Begin typing your search above and press return to search.

యాపిల్‌లో అరుదైన ఉద్యోగ కోతలు.. కానీ ట్విస్ట్ ఇదే

ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్ దిగ్గజాలలో ఒకటిగా పేరుగాంచిన యాపిల్, సాధారణంగా ఉద్యోగులను తొలగించని సంస్థగా ప్రసిద్ధి చెందింది.

By:  A.N.Kumar   |   25 Nov 2025 11:46 AM IST
యాపిల్‌లో అరుదైన ఉద్యోగ కోతలు.. కానీ ట్విస్ట్ ఇదే
X

ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్ దిగ్గజాలలో ఒకటిగా పేరుగాంచిన యాపిల్, సాధారణంగా ఉద్యోగులను తొలగించని సంస్థగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈసారి మాత్రం కంపెనీ తీసుకున్న అరుదైన నిర్ణయం ఉద్యోగుల్లో కలకలం రేపింది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన సేల్స్ విభాగంలో పునర్వ్యవస్థీకరణలో భాగంగా "డజన్ల సంఖ్యలో" ఉద్యోగాలను తగ్గించినట్లు వెల్లడైంది. అయితే ఉద్యోగాలు కోల్పోయిన వారు మిగతా విభాగాల్లో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ ఒక ఆఫర్ ఇచ్చింది.

* కీలకమైన సీనియర్ మేనేజర్లే టార్గెట్

ఈ ఉద్యోగ కోతలు ముఖ్యంగా బిజినెస్, ఎడ్యుకేషన్, గవర్నమెంట్ వంటి కీలక అకౌంట్‌లను నిర్వహించే సీనియర్ మేనేజర్లను ప్రభావితం చేశాయి. పెద్ద స్థాయి భాగస్వామ్యాలు, ముఖ్యమైన కార్పొరేట్ డీల్స్ పర్యవేక్షించే ఈ విభాగం యాపిల్ ఆదాయానికి చాలా కీలకమైనది. కంపెనీ ఈ చర్యలను "ఎఫిషెన్సీ పెంచే చర్యలు"గా పేర్కొన్నప్పటికీ, ఉద్యోగుల నుంచి మరో అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాపిల్ తన బాధ్యతలను మూడోపక్ష రిసెల్లర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మళ్లించే ప్రయత్నంగా కొందరు ఉద్యోగులు ఈ మార్పును చూస్తున్నారు. అమెరికా రక్షణ, న్యాయ విభాగాలతో పనిచేసిన యాపిల్ సేల్స్ బృందాలపై ఈ కోత ప్రభావం ఎక్కువగా ఉంది.

* ఇతర టెక్ దిగ్గజాలతో పోలిస్తే యాపిల్‌లో కోతలు చాలా అరుదు

గత రెండు సంవత్సరాలుగా, గూగుల్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు వేలల్లో, లక్షల్లో ఉద్యోగాలను తగ్గించాయి. కానీ యాపిల్ మాత్రం ఈ తరహా భారీ ఉద్యోగ కోతలకు దూరంగా ఉంది. యాపిల్‌లో సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం వలన, ఈ చిన్నపాటి కోతలు కూడా కంపెనీ లోపల పెద్ద చర్చకు, ఆందోళనకు దారితీస్తున్నాయి.

* ఆర్థికంగా యాపిల్ ఇంకా బలంగానే

ఉద్యోగ కోతల ఆందోళనల మధ్య కూడా యాపిల్ వ్యాపార ప్రగతి బలంగానే ఉందని విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ త్రైమాసికంలో దాదాపు $140 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదయ్యే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఐఫోన్ సేల్స్, ఐక్లౌడ్, ఆపిల్ మ్యూజిక్ వంటి సర్వీసులు ఈ ఆదాయంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

ముందు ఏముంది?

ఈ పునర్వ్యవస్థీకరణపై యాపిల్ కేవలం “ఆర్గనైజేషనల్ చేంజెస్” అనే ఒక్క మాటతో సరిపెట్టింది. దీంతో కంపెనీ లోపల ఉన్న ఉద్యోగులు, మార్కెట్ విశ్లేషకులు తదుపరి నెలల్లో మరింత పెద్ద మార్పులు, విస్తృతమైన కోతలు ఉంటాయేమోనని ఉత్కంఠగా గమనిస్తున్నారు. యాపిల్ భవిష్యత్తు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.