Begin typing your search above and press return to search.

ఒకప్పుడు కలల సౌధం.. నేడు బంగారు పంజరం.. సాఫ్ట్‌వేర్ రంగానికి గుడ్‌బై చెబుతున్న 72% టెకీల ఆవేదన ఇదే..

బ్లైండ్ నిర్వహించిన సర్వేలో 72 శాతం మంది భారతీయ టెకీలు ఐటీ రంగాన్ని వదిలేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. 30 శాతం మంది ఆర్థిక ఇబ్బందులు లేకపోతే ఉద్యోగం మానేస్తామని, 42 శాతం మంది అదే జీతం వస్తే మరో రంగానికి మారతామని తెలిపారు. 56 శాతం మంది తమ పిల్లలను సాఫ్ట్‌వేర్ రంగంలోకి పంపేందుకు ఇష్టపడటం లేదని సర్వే పేర్కొంది.

By:  A.N.Kumar   |   27 Nov 2026 7:57 AM IST
ఒకప్పుడు కలల సౌధం.. నేడు బంగారు పంజరం.. సాఫ్ట్‌వేర్ రంగానికి గుడ్‌బై చెబుతున్న 72% టెకీల ఆవేదన ఇదే..
X

ఒకప్పుడు ఇంజినీరింగ్ కళాశాలలో అడుగుపెట్టిన ప్రతి విద్యార్థి కళ్లలో ఒకే ఒక కల మెదిలేది.. అది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం... క్యాంపస్ ఇంటర్వ్యూలో ఒక పెద్ద ఐటీ కంపెనీ ఆఫర్ లెటర్ చేతికి రాగానే.. ఇక జీవితం పూలబాటే అని సంబరపడేవారు... లక్షల్లో జీతాలు.. విదేశీ ప్రయాణాలు.. కార్పొరేట్ మెరుపులు చూసి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఐటీ వైపు పరుగులు పెట్టించారు. కానీ కాలం మారింది.. తెర వెనుక దాగి ఉన్న అసలు నిజం ఇప్పుడు బయటపడుతోంది. ఒకప్పుడు ఏ ఉద్యోగం కోసం యువత పరితపించిందో.. నేడు అదే రంగాన్ని వదిలేయడానికి ఏకంగా 72 శాతం మంది భారతీయ టెకీలు సిద్ధంగా ఉన్నారనే వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది.

బయటి ప్రపంచానికి ఏసీ గదులు.. ఖరీదైన లైఫ్‌స్టైల్ కనిపిస్తున్నా.. లోపల మాత్రం టెకీలు నిత్యం ఒక నిశ్శబ్ద యుద్ధం చేస్తున్నారు. ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ వేదిక ‘బ్లైండ్’ భారత్‌లోని 2,958 మంది టెక్ ఉద్యోగులపై నిర్వహించిన సర్వేలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 30 శాతం మంది ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకపోతే ఈ క్షణమే ఐటీ రంగాన్ని వదిలేస్తామని తేల్చిచెప్పారు. 42 శాతం మంది ఇదే జీతం వేరే రంగంలో వస్తే మారిపోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కేవలం 13 శాతం మంది మాత్రమే తాము చేస్తున్న పనితో సంతోషంగా ఉన్నామని పేర్కొన్నారు. నిరంతర పని ఒత్తిడి, అంతులేని డెడ్‌లైన్లు, రాత్రింబవళ్లు స్క్రీన్లకు అతుక్కుపోవడం వల్ల వ్యక్తిగత జీవితం పూర్తిగా కనుమరుగైపోతోంది. డబ్బు సంపాదిస్తున్నామన్న తృప్తి కంటే జీవితాన్ని కోల్పోతున్నామన్న ఆవేదనే వారిలో ఎక్కువగా కనిపిస్తోంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాక టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఒకప్పుడు పదుల సంఖ్యలో ఇంజినీర్లు నెలల తరబడి చేసే కోడింగ్.. టెస్టింగ్ పనులను నేడు ఏఐ టూల్స్ నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి. దీంతో రేపు తమ ఉద్యోగం ఉంటుందో లేదో అన్న భయం ప్రతి టెకీని వెంటాడుతోంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోకపోతే ఎప్పుడు ఏ పింక్ స్లిప్ చేతికి వస్తుందో తెలియని అభద్రతా భావం వారిని మానసికంగా కుంగదీస్తోంది.

ఈ సర్వేలో అత్యంత భావోద్వేగానికి గురిచేసే అంశం మరొకటి ఉంది. ఐటీలో పనిచేస్తున్న 56 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలను భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ రంగంలోకి పంపించకూడదని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేస్తున్న వారిలో ఈ అభిప్రాయం మరింత బలంగా ఉంది. తాము అనుభవిస్తున్న ఒత్తిడిని తమ బిడ్డలు పడకూడదని వారు కోరుకుంటున్నారు. నేటి యువతకు ఏ రంగం ఉత్తమమని అడిగితే.. 34 శాతం మంది వైద్య వృత్తిని సూచించగా.. కేవలం 4 శాతం మంది మాత్రమే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ వైపు మొగ్గు చూపడం గమనార్హం.

టెకీలు సాఫ్ట్‌వేర్ రంగాన్ని ద్వేషించడం లేదు.. వారు ద్వేషిస్తున్నది కేవలం టాక్సిక్ వర్క్ కల్చర్ ను మాత్రమే. టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చవచ్చు.. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించవచ్చు. కానీ ఆ టెక్నాలజీని నడిపించే మనిషి మనసు విరిగిపోతే ఆ ప్రగతికి అర్థం ఏముంటుంది? కంపెనీలు ఇకనైనా ఉద్యోగులను కేవలం యంత్రాలుగా కాకుండా భావోద్వేగాలు ఉన్న మనుషులుగా చూస్తూ వారికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్.. ఉద్యోగ భద్రత కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ రంగం ప్రతిభావంతులను కోల్పోయే ప్రమాదం ఉంది..