలో దిగ్గజ సంస్థలు రకరకాల కారణాలతో పెద్ద ఎత్తున లే ఆఫ్ లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఐటీ కంపెనీల్లో తరచూ కొనసాగుతున్న ఉద్యోగులపై వేటు.. ఇప్పుడు ఆహార సంస్థలకు విస్తరించింది. ఇందులో భాగంగా స్విట్జర్లాండ్ ఆహార దిగ్గజ సంస్థ 'నెస్లే' భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ఈ మేరకు కంపెనీ ఓ కీలక ప్రకటన చేసింది.
అవును... ఇటీవల కాలంలో పలు ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇటీవల ప్రముఖ ఇ-కమర్స్ సంస్థ అమెజాన్ మరోసారి భారీ తొలగింపులకు ప్రణాళికలు వేస్తోందని.. ఇందులో భాగంగా.. మానవ వనరుల విభాగంలో సుమారు 15 శాతం వరకు సిబ్బందిని తగ్గించేందుకు సన్నాహాలు చేస్తోందని కథనాలొచ్చాయి.
ఈ క్రమంలో తాజాగా నెస్లే ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ వెల్లడించింది. ఇందులో భాగంగా... రానున్న రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 16 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కాస్ట్ కటింగ్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది! ఈ సందర్భంగా... సంస్థ సీఈవో ఫిలిప్ నవ్రాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... ప్రపంచం మారుతోంది, దానికి తగ్గట్లే 'నెస్లే' కూడా వేగంగా మారాల్సి ఉందని ఫిలిప్ నవ్రాటిల్ పేర్కొన్నారు. ఇదే సమయంలో... ఇది కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ.. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. పొదుపు లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయమని తెలిపారు.
ఈ 16,000 ఉద్యోగాల కోతలో భాగంగా 12,000 వైట్ కాలర్ ఉద్యోగాలను, మరో 4,000 ప్రొడక్షన్, సప్లై చైన్ విభాగాల్లోని ఉద్యోగాలను తగ్గించనున్నారు. వచ్చే ఏడాది చివరకు ఖర్చులను 3 బిలియన్ స్విస్ ఫ్రాంకుల (రూ.33,000 కోట్ల)కు తగ్గించుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యం ఇంతకు ముందు 2.5 బిలియన్ స్విస్ ఫ్రాంకులుగా ఉంది.
తగ్గిన నెస్లే లాభాలు!:
మరోవైపు 'నెస్లే ఇండియా' ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.743.17 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అయితే... 2024-25 ఇదే త్రైమాసిక లాభం రూ.899.5 కోట్లతో పోలిస్తే ఇది 17.37% తక్కువగా ఉంది. ఇదే సమయంలో.. మొత్తం ఆదాయం రూ.5,074.76 కోట్ల నుంచి 11% వృద్ధి చెంది రూ.5,630.23 కోట్లకు చేరింది.
