Begin typing your search above and press return to search.

ఉద్యోగాలున్నా ఫ్రెషర్స్ కి తప్పని తిప్పలు.. అసలేం జరుగుతోంది?

ప్రస్తుత రోజుల్లో చదువు పూర్తి చేసి కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకునే యువతకు మార్కెట్ పరిస్థితులు సవాలుగా మారుతున్నాయి.

By:  Madhu Reddy   |   6 May 2026 3:00 PM IST
ఉద్యోగాలున్నా ఫ్రెషర్స్ కి తప్పని తిప్పలు.. అసలేం జరుగుతోంది?
X

ప్రస్తుత రోజుల్లో చదువు పూర్తి చేసి కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకునే యువతకు మార్కెట్ పరిస్థితులు సవాలుగా మారుతున్నాయి. దేశంలో నియామకాలు జరుగుతున్నాయని కంపెనీలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ఫ్రెషర్లకు మాత్రం అవకాశాలు దక్కడం లేదు. 'అన్‌స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2026' ప్రకారం, సుమారు 84 శాతం మంది గ్రాడ్యుయేట్లు సరైన ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారు. డిగ్రీలు ఉన్నా కంపెనీలు వారిని ఎందుకు తీసుకోవడం లేదనేది ఇప్పుడు పెద్ద చర్చ గా మారింది . ఇక ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..

కంపెనీల చూపు 'టాప్' కాలేజీల పైనే:

దేశవ్యాప్తంగా 88 శాతం కంపెనీలు రిక్రూట్‌మెంట్ చేస్తున్నామని చెబుతున్న మాటల్లో కొంత చేదు నిజం దాగి ఉంది. ఈ కంపెనీలు కేవలం కొన్ని ఐఐటీలు లేదా పేరున్న ప్రైవేట్ యూనివర్సిటీలకే పరిమితమై క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయి. దీనివల్ల సాధారణ కాలేజీల్లో చదువుతూ, మంచి ప్రతిభ ఉన్నా సరే, మెజారిటీ విద్యార్థులకు కనీసం ఇంటర్వ్యూలో పాల్గొనే ఛాన్స్ కూడా రావడం లేదు అన్నది కొందరి వాదన.

నిరుద్యోగంలో బీటెక్, ఎంబీఏ టాప్:

ఒకప్పుడు ఇంజనీరింగ్ లేదా ఎంబీఏ చేస్తే లైఫ్ సెటిల్ అనుకునేవారు. కానీ ఇప్పుడు తాజా లెక్కలు భయాందోళన కలిగిస్తున్నాయి. బీటెక్ పూర్తి చేసిన ప్రతి 10 మందిలో ఎనిమిది మంది నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ఇక ఎంబీఏ పట్టభద్రుల పరిస్థితి మరీ ఘోరం, ప్రతి నలుగురిలో ముగ్గురికి ఉద్యోగం దొరకడం లేదు. ఈ గణాంకాలు చూస్తుంటే డిగ్రీలు కేవలం గోడల మీద సర్టిఫికేట్లకే పరిమితమవుతున్నాయా? అన్న అనుమానం కలుగుతోంది.

పెద్ద నగరాల కి ప్రాముఖ్యత:

ఇక చదువు అయ్యాక ఉద్యోగాల వేటలో ఫ్రెషర్లకు ఎదురవుతున్న మరో పెద్ద అడ్డంకి ప్రాంతీయ భేదాలు. కంపెనీలు పెద్ద నగరాల్లోని కాలేజీలకే ప్రాధాన్యత ఇస్తుండటంతో, గ్రామీణ లేదా చిన్న పట్టణాల్లోని టాలెంటెడ్ స్టూడెంట్స్ వెనుకబడిపోతున్నారు. అనుభవం లేకపోవడం ఒక సమస్య అయితే, అసలు తమ టాలెంట్‌ను నిరూపించుకునే ప్లాటుఫామ్ దొరకకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణంగా మారుతోంది.

స్కిల్స్ గ్యాప్ :

ఇక అసలు సమస్య ఇక్కడే వుంది. కంపెనీలు ఫ్రెషర్లను దూరం పెట్టడానికి ప్రధాన కారణం నైపుణ్యం లేకపోవడమే అని రిపోర్ట్ చెబుతోంది. మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా కాలేజీ పాఠ్యాంశాలు ఉండటం లేదు. సాఫ్ట్ స్కిల్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని విద్యార్థులను తీసుకుని శిక్షణ ఇచ్చేందుకు కొన్ని కంపెనీలు సిద్ధంగా లేవు. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక, కొంచెం ఎక్కువ జీతమైనా సరే అనుభవం ఉన్న వారినే తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పుడు కొత్త వారిని చేర్చు కొని వాళ్ళకి స్కిల్స్ తో సహా నేర్పించాలి అంటే టైం ఎక్కువ పడుతుంది కనుక కంపెనీలు కొత్త వారి కంటే బెటర్ గా వున్నా వాళ్ళను చూస్తున్నారు.

ఇక ఈ 84 శాతం నిరుద్యోగిత దేశ ఆర్థిక వ్యవస్థకే ముప్పు. యువతలో పెరుగుతున్న నిరాశను పోగొట్టాలంటే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రావాలి. కేవలం బట్టి పట్టి థియరీ చదువులకే పరిమితం కాకుండా, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దాలి. ప్రభుత్వం కూడా చిన్న చిన్న కాలేజీల్లో సైతం ఉద్యోగ మేళాలు జరిగేలా ఇంకా ఎక్కువ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నది నిపుణుల మాట.

ఇక విద్యార్థులు కూడా కేవలం డిగ్రీ మీద ఆధారపడకుండా, కాలంతో పాటు మారుతూ కొత్త స్కిల్స్ నేర్చుకుంటేనే ఈ కఠినమైన జాబ్ మార్కెట్‌లో నిలబడగలరు. నేర్చుకోవడమే ఇప్పుడున్న ఏకైక ఆయుధం అంటున్నారు విద్యావంతులు.