Begin typing your search above and press return to search.

గ్లోబల్ జాబ్ మార్కెట్ అలర్ట్… టెక్ కంపెనీల్లో వరుస లేఆఫ్స్!

ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు చేసేవారికి మళ్లీ కష్టకాలం మొదలైనట్లు కనిపిస్తోంది. ఖర్చులను కంట్రోల్ చేయడానికి పెద్ద టెక్ కంపెనీలు లేఆఫ్స్ వైపు మళ్లుతున్నాయి.

By:  Madhu Reddy   |   2 July 2026 6:00 PM IST
గ్లోబల్ జాబ్ మార్కెట్ అలర్ట్… టెక్ కంపెనీల్లో వరుస లేఆఫ్స్!
X

ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు చేసేవారికి మళ్లీ కష్టకాలం మొదలైనట్లు కనిపిస్తోంది. ఖర్చులను కంట్రోల్ చేయడానికి పెద్ద టెక్ కంపెనీలు లేఆఫ్స్ వైపు మళ్లుతున్నాయి. మొన్నటికి మొన్న మెటా సంస్థ వేలాది మందిని ఇంటికి పంపించగా, ఇప్పుడు మైక్రోసాఫ్ట్, టిక్‌టాక్ వంటి పెద్ద సంస్థలు కూడా భారీ లేఆఫ్స్‌కు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు హెచ్చరిస్తున్నాయి. ఈ పరిణామాలు గ్లోబల్ జాబ్ మార్కెట్‌లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

మైక్రోసాఫ్ట్‌లో 5 వేల మందికి పైగా ఉద్వాసన?:

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వచ్చే వారమే కొత్త రౌండ్ లేఆఫ్స్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కంపెనీలోని మొత్తం సిబ్బందిలో ఇది కేవలం రెండు శాతం కంటే తక్కువే అయినప్పటికీ, ఉద్యోగుల సంఖ్య పరంగా చూస్తే దాదాపు 5 వేల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక ముఖ్యంగా సేల్స్, కన్సల్టింగ్, ఎక్స్‌బాక్స్ గేమింగ్ విభాగాల్లో పనిచేసే వారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది.

టిక్‌టాక్ యూరోప్ ఆఫీసులోనూ కోతలు:

మరోవైపు పాపులర్ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ కూడా తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని చూస్తోంది. ఇక ఐర్లాండ్‌లోని డబ్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న తమ యూరోపియన్ మెయిన్ ఆఫీసులో సుమారు 300 మంది సిబ్బందిని తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కంపెనీ ఖర్చులను తగ్గించుకుని, కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా మార్చడమే లక్ష్యంగా టిక్‌టాక్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

సాధారణ విషయంగా మారిపోయిన లేఆఫ్స్:

ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ మరియు టెక్ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించడమంటే లైఫ్ సెటిల్ అయిపోయిందని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ అనేవి చాలా సాధారణమైన విషయంగా మారిపోయాయి. ప్రతి నెలా ఏదో ఒక దిగ్గజ సంస్థ వేలాది మంది ఉద్యోగులను అకస్మాత్తుగా తొలగిస్తూ షాక్‌లు ఇస్తోంది.

ఇప్పట్లో మారని పరిస్థితులు:

ఈ లేఆఫ్స్ పరంపర ఎప్పుడు ఆగుతుందా అని ఐటీ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే సమీప భవిష్యత్తులో ఈ జాబ్ మార్కెట్ పరిస్థితుల్లో పెద్దగా సానుకూల మార్పులు వచ్చే సూచనలు ఏవీ కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడానికి టెక్నాలజీని మారుస్తూ, మానవ వనరులను తగ్గించుకుంటున్నాయని విశ్లేషిస్తున్నారు.

గ్లోబల్ టెక్ రంగంలో సాగుతున్న ఈ వరుస లేఆఫ్స్ ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోకపోతే ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక ఈ సంక్షోభం నుండి టెక్ కంపెనీలు ఎప్పుడు కోలుకుంటాయో, జాబ్ మార్కెట్ మళ్లీ ఎప్పుడు మునుపటిలా కళకళలాడుతుందో వేచి చూడాలి..