16వేల మందికి ఒకేసారి లేఆఫ్.. అమెజాన్ పెను సంచలనం
అమెరికాలో ఉన్న ఉద్యోగులకు సంస్థలోనే మరో ఉద్యోగాన్ని వెతుక్కోవడానికి 90 రోజుల సమయం ఇస్తామని అమెజాన్ వెల్లడించింది.
By: A.N.Kumar | 29 Jan 2026 12:25 PM ISTప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ టెక్ ప్రపంచంలో మరోసారి ప్రకంపనలు సృష్టించింది. గత కొంతకాలంగా కొనసాగుతున్న లేఆఫ్స్ పరంపరలో భాగంగా తాజాగా 16,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మూడు నెలల వ్యవధిలోనే ఇది రెండో భారీ లేఆఫ్ కావడం గమనార్హం. ఈ నిర్ణయానికి సంబంధించిన సమాచారం ఇప్పటికే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల ద్వారా తొలగించబడిన ఉద్యోగులకు తెలియజేయబడింది. ముఖ్యంగా అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులకు కొంత వెసులుబాటు కల్పిస్తున్నట్లు అమెజాన్ స్పష్టం చేసింది. ఈ విషయంలో అమెజాన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ “ఈ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల సుమారు 16,000 ఉద్యోగాలు ప్రభావితమవుతాయి. ప్రభావితులైన ప్రతి ఒక్కరికి మేము పూర్తి మద్దతు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం” అని తెలిపింది.
ఏఐ, పునర్వ్యవస్థీకరణలే ప్రధాన కారణాలు
కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలను పేర్కొంది. ఏఐతో కృత్రిమ మేధ విస్తరణ వల్ల పనితీరును మెరుగుపరుచుకోవడం... కంపెనీ నిర్వహణ ఖర్చులను తగ్గించుకుని, నిర్మాణాన్ని సరళతరం చేయడం... వచ్చే మూడు నెలల్లో ఈ తొలగింపు ప్రక్రియ పూర్తి కానుందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గలెటీ అధికారికంగా వెల్లడించారు.
ఏ విభాగాలపై ప్రభావం ఎక్కువగా ఉంది?
ఈ రెండో విడత లేఆఫ్స్‌లో ప్రధానంగా కొన్ని విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏ.డబ్ల్యూఎస్), రిటైల్ విభాగం, ప్రైమ్ వీడియో, హ్యూమన్ రీసోర్సెస్ (హెచ్ఆర్) విభాగాలపై ప్రభావం పడనుంది.
అమెరికాలో ఉన్న ఉద్యోగులకు సంస్థలోనే మరో ఉద్యోగాన్ని వెతుక్కోవడానికి 90 రోజుల సమయం ఇస్తామని అమెజాన్ వెల్లడించింది. అయితే, ఈ గడువు దేశానుసారం స్థానిక చట్టాలు, నిబంధనల ఆధారంగా మారవచ్చని కూడా పేర్కొంది.
అంతేకాకుండా సంస్థలో కొత్త ఉద్యోగాన్ని పొందలేని వారు లేదా పొందాలనుకోని ఉద్యోగులకు అమెజాన్ ట్రాన్సిషన్ సపోర్ట్ అందించనుంది. ఇందులో సేవరెన్స్ ప్యాకేజీ, అవుట్‌ప్లేస్‌మెంట్ సేవలు, ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు ఉంటాయని కంపెనీ తెలిపింది.
వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సంస్థలోని లేయర్లు, బ్యూరోక్రసీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ వివరణ ఇచ్చింది. కోవిడ్ మహమ్మారి తరువాత ఒక గ్లోబల్ సంస్థ ఈ స్థాయిలో ఉద్యోగాల కోత విధించడం ఇదే అతిపెద్ద ఉదాహరణలలో ఒకటిగా నిలుస్తోంది.
టెక్ రంగంలో పెరుగుతున్న ఆందోళన
అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర టెక్ కంపెనీలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే దేశీయ దిగ్గజం టీసీఎస్ కూడా ఉద్యోగాల కోతపై సంకేతాలిచ్చింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, దేశాల మధ్య సుంకాల వివాదాలు.. ఆర్థిక అనిశ్చితి వల్ల కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఈ పరిణామాలు ఐటీ, టెక్ రంగ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. కరోనా తర్వాత పరిస్థితులు మారుతాయని ఆశించిన వారికి, ఈ 'లేఆఫ్స్' వార్తలు కోలుకోలేని దెబ్బగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో నెలకొన్న అనిశ్చితిని మరోసారి స్పష్టంగా చూపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
