Begin typing your search above and press return to search.

జర్మనీలో ఉద్యోగాలు.. భారత విద్యార్థుల రాత మారనుందా..?

ప్రపంచం మారుతోంది.., అవకాశాలు కొత్త రూపం దాలుస్తున్నాయి. అమెరికా తలుపులు కాస్త మూసుకుంటున్న వేళ, యూరప్‌లోని జర్మనీ మాత్రం భారతీయ యువతకు బంగారు తలుపులు తెరిచింది.

By:  Tupaki Political Desk   |   4 Dec 2025 6:00 PM IST
జర్మనీలో ఉద్యోగాలు.. భారత విద్యార్థుల రాత మారనుందా..?
X

ప్రపంచం మారుతోంది.., అవకాశాలు కొత్త రూపం దాలుస్తున్నాయి. అమెరికా తలుపులు కాస్త మూసుకుంటున్న వేళ, యూరప్‌లోని జర్మనీ మాత్రం భారతీయ యువతకు బంగారు తలుపులు తెరిచింది. నైపుణ్యం ఉన్నవారికి ఇది కేవలం ఉద్యోగం కాదు, భవిష్యత్తును మలిచే అవకాశం.

జర్మనీ ప్రస్తుతం ఒక విప్లవాత్మక మార్పు దశలో ఉంది. పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. ఇంజినీరింగ్, ఐటీ, ఆరోగ్య సంరక్షణ, గ్రీన్ ఎనర్జీ వంటి కీలక రంగాల్లో శ్రామిక శక్తి తగ్గిపోవడంతో, జర్మన్ ప్రభుత్వం తన ఇమ్మిగ్రేషన్ విధానాలను పూర్తిగా మారుస్తుంది. వీసా నిబంధనలను సులభతరం చేయడం, యూరోపియన్ యూనియన్ బ్లూ కార్డ్ కనీస జీతం అవసరాలను తగ్గించడం, కొత్తగా ఆపర్చునిటీ కార్డ్ ప్రవేశపెట్టడం వంటి చర్యలు ఈ మార్పులో భాగం చేయనున్నాయి.

ఆమెరికా ఆశలను జర్మనీ తీర్మబోతోందా?

ప్రస్తుతం అమెరికాలో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ, జర్మనీ ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా TU9 యూనివర్సిటీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్, పునరుత్పాదక శక్తి వంటి అత్యంత డిమాండ్ ఉన్న రంగాల్లో ప్రత్యేక కోర్సులను అందిస్తున్నాయి. మెకానికల్, ఆటోమోటివ్, ఎలక్ట్రికల్, మెకట్రానిక్స్, సివిల్ ఇంజినీరింగ్ వంటి విభాగాలు జర్మనీ పారిశ్రామిక భవిష్యత్తుకు వెన్నెముకగా నిలుస్తున్నాయి.

జర్మనీలో ప్రస్తుతం దాదాపు 6 లక్షల ఉద్యోగాలలో ఉద్యోగుల కొరత కనిపిస్తోంది. ఇది తాత్కాలికమైన కొరత కాదు, వృత్తిపరమైన నిర్మాణంలో జరుగుతున్న నిర్మాణాత్మక పరివర్తనకు సంకేతం. ముందస్తు ఉద్యోగ ఆఫర్ లేకుండానే విదేశీ నిపుణులు జర్మనీకి వచ్చి పని వెతుక్కోవడానికి అవకాశం కల్పించే ఆపర్చునిటీ కార్డ్, ఈ మార్పులో కీలక పాత్ర పోషిస్తోంది.

అగ్నశ్రేణి యూనివర్సిటీల ఆఫర్లు..

అదే సమయంలో అనేక అగ్రశ్రేణి జర్మన్ యూనివర్సిటీలు దాదాపు జీరో ట్యూషన్ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ఇది భారతీయ విద్యార్థులకు ఆర్థికంగా భారీ ప్రయోజనకరంగా మారింది. స్టెమ్ (STEM) రంగాల్లో శిక్షణ పొందిన యువతకు జర్మనీయే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ కెరీర్ మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ పరిణామం ఒక సాధారణ ఉద్యోగావకాశం కంటే ఎక్కువ. ఇది భారతీయ యువతకు గ్లోబల్ స్థాయిలో తమ ప్రతిభను నిరూపించుకునే వేదికగా మారబోతోంది. జర్మనీ తీసుకున్న ఈ సంస్కరణలు, భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, భారతీయుల కెరీర్ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నాయి.

అరుదైన అవకాశం..

భారతీయ యువతకు ఇది ఒక అరుదైన అవకాశం. నైపుణ్యం, కృషి, పట్టుదలతో ముందుకు సాగితే జర్మనీ మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం వారి ప్రతిభను గుర్తిస్తుంది. ఈ మార్పు కేవలం జర్మనీకి శ్రామిక శక్తి అందించడమే కాదు, భారతదేశానికి కూడా గ్లోబల్ స్థాయిలో ప్రతిష్టను తీసుకురానుంది. జర్మనీ తీసుకున్న ఈ నిర్ణయాలు కేవలం ఆర్థిక అవసరాలకే పరిమితం కావు. ఇది ఒక సామాజిక మార్పు కూడా. వలస వచ్చిన నైపుణ్యవంతుల ద్వారా జర్మన్ సమాజం మరింత వైవిధ్యభరితంగా, అంతర్జాతీయంగా మారనుంది. భారతీయ యువతకు ఇది ఒక ద్వంద్వ ప్రయోజనం – ఒకవైపు కెరీర్‌లో స్థిరత్వం, మరోవైపు ప్రపంచ స్థాయి అనుభవం.

బ్రెయిన్ డ్రెయిన్ కాబోతుందా?

భారతదేశం నుంచి వెళ్లే ప్రతిభావంతుల సంఖ్య పెరగడం వల్ల ‘బ్రెయిన్ డ్రెయిన్’ అనే ఆందోళన సహజమే. కానీ దీన్ని ఒక అవకాశంగా కూడా చూడవచ్చు. విదేశాల్లో ప్రతిభను నిరూపించిన యువత, భవిష్యత్తులో తిరిగి స్వదేశానికి వచ్చి తమ అనుభవాన్ని పంచుకుంటే, అది దేశ అభివృద్ధికి మరింత తోడ్పడుతుంది. జర్మనీ తెరిచిన ఈ తలుపులు, భారతీయ యువతకు గ్లోబల్ వేదికపై కొత్త అధ్యాయాన్ని రాయించే అవకాశం కల్పిస్తున్నాయి