మెదడు ఆరోగ్యం కీలకం… జీవనశైలితో పెరుగుతున్న ప్రమాదాలు
మన శరీరంలోని అన్ని పనులకు మెదడే ప్రధానంగా పనిచేస్తుంది. అది సరిగా పనిచేస్తేనే మనం ఏ పని అయినా చేయగలం.
By: Madhu Reddy | 22 July 2026 1:55 PM ISTమన శరీరంలోని అన్ని పనులకు మెదడే ప్రధానంగా పనిచేస్తుంది. అది సరిగా పనిచేస్తేనే మనం ఏ పని అయినా చేయగలం. అయితే ప్రస్తుత ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, చెడు అలవాట్లు మన మెదడు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. మెదడును ఎలా కాపాడుకోవాలి? ప్రతి ఏటా జులై 22న జరుపుకునే 'వరల్డ్ బ్రెయిన్ డే' ప్రాముఖ్యత ఏంటి? మెదడు యాక్టివ్‌గా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం.
మన శరీరానికి 'మెదడే ప్రదానం :
మనం నడవాలన్నా, మాట్లాడాలన్నా, ఆలోచించాలన్నా చివరకు కన్ను మూసి తెరవాలన్నా మెదడు ఇచ్చే సిగ్నల్స్ అత్యంత ముఖ్యం. ఒక్కమాటలో చెప్పాలంటే శరీర అవయవాలన్నిటినీ నడిపించే కంట్రోల్ రూమ్ ఇది. ఇక మెదడు ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం సహకరిస్తుంది. కాబట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత.
జీవనశైలే పెద్ద శత్రువు:
ప్రస్తుత కాలంలో మన అలవాట్లే మెదడుకు పెద్ద ప్రమాదకరంగా మారాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన వేళకు నిద్రపోకపోవడం, గంటల తరబడి స్మార్ట్‌ఫోన్లు చూడటం, జంక్ ఫుడ్ తినడం, వ్యాయామం లేకపోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తోంది. ఇక దీనివల్ల చిన్న వయసులోనే జ్ఞాపకశక్తి తగ్గడం డిప్రెషన్, పక్షవాతం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి.
'వరల్డ్ బ్రెయిన్ డే' ఎందుకు జరుపుకుంటారు?:
ప్రజల్లో మెదడు ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ప్రతి ఏటా జులై 22న 'ప్రపంచ బ్రెయిన్ డే'గా నిర్వహిస్తారు. నాడీ సంబంధిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సకాలంలో వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని చెప్పడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
మెదడును పదునుగా ఉంచే చిట్కాలు:
పౌష్టికాహారం తీసుకోవాలి, ఆకుకూరలు, బాదం, వాల్‌నట్స్, పండ్లు తింటే మెదడుకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఇక గాఢ నిద్ర ముఖ్యం రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్ర మెదడుకు ఎంతో విశ్రాంతిని ఇస్తుంది. అంతేకాక వ్యాయామం అవసరం. రోజూ వాకింగ్ లేదా యోగా చేయడం వల్ల మెదడుకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇక మెదడుకు మేత పజిల్స్ పూరించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మెదడు ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటుంది.
గుండె ఎంత ముఖ్యమో.. మెదడు కూడా అంతే ముఖ్యం. కాబట్టి చిన్నపాటి జీవనశైలి మార్పులతో మన బ్రెయిన్‌ను సేఫ్‌గా ఉంచుకోవచ్చు. ఈ రోజే ఒక మంచి నిర్ణయం తీసుకోండి.. మీ మెదడును ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుకోండి.
