Begin typing your search above and press return to search.

అమెజాన్‌ లేఆఫ్‌ సునామీ మరోసారి టెక్‌ ప్రపంచాన్ని కుదిపేస్తోంది!

టెక్‌ ప్రపంచంలో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తూ, ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తన చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగ కోతకు సిద్ధమైంది.

By:  A.N.Kumar   |   28 Oct 2025 12:51 PM IST
అమెజాన్‌ లేఆఫ్‌ సునామీ మరోసారి టెక్‌ ప్రపంచాన్ని కుదిపేస్తోంది!
X

టెక్‌ ప్రపంచంలో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తూ, ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తన చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగ కోతకు సిద్ధమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈసారి కంపెనీ ఏకంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఇది గతంలో 2022లో నమోదైన 27,000 మంది తొలగింపుల రికార్డును బద్దలు కొట్టనుంది.

* భారీ తొలగింపుల వివరాలు: ఎప్పుడు, ఎక్కడ?

అధికారికంగా అమెజాన్‌ ఈ విషయంపై ప్రకటన చేయనప్పటికీ, కంపెనీ అంతర్గత వర్గాలు ఈ వారం మంగళవారం నుంచే ఉద్యోగుల తొలగింపులు ప్రారంభమవుతాయని వెల్లడించాయి. అమెరికా మీడియా నివేదికల ప్రకారం, ప్రభావిత బృందాల మేనేజర్లకు సోమవారం ప్రత్యేక శిక్షణ ఇవ్వగా, మంగళవారం ఉదయం నుండి ఉద్యోగులకు ఈమెయిల్‌ ద్వారా పింక్ స్లిప్‌లు పంపడం ప్రారంభం కానుంది.

ఈ ఉద్యోగ కోతలు ప్రధానంగా కింది విభాగాలపై ప్రభావం చూపనున్నాయి. హ్యూమన్‌ రిసోర్సెస్‌ , ఆపరేషన్స్‌, డివైసెస్‌ అండ్‌ సర్వీసెస్‌, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (AWS)లు ప్రభావానికి గురికానున్నాయి.

ప్రస్తుతం అమెజాన్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.55 మిలియన్ల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ తొలగింపులు కంపెనీలోని కార్పొరేట్‌ ఉద్యోగుల్లో దాదాపు 10% మందిని ప్రభావితం చేయనున్నాయి.

* AI ప్రభావం, కోవిడ్ అనంతర సమతుల్యత

ఈ భారీ లేఆఫ్‌ల వెనుక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ప్రభావం , సంస్థాగత సమతుల్యత పెంపు వంటి అంశాలు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. ఇటీవల అమెజాన్‌ సీఈఓ ఆండీ జెస్సీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కారణంగా ఉద్యోగ కోతలు తప్పవని సూచించారు. ఈ ప్రస్తుత లేఆఫ్‌లు కూడా ఆ వ్యూహంలో భాగమేనని నిపుణులు భావిస్తున్నారు.

అంతేకాకుండా కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ విపరీతంగా పెరగడంతో కంపెనీ భారీగా ఉద్యోగులను నియమించుకుంది. ప్రస్తుతం ఆ డిమాండ్‌ తగ్గడం, వ్యాపార సమతుల్యత సాధించడం కోసం ఆండీ జెస్సీ ఈ చర్యలు తీసుకుంటున్నారని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు, జెస్సీ మేనేజర్‌ల సంఖ్య తగ్గించే వ్యూహం కూడా అమలు చేస్తున్నారని సమాచారం. ఈ అనిశ్చిత నిర్ణయం లక్షలాది మంది ఉద్యోగులను ఉత్కంఠలో ఉంచింది.