Begin typing your search above and press return to search.

‘మీరు ఫైర్’.. ఒక్క కాల్‌తో మొత్తం ఇండియా టీమ్‌కు షాక్

సూర్యాస్తమయం అయ్యి.. ఆఫీస్ పని ముగించుకుని హాయిగా నిద్రపోదామనుకున్న ఆ ఉద్యోగులకు ఆ రాత్రి ఒక కాళరాత్రిగా మారుతుందని ఊహించలేదు.

By:  A.N.Kumar   |   17 Sept 2026 7:32 PM IST
‘మీరు ఫైర్’.. ఒక్క కాల్‌తో మొత్తం ఇండియా టీమ్‌కు షాక్
X

సూర్యాస్తమయం అయ్యి.. ఆఫీస్ పని ముగించుకుని హాయిగా నిద్రపోదామనుకున్న ఆ ఉద్యోగులకు ఆ రాత్రి ఒక కాళరాత్రిగా మారుతుందని ఊహించలేదు. కుటుంబాలను పోషించుకోవడానికి.. కష్టపడి ఆఫీస్ లక్ష్యాలను చేరుకోవడానికి నిత్యం శ్రమిస్తున్న ఆ చేతులకు అకస్మాత్తుగా గులాబీ రంగు లేఖలు అందుకునే పరిస్థితి వచ్చింది. కేవలం ఐదు నిమిషాల నిడివి ఉన్న ఒక్క గూగుల్ మీట్ కాల్.. దాదాపు 80 కుటుంబాల వెలుగులను ఒక్కసారిగా ఆర్పివేసింది.

అమెరికాకు చెందిన ఒక ప్రముఖ ఫైనాన్షియల్ కంపెనీలో భారతదేశం నుంచి కస్టమర్ సర్వీస్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇటీవల ఎదురైన ఘోరమైన అనుభవమిది. "ఆపరేషనల్ కారణాల వల్ల ఈరోజు ఇంటి నుంచే పని చేయండి" అని కంపెనీ చెప్పినప్పుడు ఉద్యోగులు అది ఒక సాధారణ రోజు అనుకున్నారు. కానీ రాత్రి 9:30 గంటలకు అకస్మాత్తుగా ఒక మీటింగ్ ఆహ్వానం వచ్చింది. ఆ మీటింగ్‌లోకి వెళ్లిన ఐదు నిమిషాల్లోనే "ఇండియా టీమ్ మొత్తాన్ని తొలగిస్తున్నాం" అనే పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది.

సంస్థ కోసం పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు.. కనీసం ఆవేదన వ్యక్తం చేసే అవకాశం కూడా ఇవ్వకుండా మీటింగ్ ముగించారు. ‘పనితీరు సరిగా లేదు’ అని కంపెనీ నెపం తోసేసే ప్రయత్నం చేసినప్పటికీ నిత్యం ఒత్తిడితో సతమతమవుతూ సంస్థను నడిపించిన బాధితులు ఈ నెపాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. సంవత్సరం కంటే తక్కువ సర్వీస్ ఉన్న కొత్త ఉద్యోగులకు కనీస సెవెరెన్స్ పరిహారం కూడా ఇవ్వకుండా రోడ్డున పడేయడం కార్పొరేట్ ప్రపంచంలోని కనికరం లేని నైజానికి అద్దం పడుతోంది.

ఒక్క డిజిటల్ కాల్‌తో వందలాది మంది భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడం.. భారతదేశంలోని బీపీఓ, కస్టమర్ సర్వీస్ రంగాలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఉద్యోగ అభద్రతను తెలియజేస్తోంది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. కష్టపడే ఉద్యోగుల పట్ల కంపెనీలు చూపుతున్న ఈ రకమైన నిర్దాక్షిణ్య వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.