ఐటీ రంగంలో ఏఐ ప్రకంపనలు: 20 లక్షల ఉద్యోగాలకు గండం.. భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి?
గత రెండు దశాబ్దాలుగా భారతదేశ ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా నిలుస్తూ లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తున్న ఐటీ రంగం ప్రస్తుతం ఒక సంధి దశలో ఉంది.
By: A.N.Kumar | 13 March 2026 3:00 PM ISTనిన్నటి వరకు తమ కోడింగ్‌తో ప్రపంచాన్ని శాసించిన చేతులు.. రేపటి ఉదయానికి నిరుద్యోగపు అభద్రతతో వణికిపోతున్నాయా? ఎంతో కష్టపడి సంపాదించిన డిగ్రీలు, కళ్లు కాయలు కాసేలా చేసిన రాత్రుల కష్టం.. కేవలం కొన్ని సెకన్ల ఆటోమేషన్ కోడ్ ముందు అర్థాంతరంగా కరిగిపోతున్నాయా? భారత ఐటీ రంగంలో ఆశావహ దృక్పథంతో అడుగుపెట్టిన లక్షలాది మంది యువత కలల సౌధాలు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త అలల తాకిడికి కూలిపోతున్నాయా? అంటే భవిష్యత్తులో ఔను అనే సమాధానమే వినిపిస్తోంది.
గత రెండు దశాబ్దాలుగా భారతదేశ ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా నిలుస్తూ లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తున్న ఐటీ రంగం ప్రస్తుతం ఒక సంధి దశలో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనూహ్య వృద్ధి.. దాని అనుబంధ సాంకేతికతలు ఐటీ రంగంలో సమూల మార్పులకు దారితీస్తున్నాయి. అయితే ఈ మార్పులు కేవలం సాంకేతిక పురోగతికి మాత్రమే పరిమితం కాకుండా ఉద్యోగ భద్రతపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. తాజా గణాంకాలు.. నివేదికల ప్రకారం.. రాబోయే ఐదేళ్లలో ఐటీ రంగంలో భారీ స్థాయిలో ఉద్యోగాల కోత తప్పదని హెచ్చరికలు వస్తున్నాయి.
అంచనాలు ఏమంటున్నాయి?
నీతి ఆయోగ్ వంటి సంస్థలు, పరిశ్రమ నిపుణుల విశ్లేషణల ప్రకారం.. వచ్చే ఐదేళ్ల కాలంలో భారత ఐటీ రంగంలో సుమారు 15 నుంచి 20 లక్షల వరకు ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో సుమారు 75 లక్షల మంది ఐటీ నిపుణులు పనిచేస్తుండగా.. ఏఐ ఆధారిత ఆటోమేషన్ జోరు ఇలాగే కొనసాగితే 2031 నాటికి ఈ సంఖ్య 60 లక్షలకు లేదా అంతకంటే తక్కువకు పడిపోయే ప్రమాదం ఉందని అంచనా. అంటే ప్రతి నలుగురు ఐటీ ఉద్యోగులలో ఒకరు తమ ఉపాధిని కోల్పోయే దుస్థితి రావచ్చు.
కోతకు కారణాలేమిటి?
పెద్ద ఐటీ దిగ్గజాలు తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి.. ఖర్చులను తగ్గించుకోవడానికి ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ వైపు మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా గతంలో మానవ ప్రమేయం ఎక్కువగా అవసరమైన కోడింగ్, బగ్ ఫిక్సింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ క్షణాల్లో పూర్తి చేస్తున్నాయి. రోటీన్ పనులు చేసే ఎంట్రీ లెవల్ ఉద్యోగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. కంపెనీలు భారీగా ఫ్రెషర్లను నియమించుకునే సంప్రదాయాన్ని పక్కనపెట్టి ఏఐ సాఫ్ట్‌వేర్ల వైపు మళ్లుతున్నాయి. డేటా ప్రాసెసింగ్.. విశ్లేషణలో మానవ తప్పులను తగ్గించి అత్యంత వేగంగా ఫలితాలను ఇచ్చే ఏఐ సిస్టమ్స్ వల్ల ఈ విభాగంలోనూ ఉద్యోగ అవకాశాలు కుంచించుకుపోతున్నాయి.
ఉపాధి అవకాశాలు పూర్తిగా అంతమైపోతాయా?
ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గుతాయన్న భయం ఒకవైపు ఉన్నా.. మరోవైపు కొత్త రకమైన ఉపాధి అవకాశాలు కూడా పుట్టుకొస్తాయని నిపుణులు భరోసా ఇస్తున్నారు. కేవలం సాంప్రదాయ పద్ధతులకు పరిమితం కాకుండా ఏఐ డెవలప్‌మెంట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో నైపుణ్యాలను పెంపొందించుకుంటే భవిష్యత్తులోనూ అవకాశాలకు కొదువ ఉండదు.
మార్పే ఏకైక మార్గం
పరిశ్రమలో వస్తున్న ఈ భారీ మార్పులను ఎదుర్కోవడానికి ఉద్యోగులు తమను తాము 'అప్‌స్కిల్లింగ్' చేసుకోవడం తప్పనిసరి. కేవలం కోడింగ్ తెలిసి ఉండటమే సరిపోదు. ఏఐని ఒక సాధనంగా ఉపయోగించుకుంటూ సృజనాత్మకత, వ్యూహాత్మక ఆలోచనలతో కూడిన పనితీరును అలవర్చుకోవాలి. ఐటీ రంగంలో ఈ ఉద్యోగ సంక్షోభాన్ని అధిగమించాలంటే విద్యాసంస్థలు, ప్రభుత్వం, ఐటీ కంపెనీలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. నిరంతర అభ్యాసం, కొత్త సాంకేతికతల అడాప్షన్ మాత్రమే రాబోయే కాలంలో ఉద్యోగ నిలదొక్కుకోవడానికి ఏకైక మార్గం.
