Begin typing your search above and press return to search.

రష్యాలో మరో మహమ్మారి.. డేంజర్ లో 200 మంది? ప్రపంచానికి భయం

రాత్రికి రాత్రే ఊపిరితిత్తులను ద్రవంగా మార్చేసే ఘోరమైన బ్యాక్టీరియా ల్యాబ్ గాజు పాత్రను ఛేదించుకుని బయటపడిందా...

By:  A.N.Kumar   |   5 Oct 2026 10:04 AM IST
రష్యాలో మరో మహమ్మారి.. డేంజర్ లో 200 మంది? ప్రపంచానికి భయం
X

రాత్రికి రాత్రే ఊపిరితిత్తులను ద్రవంగా మార్చేసే ఘోరమైన బ్యాక్టీరియా ల్యాబ్ గాజు పాత్రను ఛేదించుకుని బయటపడిందా... లేక ఒక అగ్రరాజ్యం తన రహస్య ల్యాబ్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అబద్ధాల పొగచూరుతో ప్రపంచాన్ని ముంచెత్తుతోందా? సైబీరియాలోని ఆ గడ్డకట్టే ప్రాంతంలో ప్లేగ్ నీడలు కమ్ముతుంటే 200 మంది ప్రాణాలు క్షణక్షణానికీ కత్తిమీద సాములా మారుతున్నాయి.

సైబీరియాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక విషాదకర సంఘటన ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర తీవ్ర కలకలం రేపుతోంది. అక్కడి ప్రతిష్టాత్మక యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న 28 ఏళ్ల టెక్నీషియన్ దార్య షిపిలోవా అనుమానాస్పద స్థితిలో మరణించడమే ఇందుకు కారణం. ఆమె ప్లేగ్ వ్యాప్తికి కారణమయ్యే బ్యాక్టీరియాతోనే ప్రాణాలు కోల్పోయిందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ల్యాబ్‌లో ప్రమాదం జరిగిందా?

అంతర్జాతీయ మీడియా, పలు స్వతంత్ర నివేదికల ప్రకారం.. సెప్టెంబర్ 25న ఇర్కుట్స్క్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో షిపిలోవా పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ ప్లేగ్ వ్యాధిని కలిగించే 'యెర్సినియా పెస్టిస్' బ్యాక్టీరియా కలిగిన ఒక టెస్ట్ ట్యూబ్ కిందపడి పగిలిపోయింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సెప్టెంబర్ 29 నాటికి పరిస్థితి తీవ్రమై శ్వాసకోశ సమస్యలతో షెలెఖోవ్‌లోని ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వేగంగా విస్తరించడంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ అక్టోబర్ 1-2 మధ్య ఆమె మరణించినట్లు తెలుస్తోంది.

200 మంది వైద్యుల పర్యవేక్షణలో..

షిపిలోవా మృతి చెందిన వార్త బయటకు రావడంతో స్థానిక యంత్రాంగం వేగంగా స్పందించింది. ఆమెతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న దాదాపు 197 మందిని అధికారులు గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇర్కుట్స్క్, షెలెఖోవ్ ప్రాంతాల్లోని పలు ఆసుపత్రుల్లో ప్రత్యేక క్వారంటైన్ వార్డులను ఏర్పాటు చేసి వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం పర్యవేక్షణలో ఉన్న వారెవరికీ ప్లేగ్ లక్షణాలు కనిపించలేదని, ప్రాథమిక పరీక్షల్లో నెగెటివ్ ఫలితాలు వచ్చాయని అధికారులు ఊరటనిచ్చే విషయాన్ని వెల్లడించారు.

రష్యా రెస్పాన్స్.. 'ప్లేగ్ కాదు.. న్యూమోనియా'

ఈ వార్తలపై రష్యా ప్రజారోగ్య పర్యవేక్షణ సంస్థ 'రోస్పోట్రీబ్నాండజర్' భిన్నంగా స్పందించింది. షిపిలోవా మరణానికి ప్లేగ్ కారణం కాదని.. ఆమె "గుర్తుతెలియని కారణంతో వచ్చిన తీవ్రమైన న్యూమోనియా"తో మరణించిందని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆమె శరీర నమూనాలను పరిశీలించగా ల్యాబ్‌లోని ప్రమాదకర బ్యాక్టీరియా ఆధారాలు ఏవీ లభించలేదని రష్యా అధికారులు కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ప్రజారోగ్య పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని వెల్లడించారు.

న్యూమోనిక్ ప్లేగ్ ఎందుకు భయంకరం?

సాధారణంగా ప్లేగ్ సోకిన జంతువులు లేదా వాటిపై ఉండే ఈగల కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. అయితే ఊపిరితిత్తులకు సోకే 'న్యూమోనిక్ ప్లేగ్' చాలా ప్రమాదకరమైనది. ఇది సోకిన వ్యక్తి తుమ్మినా దగ్గినా గాలిలోని శ్వాసకోశ బిందువుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాపిస్తుంది. ప్రారంభంలోనే గుర్తించి యాంటీబయాటిక్స్ అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ల్యాబ్‌లో టెస్ట్ ట్యూబ్ పగలడం.. ఆ వెంటనే ఉద్యోగిని తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో మృతి చెందడం.. 200 మందిని క్వారంటైన్ చేయడం వంటి పరిణామాలు అనుమానాలకు తావిస్తున్నాయి. అయితే రష్యా అధికారిక ప్రకటనలకు, బయటకు వస్తున్న కథనాలకు మధ్య వ్యత్యాసాలు ఉండటంతో అసలు ఏం జరిగిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అక్కడ భారీ స్థాయిలో మహమ్మారి వ్యాపించినట్లు ఆధారాలు లేవు.