Begin typing your search above and press return to search.

నలభై ఏళ్ళకే అవుట్...లైఫ్ ఎలా బాస్ !

జీవితం మరీ ఇంత చిన్న సైజ్ అయిపోతే ఎలా బాస్ అంటోంది ఉద్యోగ తరం. నలభై ఏళ్ళు ఒంటికి వస్తే చాలు ఇంటికి పంపిస్తున్నారు, ఇది ఎలా తట్టుకోవడం అని వాపోతోంది కార్పోరేట్ ఉద్యోగ వర్గం.

By:  Satya P   |   18 Sept 2026 9:28 AM IST
నలభై ఏళ్ళకే అవుట్...లైఫ్ ఎలా బాస్ !
X

జీవితం మరీ ఇంత చిన్న సైజ్ అయిపోతే ఎలా బాస్ అంటోంది ఉద్యోగ తరం. నలభై ఏళ్ళు ఒంటికి వస్తే చాలు ఇంటికి పంపిస్తున్నారు, ఇది ఎలా తట్టుకోవడం అని వాపోతోంది కార్పోరేట్ ఉద్యోగ వర్గం. దేశంలో కార్పోరేట్ సంస్థలలో పనిచేయడం ఆ మధ్య దాకా ఒక ఫ్యాషన్, ఒక హోదా, ఒక గర్వం. గౌరవం కూడా. ఆదాయంతో పాటు అన్ని రకాలుగా హంగులు ఉన్న జీవితం అది. కానీ ఒక్కసారిగా అవన్నీ కుప్ప కూలుతున్న నేపథ్యం ఉంది. అధిక జీతాలు అందుకుంటున్న వారి జీవితాలను అర్ధాంతరంగా కార్పోరేట్ సంస్థలు చిదిమేస్తున్నాయి. ఉన్న వారిని ఉన్నట్లుగా ఇంటికి తరిమేస్తున్నాయి. దాంతో నాలుగు పదుల వయసులో నడుం విరిగినట్లు అయి ఎటూ కాకుండా పోతున్నారు. కార్పోరేట్ భారతంలో ఉద్యోగుల వెతలూ కధలూ ప్రస్తుతం ఇలాగే ఉన్నాయని అంటున్నారు.

ఎక్కువ ఉంటే చెల్లు చీటీ :

ఎవరికి అయితే ఎక్కువ జీతాలు ఇస్తున్నారో వారిని ఏరి కోరి మరీ ఉద్వాసన పలుకుతున్నారు. చాలా కార్పోరేట్ రంగ సంస్థలలో ఇపుడు ఇది పెద్ద ఎత్తున సాగుతోంది. ఇలా అధికంగా జీతాలు తీసుకునే వారినే టార్గెట్ చేసి మరీ ఇంటికి పంపించే కార్యక్రమం అన్నది సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తున్నారు. దాంతో మేనేజర్ ర్యాంకులలో ఉన్న వారు కూడా మాజీలు అయిపోతున్నారు. వారి ప్లేస్ లో ఏఐ, ఆటోమేషన్ వైపుగా ఈ భారీ సంస్థలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో చూస్తే ఒరాకిల్ అడిడాస్ వంటి సంస్థలలో మధ్య వయసు ఉద్యోగుల తొలగింపు పెద్ద ఎత్తున సాగుతోంది అని అంటున్నారు.

కోతలతో వాతలు :

ఇపుడు దేశంలో కార్పోరేట్ సంస్థలు ఉద్యోగాల నియామకాలకు బదులుగా కోతలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. వారి లక్ష్యం అంతా నలభై ఏళ్ల నుంచి నలభై అయిదేళ్ళ మధ్య వయసు కలిగిన పెద్ద జీతాల ఉద్యోగులే అని అంటున్నారు. ప్రపంచంలో పేరు గడించిన కార్పొరేట్ సంస్థలు అన్నీ కూడా ఈ విధంగా ఉద్యోగాల కోతను ఒక అజెండాగా చేసుకుని అమలు చేయడంతో ఒక్కసరిగా నిరుద్యోగులు అయిపోతున్నారు. నిన్నటిదాకా బాస్ గా ఉన్న వారు ఈ రోజున గుడ్ బై చెప్పాల్సి వస్తోంది. అనుభవం ఎంత ఉంటేనేమి కార్పోరేట్ యాజమాన్యాలు తలచుకుంటే వారు ఉద్యోగం అవుట్ అవుతోంది.

నిర్వహణ భారం మీద :

అందుబాటులోకి ఏఐ ఆటోమేషన్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. దాంతో వాటిని ఉపయోగించుకుని ఎంత వీలు అయితే అంతగా నిర్వహణ వ్యయాన్ని ఆ పెను భారాన్ని తగ్గించుకోవాలని కార్పోరేట్ దిగ్గజ సంస్థలు వ్యూహ రచన చేస్తున్నాయి. దాంతో పెద్ద జీతగాళ్ళకు ఇది యమ గండంగా మారుతోంది. నాలుగు పదుల వయసు దాటగానే వారంతా కార్పోరేట్ సంస్థలలో మేనేజర్ గా ఇతర విభాగాలకు అధిపతులుగా కీలకమైన స్థానాలలో ఉంటారు. వారి జీతాలు కూడా ఆటోమేటిక్ గా ఎక్కువగానే ఉంటాయి. దాంతో వారినే టార్గెట్ చేస్తూ వరసబెట్టి ఇంటికి పంపించే కార్యక్రమం జరుగుతోంది అంటున్నారు. ఇక వీరు చేసే పనులను ఏఐకి ఆటోమేషన్ టూల్స్ కి అప్పగించడం జరుగుతోంది అని అంటున్నారు.

టెక్ రంగంలోనూ ఇంతే :

కేవలం కార్పోరేట్ రంగంలోనే కాదు టెక్ రంగంలోనూ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యోగాల కోతలు ఉంటున్నాయి. దాంతో ప్రతీ ఏడాదిలో ఒక్కో సంస్థ నుంచి కనీసంగా ఇరవై నుంచి పాతిక వేల మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురి అవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. భారత్ లో కూడా ఈ ఉద్యోగాల గండంతో తీవ్ర ప్రభావమే పడుతోంది అని అంటున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక టెక్ రంగంలో కేవలం 2026 సెప్టెంబర్ వరకూ చూస్తే మూడు వందలకు పైగా కంపెనీలలో పనిచేసే ఒక లక్షా ముప్పయి వేల మంది దాకా ఉద్యోగాలు పోయాయని లెక్క తేలింది. ఏఐ టెక్నాలజీని ఎక్కువగా విస్తరించుకుంటూ పోతూండడం వల్ల కార్పోరేట్ సెక్టార్ కానీ టెక్ రంగంలో కానీ చాలా ఉద్యోగాలకు పెద్దగా మానవ వనరుల అవసరం లేకుండా పోతోంది అని అంటున్నారు.

ఎటూ కాకుండా జీవితం :

నిజానికి ప్రతీ మనిషి జీవితంలో నడి వయసు చాలా కీలకం. ఎన్నో బాధ్యతలు ఆ ఏజ్ లోనే ఉంటాయి. అలాంటిది సడెన్ గా ఉద్యోగం బంద్ చేస్తే వారి పరిస్థితి ఏంటి అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఆర్ధికంగా తీవ్రంగా ఇబ్బందులే కాదు కుటుంబాలే సంక్షోభంలోకి నెట్టబడతాయని అంటున్నారు. అయితే ఉద్యోగాలు పదిలంగా కొంతకాలం అయినా ఉంచుకోవాలీ అనుకుంటే కొత్త రకం సాంకేతికతను ఎప్పటికపుడు నేర్చుకోవడం అలాగే తమను తాము నిరంతరం పదును పెట్టుకోవడం ద్వారానే సాధ్యమని ఉద్యోగ రంగానికి చెందిన నిపుణులు సూచిస్తున్నారు. సాంకేతికతను వినియోగించుకోరాదని కార్పోరేట్ సంస్థలకు ఎవరూ చెప్పలేరు, కాబట్టి మారాల్సింది ఉద్యోగస్థులే అని అంటున్నారు.