Begin typing your search above and press return to search.

మ్యాన్ పవర్.. భారత్ కు బిగ్గెస్ట్ అడ్వంటేజ్ కాబోతోందా?

తాజాగా జర్మనీకి సుమారు 90 వేల మంది ఉద్యోగులు అవసరమని, ఈ విషయంలో భారత్ సహకారం కోరుతున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.

By:  A.N.Kumar   |   31 Oct 2026 4:00 PM IST
మ్యాన్ పవర్.. భారత్ కు బిగ్గెస్ట్ అడ్వంటేజ్ కాబోతోందా?
X

ఒకప్పుడు ఉపాధి కోసం.. ఉన్నత జీవితం కోసం విదేశీ బాట పట్టిన భారతీయులను చూశాం. తమ దేశ సరిహద్దు దాటితేనే భవిష్యత్తు ఉందనే అభద్రతా భావాన్ని గమనించాం. కానీ కాలం చక్రం తిరిగింది. నేడు కాల గమనం మారడమే కాదు.. అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్ సమీకరణాలు కూడా పూర్తిగా రూపాంతరం చెందాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తులుగా విర్రవీగిన సమర్థవంతమైన దేశాలు కూడా ఇప్పుడు ఉపాధి కొరతతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. వారు నేడు ఆశగా చూస్తున్నది ఒక్క దేశం వైపే... అదే మన భారతావని..

తాజాగా జర్మనీకి సుమారు 90 వేల మంది ఉద్యోగులు అవసరమని, ఈ విషయంలో భారత్ సహకారం కోరుతున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశం కూడా మానవ వనరుల కోసం భారత్ వైపు చూడటం అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న మార్పులకు సంకేతంగా భావించవచ్చు. జర్మనీ వంటి సాంకేతిక దిగ్గజ దేశం సుమారు 90 వేల మంది ఉద్యోగుల కొరతను తీర్చడానికి భారతీయ యువత సహకారాన్ని బహిరంగంగా అభ్యర్థించడమంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇది కేవలం ఒక వార్త కాదు.. ప్రపంచానికి భారత మ్యాన్ పవర్ సాధించిన చారిత్రాత్మక విజయం. జపాన్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల వరకు.. ప్రతి చోటా భారతీయ నైపుణ్యానికి జైకొడుతున్నారు. ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నర్సింగ్, హెల్త్‌కేర్, ఇంజినీరింగ్, నిర్మాణ రంగాలు.. ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా మన శ్రామిక శక్తి లేనిదే గడియారం ముల్లు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది.

అనేక దేశాలు వృద్ధాప్య జనాభా భయంతో కుంగిపోతుంటే మన దేశం అత్యంత శక్తివంతమైన యువ జనాభాతో పొంగిపొర్లుతోంది. భారత్ వద్ద ఉన్న ఈ ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ ప్రపంచానికే ఒక మహా ప్రసాదంలా మారింది. లక్షలాది మంది యువతీ యువకులు నిరంతరం తమ కలలకు రెక్కలు తొడుగుతూ ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. వారికి సరైన అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు, విదేశీ భాషల శిక్షణ, నాణ్యమైన వృత్తి విద్య తోడైతే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఒక శోధించలేని మహా శక్తిగా అవతరిస్తుంది.

అయితే ఈ సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మన ముందున్న అసలైన సవాలు. విద్యా వ్యవస్థలో నైపుణ్యాభివృద్ధికి పీఠముడి వేయాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తూ విదేశీ ఉద్యోగాల పేరిట జరిగే మోసాలను అరికట్టి వలస కార్మికుల హక్కులను సంరక్షించుకోవాలి. మన యువత చెమట చుక్క విదేశీ మారకద్రవ్యంగా.. సాంకేతిక పరిజ్ఞానంగా మళ్లీ మన మాతృభూమికి తిరిగివచ్చి దేశ ఆర్థిక మూలాలను మరింత బలోపేతం చేయాలి.

ఒకప్పుడు అవకాశాల కోసం లోకమంతా వెతికిన మన యువత.. నేడు లోకానికే అవకాశాలు పంచే స్థాయికి ఎదిగింది. ఇది భారతీయుల కష్టానికి, పట్టుదలకు దక్కిన గొప్ప నిదర్శనం. జనాభాను నైపుణ్యంగా.. నైపుణ్యాన్ని ఉపాధిగా.. ఆ ఉపాధిని నవ భారత ఆర్థిక శక్తిగా మలిచే ఈ ప్రయాణంలో మనమందరం భాగస్వాములమవుదాం.. ప్రపంచానికి ఆధారం భారతేనని మరోసారి చాటిచెబుదాం..