Begin typing your search above and press return to search.

సాఫ్ట్‌వేర్ 'డ్రీమ్ జాబ్' బుడగ పగిలిందా? మారిన టెక్ రియాలిటీలో గెలవడం ఎలా!

ఒకప్పుడు సాఫ్ట్ వేర్ రంగం అంటే కేవలం కొన్ని కోడింగ్ భాషలు నేర్చుకుంటే చాలు. భారీ ప్యాకేజీలతో సులభంగా సెటిల్ అయిపోవచ్చు అనే నమ్మకం ఉండేది.

By:  A.N.Kumar   |   23 Dec 2025 11:00 PM IST
సాఫ్ట్‌వేర్ డ్రీమ్ జాబ్ బుడగ పగిలిందా? మారిన టెక్ రియాలిటీలో గెలవడం ఎలా!
X

ముందుగ మురిస్తే పండుగ కాదంటారు. ఇప్పుడు సాఫ్ట్ వేర్ వాళ్లకు ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకూ సాఫ్ట్ వేర్ అంటే అదొక కలల ఇండస్ట్రీ. పిల్లనివ్వడానికి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసే మగాళ్లనే పట్టుబట్టి మరీ చేసుకునేవారు. అమెరికాలో ఉన్నాడంటే లక్షల కట్నం ఇచ్చి మరీ చేసేవారు. కానీ కాలం మారింది. ఏఐ, ఆటోమేషన్ ల రాకతో ‘సాఫ్ట్ వేర్ డ్రీమ్ జాబ్’ బుడగ పగిలిపోతోంది. మారిన టెక్ రియాలిటీలో గెలవడం ఇప్పుడు కానకష్టంగా మారింది. ఇప్పుడు ఇదే టెకీల ముందున్న అసలైన సవాల్.

ఒకప్పుడు సాఫ్ట్ వేర్ రంగం అంటే కేవలం కొన్ని కోడింగ్ భాషలు నేర్చుకుంటే చాలు. భారీ ప్యాకేజీలతో సులభంగా సెటిల్ అయిపోవచ్చు అనే నమ్మకం ఉండేది. కానీ నేడు ఆ ‘డ్రీమ్ జాబ్’ బుడగ పగిలిపోయింది. ఇప్పుడు కంపెనీలు కేవలం కోడర్లను వెతకడం లేదు. సమస్యలను పరిష్కరించే ‘స్మార్ట్ ఇంజినీర్ల’ కోసం చూస్తున్నాయి.

జనరలిస్ట్ రోజులు ముగిశాయి.. స్పెషలిస్ట్ కావాలి..

గతంలో నాకు జావా తెలుసు. కొంచెం ఫైథాన్ తెలుసు అంటే సరిపోయేది. కానీ ఇప్పుడు మార్కెట్ స్పెషలైజేషన్ కోరుతోంది. ఒక నిర్దిష్ట టెక్నాలజీ లో మాస్టర్ చేసి ఉండాలని అంటోంది. కేవలం కోడ్ రాయడం కాదు.. ఆ కోడ్ ద్వారా ఒక వ్యాపార సమస్యను ఎలా పరిష్కరిస్తున్నారనేది ముఖ్యం.

ఏఐ ఉద్యోగాలను తినేది కాదు.. వేగాన్ని పెంచేది..

ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్నది ఒక భయం మాత్రమే. వాస్తవం ఏంటంటే.. ఏఐ మీ అసిస్టెంట్ గా పనిచేస్తుంది. రిపీటేటివ్ కోడింగ్ పనులను ఏఐ వేగంగా చేస్తుంది. దీనివల్ల డెవలపర్ సమయం ఆదా అవుతుంది. ఏఐ కంటే మానవ మేధస్సు చాలా అవసరం ఎందుకంటే.. లాజిక్ డిజైన్ చేయడం.. సిస్టమ్ ఆర్కిటెక్చర్ రూపొందించడం.. సృజనాత్మక పరిష్కారాలు ఆలోచించడం ఏఐ వల్ల సాధ్యం కాదు.. ఇక్కడే మనుషుల అవసరం ఉంటుంది.

భాష కంటే తర్కం ముఖ్యం

ప్రాగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి కేవలం సాధనాలు మాత్రమే. ఈరోజు ఫైథాన్ ఉండొచ్చు. రేపు ఇంకొటి రావచ్చు. కానీ మీరు నేర్చుకోవాల్సింది ‘లాజికల్ థింకింగ్’. సమస్యను చిన్న చిన్న భాగాలుగా విభజించి దానికి పరిష్కారం ఆలోచించే విధానం అలవర్చుకోవాలి.

సర్టిఫికెట్లు కాదు.. యూనిక్ ప్రాజెక్ట్స్ కావాలి..

వందల సంఖ్యలో ఆన్ లైన్ సర్టిఫికెట్లు ఉండడం కంటే మీరు చేసిన ఒక్క యూనిక్ ప్రాజెక్ట్ మీ విలువను పెంచుతుంది. సమాజంలోని ఏదైనా ఒక సమస్యకు టెక్నాలజీ తో పరిష్కారం చూపండి.. మీ ప్రాజెక్ట్ లో ఏఐని ఎలా సమర్థవంతంగా వాడారో చూపించండి.. మీ పనితనం ప్రపంచానికి కనిపించేలా గిట్ హబ్ లలో కోడ్ ను మెయింటేయిన్ చేయండి.

మారితేనే ఫ్యూచర్ సేఫ్

సాఫ్ట్ వేర్ రంగం ముగిసిపోలేదు. కేవలం రూపాంతరం చెందింది. ఏఐని శత్రువుగా కాకుండా ఒక ఆయుధంగా మార్చుకున్న వారికే భవిష్యత్తు ఉంటుంది. సాఫ్ట్ వేర్ రంగంలో రాణించాలంటే నిరంతరం నేర్చుకోవడం తప్పనిసరి. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్త టెక్నాలజీలతో అడుగులు వేయాలి. లాజిక్ నేర్చుకోవాలి. స్కిల్ కు పదునుపెట్టాలి. రేపటి టెక్ ప్రపంచాన్ని ఇలానే శాసించాలి.