Begin typing your search above and press return to search.

జెన్ జెడ్ ఇలా చేస్తున్నారా? 3 ఏళ్లలో 30 జాబులా?

నేటి యువత ధోరణి చూస్తుంటే.. వీరు ‘బ్రతకడానికి పని’ అనే సూత్రాన్ని నమ్ముతున్నట్టుగా కనిపిస్తోంది.

By:  A.N.Kumar   |   23 Dec 2025 8:00 PM IST
జెన్ జెడ్ ఇలా చేస్తున్నారా? 3 ఏళ్లలో 30 జాబులా?
X

జెన్ జెడ్ ఆలోచనా విధానం మునుపటి తరాల కంటే పూర్తిగా భిన్నంగా సాగుతోంది. ఒకే కంపెనీకి దశాబ్దాల పాటు అంకితమైపోవడం.. రిటైర్మెంట్ వరకూ అక్కడే కొనసాగడం అనే పాత పద్ధతులకు వీరు స్వస్తి పలుకుతున్నారు. 3 ఏళ్లలో 30 ఉద్యోగాలు చేసి అయినా సరే బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెంచుకొని భావి జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవాలని తపనతో అధిక సంపాదన వచ్చే మార్గాల వైపు పయనిస్తున్నారు. సెంటిమెంట్లకు అతీతంగా సంపాదన వైపు మరలుతున్నారు.

నేటి యువత ధోరణి చూస్తుంటే.. వీరు ‘బ్రతకడానికి పని’ అనే సూత్రాన్ని నమ్ముతున్నట్టుగా కనిపిస్తోంది. పాత తరంలాగా ‘పని కోసమే జీవితం’ అనే భావన వీరిలో అస్సలు లేదు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించి జీవితాన్ని త్వరగా సెటిల్ చేసుకోవాలనేది వీరి ప్రధాన ఉద్దేశం.

జీతం పెరగాలంటే మారాల్సిందే..

ఒకే కంపెనీలో ఏళ్లతరబడి ఉంటే వచ్చే వార్షిక ఇంక్రిమెంట్లు కేవలం 5 శాతం నుంచి 10 శాతం వరకూ పరిమితం అవుతున్నాయి. కానీ కంపెనీ మారితే ఏకంగా 30 శాతం నుంచి 50 శాతం వరకూ ప్యాకేజీ పెరుగుతోంది. అందుకే జెన్ జెడ్ యువత ‘జాబ్ హోపింగ్’ ను ఒక ఆయుధంగా వాడుతున్నారు. 30 వేల జీతం వచ్చే చోట సంతృప్తి చెందకుండా.. 50వేలు ఇచ్చే మరో సంస్థ వైపు వెంటనే అడుగులు వేస్తున్నారు.

9 టు 5 జాబ్ సంకెళ్ల నుంచి విముక్తి..

ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు ఆఫీసులో బందీలుగా ఉండటం, బాస్‌ల వేధింపులు భరించడం, టార్గెట్లు, సేల్స్ ఒత్తిడి వంటివి జెన్ జెడ్ భరించలేకపోతున్నారు. మానసిక ప్రశాంతతకు వీరు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే "పని ఉంటేనే మనం.. మనకోసమే పని" అనే ధోరణితో, నచ్చని చోట ఒక్క నిమిషం కూడా ఉండటానికి ఇష్టపడటం లేదు.

కోటి రూపాయల గోల్

చాలా మంది యువతీ యువకులు ఇప్పుడు ఫ్రీలాన్సింగ్, సైడ్ హజిల్స్, మల్టిపుల్ జాబ్స్ ద్వారా అతి తక్కువ కాలంలోనే కోటి రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ను లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్ వంటి రంగాల్లో ఉన్న వారు గ్లోబల్ క్లాయింట్స్ తో డాలర్లలోసంపాదిస్తున్నారు. 30 లేదా 35 ఏళ్లకే ఆర్థిక స్వాతంత్ర్యం పొంది ఆ తర్వాత ప్రపంచాన్ని చుట్టేయాలని.. ఇష్టమైన పనులు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

జెన్ జెడ్ చేస్తున్నది కరెక్టా?

ప్రస్తుత ద్రవ్యోల్బణం, పెరిగిన ఖర్చుల దృష్ట్యా కేవలం పాత కాలపు పద్ధతుల్లో పొదుపు చేస్తే కోటీశ్వరులు అవ్వడం కష్టమని వీరు భావిస్తున్నారు. అందుకే రిస్క్ తీసుకుంటున్నారు. ఈ విషయంలో మిగతా తరాల వారు వీరిని విమర్శించినా.. మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము అప్ గ్రేడ్ చేసుకుంటూ సంపాదన పెంచుకోవడంలో జెన్ జెడ్ సక్సెస్ అవుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఒక చోట ఉండి ఒత్తిడికి గురవ్వడం కంటే.. నైపుణ్యాన్ని నమ్ముకొని కొత్త అవకాశాల వైపు వెళ్లడం ఉత్తమమని ఈ తరం నిరూపిస్తోంది. వారి దృష్టిలో ఉద్యోగం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. అదే జీవితం కాదు..