Begin typing your search above and press return to search.

ట్రెండింగ్ లో జాబ్ హగ్గింగ్.. అసలు ఏంటి దీని కథ?

కరోనా తర్వాత ఉద్యోగ ప్రపంచంలో రకరకాల కొత్త పదాలు వింటున్నాం. మొన్నటి వరకు ‘క్వైట్ క్విట్టింగ్’ (సైలెంట్‌గా పని తగ్గించడం) గురించి మాట్లాడుకున్నాం.

By:  Madhu Reddy   |   10 March 2026 11:00 PM IST
ట్రెండింగ్ లో జాబ్ హగ్గింగ్.. అసలు ఏంటి దీని కథ?
X

కరోనా తర్వాత ఉద్యోగ ప్రపంచంలో రకరకాల కొత్త పదాలు వింటున్నాం. మొన్నటి వరకు ‘క్వైట్ క్విట్టింగ్’ (సైలెంట్‌గా పని తగ్గించడం) గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. అదే ‘జాబ్ హగ్గింగ్’ (Job Hugging). అంటే చేస్తున్న ఉద్యోగం నచ్చకపోయినా, జీతం చాలకపోయినా దాన్ని గట్టిగా పట్టుకుని కూర్చోవడం అన్నమాట. బయట పరిస్థితులు బాగోలేక, ఎప్పుడు ఏ కంపెనీ లేఆఫ్స్ ప్రకటిస్తుందో అన్న భయంతో పుట్టుకొచ్చిన ఈ కొత్త ట్రెండ్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

కంపెనీపై ప్రేమ కాదు.. భద్రత కోసం పట్టు:

సాధారణంగా ఒక ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా, బాస్ పెట్టే టార్గెట్లు తట్టుకోలేకపోయినా వెంటనే రాజీనామా చేసి వేరే కంపెనీకి మారడం మనకు తెలుసు. కానీ ‘జాబ్ హగ్గింగ్’ చేసేవారు మాత్రం అలా చేయరు. ఇక వారికి ఆ ఉద్యోగం అంటే ప్రాణం అని కాదు, బయట మార్కెట్ దారుణంగా ఉందనే భయం. కొత్త ఉద్యోగం వెతుక్కునే రిస్క్ తీసుకోవడం కంటే, వస్తున్న కొద్దిపాటి జీతాన్ని కాపాడుకోవడమే మేలని వీరు భావిస్తారు. అంటే ఇది కంపెనీపై ఉన్న ఇష్టంతో చేసేది కాదు, కేవలం ఆర్థిక భద్రత కోసం చేస్తున్న ఒక బలవంతపు సర్దుబాటు మాత్రమే.

అనిశ్చితిలో ఉద్యోగులు:

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలు కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కొత్తగా మరో కంపెనీలో చేరితే, అక్కడ మన పరిస్థితి ఏంటో అన్న సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది. అందుకే, ఉన్న చోట గుర్తింపు లేకపోయినా, ప్రమోషన్లు రాకపోయినా సరే.. కనీసం నెల నెలా జీతం వస్తోంది కదా అని ఉద్యోగులు సరిపెట్టుకుంటున్నారు. ఇక దీన్నే నిపుణులు ‘కెరీర్ ప్రొటెక్షన్ మోడ్’ అని కూడా పిలుస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, సముద్రంలో తుపాను తగ్గే వరకు పడవను గట్టిగా పట్టుకుని ఒడ్డున ఆగినట్లు, మార్కెట్ కుదుటపడే వరకు ఉద్యోగాన్ని హగ్ చేసుకుంటున్నారు.

వృత్తిపరమైన ఎదుగుదల మాటేంటి?:

ఈ ‘జాబ్ హగ్గింగ్’ వల్ల ఉద్యోగులకు ఆర్థికంగా కొంత భరోసా లభించినా, వారి కెరీర్ ఎదుగుదల మాత్రం ఆగిపోతుంది. ఒకే చోట ఏళ్ల తరబడి ఉండిపోవడం వల్ల కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం తగ్గుతుంది. పని పట్ల ఉత్సాహం తగ్గిపోవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో సాహసాలు చేయడం కంటే ఉన్నదాన్ని నిలబెట్టుకోవడమే తెలివైన పని అని చాలా మంది యువ ఉద్యోగులు భావిస్తున్నారు. అందుకే రిస్క్ తీసుకోవడానికి బదులు ‘వెయిట్ అండ్ వాచ్’ పాలసీని అనుసరిస్తూ, మార్కెట్ మళ్ళీ ఎప్పుడు పుంజుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు.