ఒరాకిల్ సహా టాప్ కంపెనీలకు రెండేళ్ల పాటు నో ప్లేస్ మెంట్స్.. షాకిచ్చిన ఐఐటీలు
సాధారణంగా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో విద్యనభ్యసించి, ఉత్తమ ప్రతిభ చూపే విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అనేది ఒక ముఖ్యమైన మైలురాయి.
By: A.N.Kumar | 26 Sept 2026 4:50 PM ISTదేశంలోని అత్యున్నత సాంకేతిక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా విద్యార్థులకు ఉద్యోగ ఆఫర్లు ఇచ్చి.. ఆపై వాటిని ఉపసంహరించుకున్న ప్రముఖ సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వైఖరిని సహించేది లేదని స్పష్టం చేస్తూ.. నిబంధనలు ఉల్లంఘించిన 22 కంపెనీలపై రాబోయే రెండేళ్లపాటు.. రెండు ప్లేస్‌మెంట్ సీజన్లు రిక్రూట్‌మెంట్‌కు రాకుండా ఆంక్షలు విధించడానికి సమాయత్తమవుతున్నాయి.
బాధ్యతారాహిత్యానికి చెక్.. 150కి పైగా ఆఫర్లు ఉపసంహరణ
సాధారణంగా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో విద్యనభ్యసించి, ఉత్తమ ప్రతిభ చూపే విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అనేది ఒక ముఖ్యమైన మైలురాయి. అయితే 2026 గ్రాడ్యుయేషన్ బ్యాచ్‌కి సంబంధించి పలు ఐఐటీల విద్యార్థులకు కంపెనీలు ఆఫర్ లెటర్లు అందించిన తర్వాత తమ నియామక ప్రణాళికలు మారాయనే సాకుతో ఏకంగా 150కి పైగా ఉద్యోగ ఆఫర్లను రద్దు చేసుకున్నాయి.
కార్పొరేట్ దిగ్గజాలు ఇలా అకస్మాత్తుగా వెనక్కి తగ్గడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన 'ఆల్ ఐఐటీస్ ప్లేస్‌మెంట్ కమిటీ' , బాధిత విద్యార్థులకు న్యాయం చేయడంతో పాటు కార్పొరేట్ రిక్రూటర్లకు గట్టి సందేశం పంపాలని నిశ్చయించుకుంది.
ఆరా తీస్తే 'ఒరాకిల్' సహా ప్రముఖ టెక్ సంస్థల పేర్లు
కమిటీ పరిశీలనలో ఉన్న ఆంక్షల జాబితాలో ప్రముఖ బహుళజాతి ఐటీ సంస్థ 'ఒరాకిల్' కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వివిధ ఐఐటీ క్యాంపస్‌లలో ఒరాకిల్ అందించిన దాదాపు 40 ఉద్యోగ ఆఫర్లు అమలుకు నోచుకోలేదని తెలుస్తోంది. ఇటువంటి బాధ్యతారాహిత్య ధోరణి చూపిన మొత్తం 22 కంపెనీలను తదుపరి రెండు క్యాంపస్ డ్రైవ్‌ల నుండి మినహాయించాలని కమిటీ భావిస్తోంది. ఈ నిర్ణయానికి సంబంధించిన అధికారిక వర్తమానాన్ని సెప్టెంబర్ 30 నాటికి సదరు కంపెనీలకు పంపించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
తుది జాబితాపై కసరత్తు
ప్రస్తుతం ప్రతి ఐఐటీ కేంద్రం తమ వద్ద ఉన్న డేటాను కమిటీకి నివేదిస్తోంది. ఆయా వివరాలను సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే ఆంక్షలు ఎదుర్కొనే కంపెనీల ఫైనల్ లిస్ట్ విడుదల కానుంది. దీనివల్ల 22 అనే సంఖ్యలో కొద్దిపాటి మార్పులు ఉండే అవకాశం ఉంది.
బాధితులకు 'ప్లేస్‌మెంట్స్ టీమ్' కొండంత అండ
ఉద్యోగ ఆఫర్లు కోల్పోయిన విద్యార్థులను ఏమాత్రం ఒంటరిగా వదిలేయకుండా ఐఐటీల ప్లేస్‌మెంట్ విభాగాలు రంగంలోకి దిగాయి. వారందరికీ ప్రత్యామ్నాయ రిక్రూట్‌మెంట్ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. గతం కంటే మరింత మెరుగైన ఆఫర్లు సాధించేలా ఇతర సంస్థలతో చర్చలు జరుపుతూ వారికి కొండంత అభయాన్ని అందిస్తున్నాయి.
భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారనున్న నిర్ణయం!
ఐఐటీలు తీసుకుంటున్న ఈ దృఢమైన నిర్ణయంపై విద్యారంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్ అనేది విద్యార్థులకు కేవలం ఒక ప్రక్రియ మాత్రమే కాదు.. అది వారి జీవితంలో ఒక మైలురాయి. ఇకపై క్యాంపస్ ఇంటర్వ్యూలకు వచ్చే రిక్రూటర్లు ఆఫర్లు ఇచ్చే ముందు తమ వ్యాపార అవసరాలను, బడ్జెట్‌ను ఖచ్చితంగా అంచనా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థుల విద్యార్హతకు, వారి శ్రమకు సరైన గౌరవం దక్కడంతో పాటు వారికి ఉద్యోగ భద్రత లభిస్తుంది.
ఐఐటీల ఈ సంచలన చర్య భారతదేశంలోని అన్ని ఇతర విశ్వవిద్యాలయాలకు, క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే కంపెనీలకు ఒక పెద్ద పాఠంగా మారనుందనడంలో సందేహం లేదు.
