4000KM దూరం నుంచే సర్జరీ… 90 నిమిషాల్లోనే పూర్తి? అసలు విషయం తెలిస్తే షాక్!
సాధారణంగా మేజర్ ఆపరేషన్ అంటే డాక్టర్లు పేషెంట్ పక్కనే ఉండి, ఎంతో జాగ్రత్తగా చేయాలి.
By: Madhu Reddy | 25 May 2026 11:14 AM ISTటెక్నాలజీ మారుతోంది అనడానికి ఇదో పెద్ద ఉదాహరణ, చైనాలోని వుహాన్‌లో డాక్టర్ కూర్చుంటే.. దాదాపు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. హైదరాబాద్‌లో రోగికి రోబో సాయంతో సర్జరీ జరిగింది. మన భారతీయ డాక్టర్ మహమ్మద్ గౌస్ కేవలం 90 నిమిషాల్లోనే ఈ అద్భుతాన్ని చేసి చూపించారు. 5G నెట్‌వర్క్, రోబోటిక్ చేతులు కలిసి వైద్య రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించాయి. దీని గురించిన పూర్తి వివరాలు చూద్దాం..
సరిహద్దులు దాటిన వైద్యం:
సాధారణంగా మేజర్ ఆపరేషన్ అంటే డాక్టర్లు పేషెంట్ పక్కనే ఉండి, ఎంతో జాగ్రత్తగా చేయాలి. కానీ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో లాగా వేలాది కిలోమీటర్ల దూరం నుంచి ఈ సర్జరీ జరిగింది. ఇక చైనాలోని టోంగ్జీ ఆసుపత్రిలో ఉన్న భారతీయ యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహమ్మద్ గౌస్, హైదరాబాద్‌లో ఉన్న ఒక రోగికి అత్యంత సంక్లిష్టమైన 'బ్లాడర్ రీకనెక్షన్' ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.
రోబో చేతులు.. డాక్టర్ కళ్లు:
ఈ అద్భుత ఆపరేషన్ వెనుక చైనా తయారు చేసిన అత్యాధునిక రోబోటిక్ సిస్టమ్ ఉంది. హైదరాబాద్‌లోని ఆపరేషన్ థియేటర్‌లో రోగికి అనస్థీషియా ఇచ్చి, లోపలి భాగాలను స్పష్టంగా చూసేలా 3D కెమెరాలను, ఆపరేషన్ చేయడానికి రోబోటిక్ చేతులను అమర్చారు. ఇక చైనాలో కన్సోల్ ముందు కూర్చున్న డాక్టర్ గౌస్, అక్కడి స్క్రీన్లపై రోగి లోపలి భాగాలను 3Dలో స్పష్టంగా చూస్తూ రోబోను కంట్రోల్ చేశారు.
5G వేగంతో ప్రాణం కాపాడారు:
ఈ సర్జరీ ఇంత పర్‌ఫెక్ట్‌గా జరగడానికి కారణం 5G నెట్‌వర్క్. చైనాలో డాక్టర్ తన చేతులను కదిలిస్తే, కేవలం 200 మిల్లీసెకన్ల (సెకనులో ఐదో వంతు) లోపే హైదరాబాద్‌లోని రోబోటిక్ చేతులు సరిగ్గా అలాగే కదిలి ఆపరేషన్ చేశాయి. ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే ఆదేశాలు అందడంతో ఈ కష్టమైన పని కేవలం 90 నిమిషాల్లోనే పూర్తైంది.
భౌగోళిక సరిహద్దులు, దూరాలు వైద్యానికి అడ్డుకావని ఈ ఘటన నిరూపించింది. ప్రపంచంలో ఎక్కడో ఉన్న నిపుణులైన డాక్టర్ల సేవలను, అత్యవసర సమయాల్లో మన ఊరిలోనే ఉండి ఈ టెక్నాలజీ ద్వారా పొందవచ్చు. రాబోయే రోజుల్లో ఈ సాంకేతికత మరిన్ని ప్రాణాలను కాపాడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..
