ఏఐ ఇంటర్వ్యూల మోసాలు : టెక్ దిగ్గజాలను కుదిపేస్తున్న కొత్త సవాళ్లు
ఒకవైపు ఇది ఉద్యోగ నియామక ప్రక్రియను సులభతరం చేస్తూ కంపెనీలకు ఉపయోగపడుతుంటే.., మరోవైపు అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ రిక్రూటర్లను మోసం చేసే పద్ధతులు పెరిగిపోతున్నాయి.
By: A.N.Kumar | 29 Aug 2025 12:00 AM ISTకృత్రిమ మేధ (AI) నేటి కాలంలో ఒక బలమైన ఆయుధం లాంటిది. ఒకవైపు ఇది ఉద్యోగ నియామక ప్రక్రియను సులభతరం చేస్తూ కంపెనీలకు ఉపయోగపడుతుంటే.., మరోవైపు అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ రిక్రూటర్లను మోసం చేసే పద్ధతులు పెరిగిపోతున్నాయి. వర్చువల్ ఇంటర్వ్యూలు, డీప్‌ఫేక్‌లు, వాయిస్ క్లోనింగ్, ఫేస్ స్వాపింగ్ వంటి టెక్నిక్‌లను ఉపయోగించి ఉద్యోగార్థులు రిక్రూటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ కొత్త సవాళ్లతో టెక్ దిగ్గజాలు అప్రమత్తమై, ముఖాముఖి ఇంటర్వ్యూల వైపు మళ్లుతున్నాయి.
- డీప్‌ఫేక్‌తో ఉద్యోగాలు ఎలా సాధిస్తున్నారు?
కొన్ని నెలల క్రితం పిన్‌డ్రాప్ సెక్యూరిటీ అనే వాయిస్ అథెంటికేషన్ సంస్థ ఒక వర్చువల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. రష్యన్ కోడర్ ఇవాన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. కానీ, అతడి మాటలు, ముఖ కవళికలకు మధ్య పొంతన లేకపోవడంతో రిక్రూటర్లకు అనుమానం కలిగింది. విచారణలో తెలిసింది ఏంటంటే.. అతను డీప్‌ఫేక్, జనరేటివ్ ఏఐ టూల్స్ సాయంతో ఈ స్కామ్ చేస్తున్నాడని. ఇలాంటి మోసాలు పెరుగుతున్నాయని ఆ సంస్థ సీఈవో విజయ్ బాల సుబ్రహ్మణ్యన్ బహిర్గతం చేశారు.
ఈ మోసాలు పెరుగుతున్నట్లు నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. నకిలీ ప్రొఫైల్స్, ఫేక్ రెఫరెన్స్‌లు, నకిలీ వర్క్ శాంపిల్స్‌తో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని వారు అంటున్నారు. గార్ట్‌నర్ అంచనాల ప్రకారం.. 2028 నాటికి ప్రతి నలుగురిలో ఒకరు నకిలీ ప్రొఫైల్‌తో ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఇంతేకాకుండా ఈ మార్గంలో కంపెనీలోకి ప్రవేశించిన వారు మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి డబ్బులు దొంగిలించే ప్రమాదం కూడా ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రిక్రూటర్ల ఆందోళన
సాఫ్ట్‌వేర్ ఫైండర్ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో రిక్రూటర్లు తమ ఆందోళనలను వెలిబుచ్చారు. 63% రిక్రూటర్లు ఏఐ ఆధారిత రెజ్యూమే మోసాలు పెరుగుతున్నాయని భావిస్తున్నారు. 37% రిక్రూటర్లు భవిష్యత్తులో వీడియో ఇంటర్వ్యూల మోసాలు ఒక పెద్ద సమస్యగా మారతాయని హెచ్చరిస్తున్నారు. ఏఐ జనరేటెడ్ ప్రొఫైల్స్ (51%), ఫేక్ రెఫరెన్స్‌లు (42%), నకిలీ క్రెడెన్షియల్స్ (39%), వాయిస్ క్లోనింగ్ (17%), ఫేస్ స్వాపింగ్ (15%) వంటి మోసాలు ఎక్కువగా బయటపడుతున్నాయి.
- పాత పద్ధతికి తిరుగు పయనం
కోవిడ్ సమయంలో పెరిగిన రిమోట్ రిక్రూట్‌మెంట్ విధానం ఇప్పుడు వెనక్కి వెళ్తోంది. గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు మళ్లీ ముఖాముఖి ఇంటర్వ్యూలను తిరిగి ప్రారంభిస్తున్నాయి. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఏఐ మోసాలు పెరుగుతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. సాఫ్ట్‌వేర్ ఫైండర్ పోల్‌లో 65% రిక్రూటర్లు ముఖాముఖి ఇంటర్వ్యూలకే మద్దతు తెలిపారు. అంతేకాకుండా అభ్యర్థుల నేపథ్య తనిఖీలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కొన్ని కంపెనీలు ఇప్పటికే డీప్‌ఫేక్‌లను గుర్తించే టూల్స్‌ను వాడడం మొదలుపెట్టాయి. అలాగే రిక్రూటర్లకు ఈ మోసాలను ఎలా గుర్తించాలో ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు.
ఏఐ సాంకేతికత మానవ జీవితంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నప్పటికీ, దాని దుర్వినియోగం వల్ల ఉద్యోగ నియామకాలలో మోసాలకు మార్గం సుగమం అవుతోంది. టెక్ కంపెనీలు కేవలం సాఫ్ట్‌వేర్‌పై ఆధారపడకుండా, అభ్యర్థిని ముఖాముఖిగా చూసే పద్ధతులను తిరిగి ప్రవేశపెట్టడం ఇప్పుడు అవశ్యకమైంది. భవిష్యత్తులో ఏఐ మోసాలను గుర్తించడానికి ప్రత్యేకంగా తయారు చేయబడిన సాంకేతికతలే రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో కీలక పాత్ర పోషించనున్నాయి.
