2026 హెచ్చరిక: AI ముంచుకొస్తోంది.. ఈ 'వైట్ కాలర్' ఉద్యోగాల్లో మీరున్నారా?
సాంకేతిక ప్రపంచంలో ఒకప్పుడు కంప్యూటర్ల రాక ఎలాంటి సంచలనం సృష్టించిందో ఇప్పుడు ‘ఏఐ’ అంతకంటే వేగంగా ఉద్యోగ మార్కెట్ ను కమ్మేస్తోంది.
By: A.N.Kumar | 19 Dec 2025 1:00 AM ISTసాంకేతిక ప్రపంచంలో ఒకప్పుడు కంప్యూటర్ల రాక ఎలాంటి సంచలనం సృష్టించిందో ఇప్పుడు ‘ఏఐ’ అంతకంటే వేగంగా ఉద్యోగ మార్కెట్ ను కమ్మేస్తోంది. 2026 డిసెంబర్ నాటికి వైట్ కాలర్ ఉద్యోగాల స్వరూపం పూర్తిగా మారిపోనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం డిగ్రీ ఉంటే సరిపోదని.. ఏఐ నైపుణ్యం లేకపోతే మనుగడ కష్టమని మార్కెట్ విశ్లేషఖులు చెబుతున్నారు.
ఏయే రంగాలపై ఏఐ ప్రభావం ఉంటుంది.?
గంటల తరబడి మనుషులు చేసే పనిని ‘ఏఐ’ నిమిషాల్లోనే పూర్తి చేస్తోంది. ముఖ్యంగా కొన్ని రంగాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డేటా ఎంట్రీ రంగంలో ఆటోమేషన్ సాఫ్ట్ వేర్ లు మ్యాన్యువల్ ఎంట్రీ అవసరం లేకుండానే పనులను చక్కబెడుతున్నాయి. కస్టమర్ సర్వీస్ రంగంలో చాట్ బాట్స్, వాయిస్ బాట్స్ 24/7 అందుబాటులో ఉంటూ మానవ అవసరాన్ని తగ్గిస్తున్నాయి. ఇక అకౌంటింగ్, హెఆర్ ల విభాగంలో శాలరీ ప్రాసెసింగ్, ట్యాక్స్ రిపోర్ట్స్, రిక్రూట్ మెంట్ లో ఏఐ ఆధారిత టూల్స్ రాజ్యమేలుతున్నాయి. కంటెంట్ రైటింగ్, మార్కెటింగ్ లో సెకన్లలోనే స్క్రిప్ట్ లు, ఆర్టికల్స్ రాయడం.. టెలీ మార్కెటింగ్ లో ఏఐ ఏజెంట్లు మాట్లాడడం ఇప్పటికే మొదలైంది.
ఇది ముగింపు కాదు.. పరివర్తన
ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయనే భయం ఉన్నప్పటికీ అది పూర్తి సత్యం కాదు.. ఏఐ మనిషిని భర్తీ చేయదు. కానీ ఏఐ తెలిసిన మనిషి, ఏఐ తెలియని మనిషిని భర్తీ చేస్తాడు అన్నదే ప్రస్తుత వాస్తవం. కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి.. వేగంగా ఫలితాలు సాధించడానికి ఏఐని వాడుకునే వారికే పెద్దపీట వేస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా అప్ స్కిల్లింగ్ అవ్వకపోతే రేపటి పోటీలో వెనుకబడిపోవడం ఖాయం.
మనం ఏం చేయాలి?
భవిష్యత్తులో నిలదొక్కుకోవాలంటే ప్రతీ ఉద్యోగి పాటించాల్సిన మూడు సూత్రాలున్నాయి. మొదటిది.. ఏఐ టూల్స్ పై పట్టు సాధించాలి. మీ రంగానికి సంబంధించిన ఏఐ టూల్స్ అయిన చాట్ జీపీటీ, జెమిని, మిడ్ జర్నీ లేదా అకౌంటింగ్ సాఫ్ట్ వేర్స్ వాడటం నేర్చుకోండి..
ఇక రెండోది ప్రాంప్ట్ ఇంజినీరింగ్ : ఏఐ నుంచి సరైన అవుట్ పుట్ పొందడానికి ఎలా కమాండ్స్ ఇవ్వాలో నేర్చుకోవడం ఒక కీలక నైపుణ్యంగా మారింది. నిరంతరం అభ్యాసం దీనికి ఎంతో అవసరం. టెక్నాలజీ ప్రతీరోజూ మారుతోంది. మీ డొమైన్ నాలెడ్జ్ కు ఏఐని జోడించి కొత్త ఆవిష్కరణలు చేయండి.
2026 డిసెంబర్ అనేది ఒక గడువు కాదు. అది ఒక మేలుకొలుపు. మార్పును చూసి భయపడకుండా ఆ మార్పులో భాగస్వామ్యం అయితేనే కెరీర్ సురక్షితంగా ఉంటుంది. భవిష్యత్తు ఏఐది. కానీ ఆ ఏఐని నడిపించే తెలివైన మనిషిదే అసలైన విజయం..
