Begin typing your search above and press return to search.

40 ఏళ్లకే రిటైర్మెంట్.. ఇది హెచ్చరికా? వాస్తవమా?

ఒకప్పుడు ఉద్యోగమంటే జీవితాంతం తోడుండే నీడ. 60 ఏళ్ల రిటైర్మెంట్ అనేది ఒక నిశ్చింత దశ. కానీ నేడు కాలం శరవేగంగా మారుతోంది.

By:  A.N.Kumar   |   10 Feb 2026 8:00 AM IST
40 ఏళ్లకే రిటైర్మెంట్.. ఇది హెచ్చరికా? వాస్తవమా?
X

ఒకప్పుడు ఉద్యోగమంటే జీవితాంతం తోడుండే నీడ. 60 ఏళ్ల రిటైర్మెంట్ అనేది ఒక నిశ్చింత దశ. కానీ నేడు కాలం శరవేగంగా మారుతోంది. ప్రైవేట్ రంగంలో '40 ఏళ్లు' అనేది ఇప్పుడు కేవలం ఒక వయసు మాత్రమే కాదు.. అది కెరీర్ మలుపు తిరిగే ఒక క్లిష్టమైన అంకం. మారుతున్న సాంకేతికత, ప్రపంచీకరణ ధోరణుల మధ్య నాడు నమ్మిన 'అనుభవం' కంటే నేడు 'నైపుణ్యం' మాత్రమే ప్రామాణికంగా మారుతోంది.

అనుభవం వర్సెస్ అవసరం

నేటి కార్పొరేట్ ప్రపంచం భావోద్వేగాలకు తావులేని ఒక లాభనష్టాల లెక్క. దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ ఉద్యోగి కంటే తక్కువ వేతనానికి పని చేస్తూ సాంకేతికతపై పట్టున్న యువత వైపు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఇది అన్యాయంగా అనిపించినా మార్కెట్ శైలి ఇదే. 'కాస్ట్ కటింగ్' పేరుతో ఒక ఇమెయిల్‌తో సంవత్సరాల బంధాన్ని తెంచుకుంటున్న తీరు... ఉద్యోగ భద్రత అనేది ఒక గాలిలో దీపం అని స్పష్టం చేస్తోంది.

నిరంతర అభ్యాసమే శ్రీరామరక్ష

ఒకప్పుడు ఒకే నైపుణ్యంతో దశాబ్దాలు గడిపేయవచ్చు అనే ధీమా ఉండేది. కానీ నేటి టెక్నాలజీ ప్రతి ఆరు నెలలకోసారి అప్‌డేట్ అవుతోంది. మారిన టెక్నాలజీని అందిపుచ్చుకోని వారు కాలగర్భంలో కలిసిపోక తప్పదు. మనం నేర్చుకోవడం ఆపేసిన రోజే మన కెరీర్ ముగింపు మొదలైనట్టు.. అందుకే ప్రైవేట్ రంగంలో ఉన్నవారు తాము చేస్తున్న పనిలో లోతైన జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా కొత్త పోకడలను ఎప్పటికప్పుడు ఒంటబట్టించుకోవాలి.

ఆర్థిక క్రమశిక్షణ: రెండో ఆయుధం

ఉద్యోగంలో అనిశ్చితి ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేది మనం చేసిన పొదుపు మాత్రమే. ఈ కాలపు తరం ఆదాయం రాకముందే ఈఎంఐలతో ఖర్చులను ప్లాన్ చేసుకుంటోంది. విలాసాల కోసం చేసే అనవసరపు ఖర్చులు, ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వల్ల ఉద్యోగంలో చిన్న ఆటుపోటు వచ్చినా అది కుటుంబంపై పెద్ద సంక్షోభాన్ని కలిగిస్తోంది. నిజమైన ధనికత్వం ప్రదర్శనలో ఉండదు.. క్రమశిక్షణతో కూడిన పొదుపులో ఉంటుంది.

40 ఏళ్లకే రిటైర్మెంట్ అనేది భయం కాదు.. అది ఒక వాస్తవికత. అయితే దీనిని ముగింపుగా కాకుండా ఒక కొత్త ప్రారంభంగా మార్చుకోవాలి. నిరంతర అభ్యాసం, కాలానికి అనుగుణంగా మారే మనస్తత్వం.. పక్కాగా ఉన్న ఆర్థిక ప్రణాళిక... ఈ మూడూ ఉంటే 40 కాదు కదా 60 ఏళ్లయినా మార్కెట్‌లో మీ విలువ తగ్గదు. ప్రపంచం మారుతోంది, మార్పును ఆహ్వానించిన వాడే విజేతగా నిలుస్తాడు.